24 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎప్పుడు ?

రాష్ట్రంలో చదువుకున్న వాళ్ల సంఖ్య ఎంత? ప్రభుత్వపరంగా ఎంత మందికి ఉపాధి లభించింది? ప్రైవేటు ద్వారా ఎంత మందికి ఉపాధి లభించింది? స్వయం ఉపాధికి ఎలాంటి ప్రోత్సాహకం అందుతోంది? సంపన్న రాష్ట్రంలో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే దౌర్భాగ్య పరిస్థితులు ఎందుకొచ్చాయి? ప్రైవేటులో కానీ, ప్రభుత్వంలో కానీ ఉపాధి దొరక్క సంప్రదాయ వృత్తులకే పరిమితమైన వారి పరిస్థితి ఏమిటి? పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో నిరుద్యోగుల బతుకుల్లో నిరాశానిస్పృహలను తొలగించలేకపోవడం రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కాదా?  ఇలాంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత పాలకులపై ఉంది.
సబ్బండ వర్గాల పోరాటం ఫలితంగా తెలంగాణ ఏర్పడింది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో యువత ముఖ్యంగా స్టూడెంట్లు ప్రముఖ పాత్ర పోషించారు. విద్య, ఉపాధి లక్ష్యంగా పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో యువత నిరాశా నిస్పృహకు లోనై ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తే మనసు బరువెక్కుతోంది. సామాజిక సమానత్వంతో తెలంగాణ ప్రజలకు బంగారు బాటలు వేస్తారని ఆశించినా.. ఫలితాలు సంతృప్తికరంగా లేవు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ)లో వన్ టైం రిజిస్ట్రేషన్ కింద 24 లక్షల పైచిలుకు మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారంటే.. రాష్ట్రంలో నిరుద్యోగం ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్లు విడుదల చేసినా ప్రభుత్వ రంగంలో లక్ష నుంచి రెండు లక్షల వరకే ఉద్యోగాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి వీలు కలుగుతుంది. మిగతా 22 లక్షల పైచిలుకు నిరుద్యోగుల భవితవ్యంపై ఎలాంటి కార్యాచరణ ఉందో ప్రజలకు వివరించే పరిస్థితుల్లో ప్రభుత్వం లేకపోవటం విచారకరం. 
నౌకరీలు రాక కుంగిపోతున్నరు
ఉద్యమ సమయంలో స్టూడెంట్లు తమ చదువులకు స్వస్తి చెప్పి పోరాడారు. రాష్ట్రం వస్తే తమ పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే ఆశావాద దృక్పథంతో పేరెంట్స్​ కూడా వారిని ప్రోత్సహించారు. కానీ, పోరాడి సాధించిన రాష్ట్రంలో కూడా తమ బిడ్డలు ఆత్మహత్యలు చేసుకోవడం చూడలేకపోతున్నారు. రాష్ట్ర సాధన కోసం చదువులను, ఉద్యోగాలను పక్కన పెట్టి పోరాడిన యువకులకు దశాబ్దకాలంగా ఎదురుచూపులు, బాధలు తప్ప ఏమీ రాలేదు. ఆర్నెల్లకు ఒకసారి అదిగో డీఎస్సీ, ఇదిగో గ్రూప్ 2, ఉద్యోగాల భర్తీ అంటూ ప్రకటనల ద్వారా నిరుద్యోగులను కోచింగ్ సెంటర్లకు పరిగెత్తించి నిలువు దోపిడీకి కారకులయ్యారు. ఇరుకు గదుల్లో ఉంటూ భవిష్యత్తుపై ఎన్నో కలలతో బాధలు, అవమానాలను దిగమింగి పుస్తకాలతో కుస్తీ పట్టారు. అయితే తమకు సరైన ఉద్యోగం రాలేదనే మానసిక వేదనతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీంతో ఎంతో విలువైన మానవ వనరులు గాలిలో కలిసిపోతున్నాయి. పల్లెల నుంచి పట్టణాలకు వచ్చి పట్టా పుచ్చుకున్నప్పటికీ పైసా రాబడి లేక, తమ గోడు చెప్పుకోవడానికి దిక్కులేక తల్లడిల్లి పోతున్నారు. వయసు పెరిగి, బాధ్యతలు పెరిగి, సరిపోయే డబ్బులిచ్చే పని కనిపించడం లేదు. తమ బిడ్డలకు నౌకరీలు వస్తాయని ఆశించిన పేరెంట్స్ కూడా కుంగిపోతున్నారు. 
