నేర చరిత ఉన్న నాయకులకు శిక్షలెప్పుడు?

మనదేశంలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కులం పునాదులపై కొన్ని రాజకీయ పార్టీలు ఏర్పడ్డాయి. ఎంపీ, ఎమ్మెల్యేగా ఎన్నికల్లో పోటీ చేయాలంటే అన్ని రాజకీయ పార్టీలు కుల, ధనబలం ప్రాతిపదికన సీట్లు ఇస్తున్నాయి. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలంటే కులమే అర్హతగా మారిన క్రమంలో కొంత మంది ప్రజాప్రతినిధులు ఎంపీ, ఎమ్మెల్యే పదవులను అన్నిరకాల నేరాలు చేయడానికి లైసెన్సులుగా భావిస్తున్నారు. దీనికి తోడు వీరిపై నమోదు చేసిన కేసుల విచారణ ఏండ్ల తరబడి న్యాయస్థానాల్లో మగ్గుతోంది. ఇది వారికి వరంగా మారుతోంది. అనేక మంది ప్రజా ప్రతినిధులు తీవ్రమైన కేసుల విచారణను ఎదుర్కొంటూ కూడా బెయిల్​పై బయటకు వచ్చి ప్రజాప్రతినిధిగా ఎన్నికై దర్జాగా తిరుగుతున్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 8(3) ప్రకారం ఎవరైనా ఎంపీ, ఎమ్మెల్యేపై నేరారోపణలు రుజువై కింది కోర్టు దోషిగా నిర్ధారించి, కనీసం రెండు సంవత్సరాల జైలు శిక్ష విధించినట్లైతే, వారి శిక్షా కాలానికి అదనంగా ఆరు సంవత్సరాలు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులు. అదే చట్టంలోని సెక్షన్ 8(4) ప్రకారం ఎవరైనా సభ్యులు కింది కోర్టు దోషిగా నిర్ధారించి శిక్ష విధించిన తర్వాత మూడు నెలల లోపుగా పైకోర్టులో కింది కోర్టు తీర్పుపై అప్పీలు పిటిషన్ వేసినట్లయితే, ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు. దీనినే నేర చరిత ఉన్న నాయకులంతా తమకు అనుకూలంగా వాడుకుంటున్నారు.

సెక్షన్​ 8(4)ను కొట్టేసిన సుప్రీంకోర్టు
అయితే 2016లో లిల్లీ థామస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తూ ప్రజాప్రాతినిధ్య చట్టం-1951లోని సెక్షన్ 8(4) రాజ్యాంగ విరుద్ధమని చెపుతూ దానిని కొట్టేసింది. నేరస్తులుగా శిక్షపడిన ఎంపీ, ఎమ్మెల్యేలు పైకోర్టులో వారి అప్పీల్ పిటిషన్ తో సంబంధం లేకుండా, సెక్షన్ 8(3) ప్రకారం నేర చరిత ప్రజాప్రతినిధులు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులని తేల్చిచెప్పింది. అదేవిధంగా 2014లో మనోజ్ నారుల వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువరిస్తూ.. రాజ్యాంగం ప్రకారం ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులకు వారి కేబినెట్​లో మంత్రులుగా ఎవరినైనా నియమించుకునే అధికారాలు ఉన్నాయని తెలుపుతూనే, నేరచరిత్ర లేనివారిని మంత్రులుగా నియమించుకొని రాజ్యాంగ మౌలిక సూత్రాలను పరిగణనలోకి తీసుకుని, పరిపాలనలో ఆదర్శంగా నిలవాలని సూచించింది.

