మహిళలపై దాడులు ఆగేదెన్నడు?

దేశంలోని మహిళలపై అత్యాచారాలు, దాడులు ఆగడం లేదు. నిర్భయ, దిశ ఘటనల్లో నిందితులకు కఠిన శిక్షలు పడినప్పటికీ మానవ మృగాల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. రాజ్యాంగం ప్రకారం మహిళలకు సమాజంలో రక్షణ కల్పించడం చట్టపరమైన అంశం. కానీ నేడు అనేక రూపాల్లో మహిళల హక్కుల ఉల్లంఘన జరుగుతోంది. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం 2019 సంవత్సరంలో 4,05,861 కేసులు నమోదు కాగా అందులో గృహహింస ద్వారా వేధింపులకు గురైన వారు30.9 శాతం ఉన్నారు. పురుషుల వల్ల ఇంటి వెలుపల దాడికి గురైన వారు 21.8 శాతం, కిడ్నాప్ అయిన వారు17.9 శాతం, అత్యాచారానికి గురైన వారు 7.9 శాతం ఉన్నారు. 2018లో 3,78,236 కేసులు నమోదు అయ్యాయి. 2018తో పోలిస్తే 2019లో  మహిళలపై జరుగుతున్న నేరాల సంఖ్య 7.9 శాతం పెరిగాయి. అత్యధికంగా ఉత్తరప్రదేశ్, మహారాష్ర్టలో కేసులు నమోదవుతున్నాయి. రోజుకు సుమారు 91 అత్యాచారాలు జరుగుతున్నాయంటే పరిస్థితి ఎంత ఆందోళనకరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.  మహిళల రక్షణలో ఇండియా ప్రపంచంలో133వ స్థానంలో ఉంది.  

దళితులపై ఆగని దాడులు

నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో గణాంకాలు ప్రకారం 2018 లో దేశవ్యాప్తంగా 2,957 మంది దళిత మహిళలు అత్యాచారానికి గురయ్యారు. ఇందులో 871 మంది బాధితులు మైనర్లే కావడం గమనార్హం. ప్రతిరోజూ 8 మంది దళిత మహిళలపై అత్యాచారం జరుగుతోందన్న లెక్కలు స్త్రీల హక్కుల రక్షణ అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు కావొస్తున్నా.. దళితులను దోపిడీకి గురిచేసే ఘటనలు ఆగడం లేదు. మహిళలపై నేరాలు7.3 శాతం పెరిగాయని, ప్రతి లక్షమందిలో దాదాపు 62.4 శాతం మంది అత్యాచారాలు, వేధింపులకు గురి అవుతున్నవారే అని క్రైమ్స్ ఇన్ ఇండియా –2019 నివేదిక వెల్లడించింది. మహిళలతో పాటు చిన్నారులపైనా వేధింపులు, దాడులు 2018తో పోలిస్తే 4.5 శాతం పెరిగాయి. ఇలాంటి భయాందోళన పరిస్థితుల్లో మహిళలకు రక్షణ కల్పించడం అత్యావశ్యకం. 

చట్టాలపై అవగాహన అవసరం

భారతదేశం సంస్కృతీ సాంప్రదాయలకు నిలయం. వేల ఏండ్లుగా స్ర్తీలను దేవతలుగా పూజించే దేశం. కానీ ప్రస్తుతం మహిళలపై జరుగుతున్న దాడులను చూస్తుంటే వారి భద్రత ప్రమాదంలో ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల హక్కుల రక్షణకు గృహహింస చట్టం, వరకట్న నిషేధ చట్టం, పోక్సో, నిర్భయ ఏపీలో దిశ లాంటి చట్టాలు తీసుకువచ్చాయి. ఇవి అత్యంత ప్రాధాన్యం గల చట్టాలే అయినప్పటికీ.. అమలులో చిత్త శుద్ధి లేకుంటే మహిళల హక్కులు కాపాడలేని పరిస్థితి తలెత్తుతుంది. అందుకే పాలకులు, అధికారులు మహిళా రక్షణ చట్టాల అమలులో క్రియా శీలకంగా, పక్షపాతం లేకుండా పనిచేయాలి. మహిళలు కూడా వారి రక్షణకు ప్రభుత్వాలు తీసుకొచ్చిన చట్టాల గురించిన అవగాహన పెంచుకోవాలి.

దర్యాప్తు వేగవంతం చేయాలె

మహిళల భద్రత విషయంలో ప్రజల ఆలోచన విధానం మారాలె. స్ర్తీలను రక్షించే బాధ్యత కేవలం ప్రభుత్వాలదే కాదు.. పౌర సమాజానిది కూడా. కుటుంబం నుంచి విద్యా సంస్థల వరకు మహిళలను గౌరవించే సంస్కృతిని పెంచాలి. పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయాలి. మహిళల రక్షణ హెల్ప్ లైన్స్ ఏర్పాటు చేసి, వెంటనే స్పందించేలా చూడాలి. ఎక్కువ సంఖ్యలో  ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసి, న్యాయ విచారణను వేగవంతం చేయాలి. 

-దుండ్ర కుమారస్వామి
అధ్యక్షుడు, జాతీయ బీసీ దళ్