పొట్ట నిండే పరిస్థితి లేదు
సాఫ్ట్​వేర్​ ఎగుమతుల్లో దేశంలోనే ఫస్ట్​ ప్లేస్​లో ఉన్న తెలంగాణలో.. ఒక నిరుపేద నిరుద్యోగి పొట్ట నింపే పరిస్థితి కనబడటం లేదు. పెట్టుబడులను ఆకర్షించడంలో ముందున్నా, అనేక పరిశ్రమలను స్థాపించినా, స్థానికంగా ఉన్న యువకులకు ఉపాధి కల్పించడంలో పాలకులు సక్సెస్​ కాలేకపోయారనేది నిజం. ఆదాయ అసమానతలు పెరిగితే సమాజంలో శాంతిభద్రతల సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం ఉంది. అందువల్ల రాష్ట్రంలోని విద్యా సంస్థలు.. ప్రపంచ స్థాయి ఇనిస్టిట్యూట్లతో పోటీ పడేలా సిలబస్​ను, కొత్త కోర్సులను ప్రవేశపెట్టి యువత భవిష్యత్తును కాపాడాలి. రాష్ట్రానికి వస్తున్న అనేక సంస్థల్లో ఇక్కడ చదువుకున్న వారికే ఎక్కువగా ఉపాధి లభించినప్పుడే బంగారు తెలంగాణ సాకారం అవుతుంది. 
యూనివర్సిటీలను పట్టించుకోవట్లే
తెలంగాణ ఉద్యమానికి ఆయువుపట్టుగా పనిచేసింది యూనివర్సిటీలే. కానీ ఇప్పుడు అదే వర్సిటీల అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తున్నారు. యూనివర్సిటీలనే కాదు స్టూడెంట్లను కూడా నిండా ముంచుతున్నారు. స్టూడెంట్లు, నిరుద్యోగుల త్యాగాలను గుర్తించకపోగా, వారిలో ఐక్యతను దెబ్బ తీసి వారి జీవితాలను పణంగా పెడుతున్నారు. ఉస్మానియా, కాకతీయ వర్సిటీలు యువతలో ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని నింపేవి. ఉస్మానియాలో పీజీ సీటు సాధిస్తే ఏదో ఒక రకమైన ఉపాధి కచ్చితంగా వస్తుందనే భరోసా ఉండేది. కానీ, లైబ్రరీలో సీటు కోసం పోటీ పడిన, చెట్టు కింద స్టడీ చైర్లలో కూర్చొని చదివిన, ఆర్ట్స్ కాలేజీ లైట్స్ ముందు అర్ధరాత్రి వరకు పుస్తకాలతో కుస్తీ పట్టిన స్టూడెంట్లను ఉద్యమ నాయకుడు మరిచిపోయాడు. ఒకప్పుడు నిరంతరం ఏదో ఒక నోటిఫికేషన్లతో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగితే.. తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీల నుంచి బయటకు వచ్చిన యువతకు సరైన ఉపాధి లభించడం లేదు. కొందరు దిక్కుతోచని స్థితిలో జీవితాలను గడుపుతుంటే, మరికొందరు మానసిక ధైర్యం లేక జీవితాలకు ముగింపు పలుకుతున్నారు. 