ఆలస్యమైతే హైకోర్టు సీజే అనుమతి అవసరం
2018లో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఫౌండేషన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పు సందర్భంగా చట్టసభల్లో నేర చరిత గల సభ్యుల సంఖ్య పెరగడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఎవరైనా ఎంపీలు, ఎమ్మెల్యేలపై నేరారోపణలో భాగంగా పోలీస్ శాఖ చార్జిషీటు దాఖలు చేసిన రోజు నుండి కింది స్థాయి కోర్టులు సంవత్సరంలోపు కేసు విచారణ పూర్తి చేసి, తీర్పును వెలువరించాలని ఆదేశించింది. లేనిచో, అదనపు సమయం కోసం సంబంధిత రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి వద్ద అనుమతి తీసుకొని కేసులను విచారించి త్వరితగతిన తీర్పులు వెలువరించాలని స్పష్టం చేసింది. అదేవిధంగా, రాజకీయ పార్టీలు నేరారోపణలు ఎదుర్కొంటున్న వారికి ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్లు కేటాయించినట్లైతే, వారి వివరాలను ఆయా పార్టీల వెబ్ సైట్లలో పెట్టాలని సూచిస్తూ, ఎన్నికల నోటిఫికేషన్  విడుదలైన రోజు నుంచి ఎన్నికల నాటికి, మూడు సార్లు సభ్యుల నేరాల వివరాలు ప్రజలకు తెలిసేవిధంగా న్యూస్​పేపర్లు, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రకటించాలని సూచించింది. ఇదే తీర్పులో న్యాయమూర్తులు ఆసక్తికరమైన కామెంట్​ చేశారు. దోషులుగా నిర్ధారించిన ఎంపీలు, ఎమ్మెల్యేలను శాశ్వతంగా ఎన్నికలకు అనర్హులుగా ప్రకటించే చట్టాన్ని ఏదో ఒక రోజు పాలకులు తెస్తారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు.

ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలె
2020లో అశ్విని కుమార్ ఉపాధ్యాయ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులను జారీ చేస్తూ, దేశంలోని ప్రతి జిల్లాలో నేరారోపణలు ఎదుర్కొంటున్న ఎంపీలు, ఎమ్మెల్యేల కేసుల విచారణ నిమిత్తం ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని సూచించింది. ఇందు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో అన్ని రాష్ట్రాల ప్రధాన న్యాయమూర్తులు తగిన ప్రతిపాదనలతో నివేదిక ఇవ్వాలని కోరింది. నేర చరిత కలిగిన నాయకుల కేసులపై సాధ్యమైనంత తొందరగా విచారణ పూర్తిచేసి చట్టసభల్లోని నేరస్తులను బయటకు పంపి ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడవలసిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, అన్ని రాజకీయ పార్టీలపైనా ఉంది.

కేసులు  పెరిగిపోతున్నయ్​
పార్లమెంట్, వివిధ రాష్ట్రాల అసెంబ్లీల్లో నేర చరిత గల సభ్యుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఈ సంఖ్య అంతకంతకూ పెరిగిపోతుండటంతో ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రమాదంలో పడుతోంది. 2004, 2009, 2014, 2019 లోక్​సభ ఎన్నికల్లో గెలుపొందిన వారిలో వరుసగా 24%, 30%, 34%, 43% మంది సభ్యులు వివిధ కేసుల్లో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. దేశవ్యాప్తంగా ఎంపీలు, ఎమ్మెల్యేలపై 4,442 కేసులు వివిధ కోర్టుల్లో విచారణలో ఉన్నవి. సదరు కేసుల విచారణకై 12 ప్రత్యేక కోర్టులు మాత్రమే ఉన్నవి. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలపైనా అనేక కేసులు విచారణలో ఉన్నాయి. 223 కేసుల్లో తుది తీర్పు వస్తే.. ఆరోపణలు ఎదుర్కొంటున్న నాయకులకు రెండు సంవత్సరాలకు పైగా జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కొన్ని కేసుల్లో 10 సంవత్సరాల జైలు శిక్ష లేదా యావజ్జీవ కారాగార శిక్ష కూడా విధించే అవకాశం ఉంది.

- కోడెపాక కుమారస్వామి, సామాజిక విశ్లేషకుడు