నల్గొండ, వెలుగు: నల్గొండ పట్టణంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా తయారైంది. ముఖ్యంగా పానగల్లు బైపాస్ నుంచి క్లాక్ టవర్ మీదుగా డీఈవో ఆఫీసు (దేవరకొండ రోడ్డు) వరకు హైవే జర్నీ నరకప్రాయంగా మారింది. ఎన్‌హెచ్ - 565 విస్తరణ పనులు మధ్యలోనే ఆగిపోయాయి. విస్తరణపై మున్సిపల్ అధికారులకు, నేషనల్ హైవే అథారిటీకి మధ్య పంచాయితీ నడుస్తోంది. ఈ హైవే రెండు లేన్లు అయినప్పటికీ నల్గొండ, హాలియా పట్టణంలో ట్రాఫిక్ ఎక్కువ ఉండటంతో నాలుగులేన్లుగా విస్తరించాలని అధికారులు భావించారు. హాలియా టౌన్‌తోపాటు, సాగర్ వరకు హైవే పనులు పూర్తయ్యాయి. కానీ, నల్గొండ టౌన్లో మాత్రం మూడు కిలోమీటర్ల మేర పనులు ఆగిపోయాయి. నేషనల్ హైవే అథారిటీతో జరిగిన అగ్రిమెంట్లోనే నల్గొండ టౌన్ రోడ్డు వెడల్పు ప్రతిపాదన లేదని సంబంధిత అధికారులు చెపుతున్నారు.
హైవే అథారిటీ నుంచి అనుమతి వస్తేనే...
నేషనల్ హైవే అథారిటీ నుంచి పర్మిషన్ వస్తే తప్ప పానగల్లు నుంచి డీవీకే రోడ్డు పనులు చేపట్టడం కుదరదని అధికారులు అంటున్నారు. రోడ్డు పోర్షన్తోపాటు, రోడ్డుకు ఇరువైపులా ఉన్న షాపులను తొలగించి, హైవే అథా రిటీకి అప్పగిస్తే తప్పా పర్మిషన్ రాదని హైవే అధికారులు అంటున్నారు. ఈ హైవేను వంద ఫీట్ల వెడల్పు పెంచాలని స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి హైవే అథారిటీని కోరారు. ఈ మేరకు మున్సిపాల్టీ నుంచి ప్రపోజల్స్ కూడా వెళ్లాయని అధికారులు చెపుతున్నారు. ఈ వెడల్పు కోసం ఇరువైపుల ఉన్న షాపులను కూల్చేసి, మున్సిపల్ పరిధి నుంచి రోడ్డు పోర్షన్ హైవే అథారిటీ కి అప్పగించిన తర్వాత మళ్లీ కొత్తగా టెండర్లు పిలిచి, రోడ్డు పనులు మొదలు పె ట్టాల్సి ఉంటుంది. హైవే అథారిటీ నుంచి పర్మిషన్ ఎప్పటికి వస్తుందో కూడా కచ్చితంగా చెప్పలేమని అంటున్నారు. ఇప్పటికే పానగల్లు నుంచి క్లాక్‌టవర్ వరకు రోడ్డు ఇరువైపులా ఉన్న వ్యాపారస్తులు షాపులు ఖాళీ చేసి హైదరాబాద్ రోడ్డు వైపునకు వెళ్లిపోయారు.
అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ కోసం అడ్డంగా తవ్వేశారు
హైవే వెడల్పు సమస్యను ఎటూ తేల్చకుండా వదిలేసిన మున్సిపల్ అధి కారులు.. క్లాక్‌టవర్ నుంచి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి వరకు వంద కోట్లతో చేప ట్టిన అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ కోసం రోడ్డును తవ్వి వదిలిపెట్టారు. డ్రైనేజీ పనులు పూర్తయినా.. రోడ్డు రిపేరు చేయకుండా చేతులు దులుపుకున్నారు. దీంతో ఈ రోడ్డులో వెళ్లే ప్రయాణికులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హైవే అథారిటీ కొత్త రోడ్డు వేస్తుందని చెప్పి కనీస మరమ్మతులు చేయడం లేదని తెలుస్తోంది. హైవే అథారిటీ నుంచి పర్మిషన్ వ చ్చే వరకు ఈ ఇబ్బందులు ఎదుర్కోక తప్పదని కౌన్సిలర్లు చెప్పడం గమనార్హం.