స్కిల్​ డెవలప్​మెంట్​కు ఇంపార్టెన్స్​ ఇవ్వాలె
పేద, మధ్య తరగతి ప్రజలకు సంక్షేమ పథకాలతో కొంత ఊరట లభించినా దీర్ఘకాలంలో వారు స్వశక్తితో నిలదొక్కుకునే కార్యక్రమాలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. డిగ్రీ పట్టా అందుకున్న ఎంతో మంది యువత ప్రభుత్వపరంగా కానీ, ప్రైవేటుపరంగా కానీ ఉపాధి పొందలేకపోవడానికి ప్రధాన కారణం మార్కెట్ కు అవసరమైన నైపుణ్యాల కొరత. దీనికి ప్రధాన కారణం వర్సిటీలకు నిధులు అందకపోవడం, లెక్చరర్ల కొరత, ఆధునిక ల్యాబ్​లను, లైబ్రరీలను అభివృద్ధి చేయకపోవడం. ఈ నిర్లక్ష్యం కొన్ని దశాబ్దాల వరకు నిరుద్యోగుల కుటుంబాలపై, రాష్ట్ర ఆర్థిక ప్రగతిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందని అనడంలో సందేహం లేదు. ఏ రాష్ట్రమైనా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలంటే మానవ వనరులపై ప్రధానంగా దృష్టి పెట్టాలి. కానీ మానవ వనరుల అభివృద్ధికి అవసరమైన వినూత్న పథకాలు, కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టకపోవడం బాధాకరం. నాణ్యమైన విద్య సామాన్య ప్రజలకు అందిన రోజే తెలంగాణ రాష్ట్రం బలపడుతుంది. దేశానికి వెన్నెముక అవుతుంది. సంప్రదాయక వృత్తులను బలోపేతం చేస్తూ కొంత మేరకు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉపాధి సంపాదించుకునే అవకాశం కల్పిస్తున్నారు. కొన్ని సాంప్రదాయక వృత్తులను ప్రోత్సహించడం ద్వారా కొంత వెసులుబాటు కలిగినా, వారి జీవన విధానంలో, కుటుంబ ఆర్థిక పరిస్థితుల్లో పెద్దగా మార్పు రావటం లేదు. నాణ్యమైన ఉన్నత విద్యను, నైపుణ్యాలను అందించిన రోజు వారి జీవితాల్లో పేదరికాన్ని రూపుమాపడానికి ఆస్కారం ఉంటుంది తప్ప, స్వల్పకాలిక ఉపశమనం ద్వారా పేదరిక సమస్యకు పరిష్కారం లభించదు.

పల్లెలు స్మార్ట్​ కావాలె
పోరాటమే ఊపిరిగా భావించే తెలంగాణ బిడ్డలు ఆత్మస్థైర్యాన్ని కోల్పోయి ప్రాణాలు బలి పెట్టొద్దు. బరిగీసి కొట్లాడితే పేదవాడి బతుకులు మారుతాయని మరోసారి చైతన్య స్ఫూర్తి ప్రదర్శించాల్సిన అవసరం కనపడుతోంది. ప్రభుత్వం వెంటనే వర్సిటీల పునరుద్ధరణకు అవసరమైన నిధులను విడుదల చేయాలి. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి. రాష్ట్రవ్యాప్తంగా పట్టభద్రులకు వారి అభిరుచులకు అనుగుణంగా అవసరమైన నైపుణ్యాలను పెంపొందించే కార్యక్రమాలను వేగవంతం చేయాలి. ప్రైవేటు సంస్థల్లో ఉపాధి పొందడానికి అవసరమైన శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసి, పోటీ ప్రపంచంలో నిలదొక్కుకునేలా నిరుద్యోగ యువతను తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత ప్రభుత్వంపైనే ఉంది. సంప్రదాయ వృత్తులతో సాగదీసే జీవితం కాకుండా, రోబోట్ లతో మన పల్లెల్లో పిల్లలు ఆడుకునేలా విద్యా వ్యవస్థను తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఇన్నోవేషన్​కు తెలంగాణ కేరాఫ్​ అడ్రస్​గా వెలుగొందేలా ప్రణాళికను అమలు చేసి స్మార్ట్ సిటీల మాదిరిగా స్మార్ట్ పల్లెలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ స్టూడెంట్లు ప్రపంచం నలుమూలలకు విస్తరించి, రాష్ట్ర ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేసిన రోజే అమరవీరులకు నిజమైన నివాళి. -చిట్టేడి కృష్ణారెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్,హెచ్‌సీయూ.