![సన్న వడ్ల బోనస్ డబ్బులు ఎప్పుడిస్తరు](https://static.v6velugu.com/uploads/2025/02/when-will-the-bonus-money-for-the-thinskinned-people-be-paid-questioned-by-brs-mla-hareesh-rao_pdgBWN1YRJ.jpg)
- రెండు నెలలుగా రైతులు ఎదురు చూస్తున్నరు: హరీశ్ రావు
- అన్ని పంటలకు బోనస్ ఉత్త బోగస్ అని మండిపాటు
- రైతులు పండించిన కందులు మొత్తం కొనాలని డిమాండ్
- సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ
సిద్దిపేట, వెలుగు: అన్ని పంటలకు బోనస్ అన్న మాటలను కాంగ్రెస్ ప్రభుత్వం బోగస్‌గా మార్చిందని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. గత సీజన్‌లో సన్న వడ్లను కొనుగోలు చేసి రెండు నెలలు గడుస్తున్నా ఇంతవరకు రైతులకు డబ్బులు చెల్లించలేదని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా 8.64 లక్షల టన్నుల సన్న వడ్లకు రూ.432 కోట్ల బోనస్ డబ్బులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ సీఎం రేవత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు.
ఆదివారం సిద్దిపేటలో మీడియతో ఆయన మాట్లాడుతూ.. బోనస్ డబ్బుల కోసం రైతులు ఎదురు చూస్తున్నారని, వెంటనే డబ్బులు విడుదల చేయాలని కోరారు. రూ.432 కోట్లు బకాయిలున్నా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ చేస్తున్నామని ప్రగల్బాలు పలుకుతున్నారని విమర్శించారు. బోనస్ డబ్బుల గురించి రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారన్నారు.
అలాగే, కందులు పండించిన రైతుల నుంచి కేవలం మూడు క్వింటాళ్లు మాత్రమే కొంటామని అధికారులు షరతులు విధించడం ప్రభుత్వానికి తెలిసే జరుగుతున్నదా అని ప్రశ్నించారు. ఎకరాకు 7 నుంచి 10 క్వింటాళ్లు పండితే అధికారులు 3 క్వింటాళ్లు మాత్రమే కొంటామంటే.. మిగిలినవి నష్టానికే అమ్ముకోవాలా అని నిలదీశారు. క్రాప్ బుకింగ్ చేసుకోలేదనే నెపంతో రైతులు పండించిన కందులను అధికారులు కొనుగోలు చేయడం లేదని, ఈ విషయంపై ప్రభుత్వం జోక్యం చేసుకుని పంటనంతా కొనేలా ఆదేశాలివ్వాలని డిమాండ్ చేశారు.
సన్ ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలు పెట్టండి..
రాష్ట్రంలో సన్ ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలను ఇప్పటికీ ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని హరీశ్ రావు అన్నారు. సన్ ఫ్లవర్ సాగును ప్రొత్సహించిన ప్రభుత్వం.. ఇప్పుడు పంటను కొనుగోలు చేయకపోవడం ఎంటని ప్రశ్నించారు. వెంటనే రాష్ట్రవ్యాప్తంగా సన్ ఫ్లవర్ కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. కొత్త పాస్ బుక్‌లు అందుకున్న రైతులకు రైతుబంధు పడడం లేదని ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని గ్రామాల్లో మాట్లాడుకుంటున్నారని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని ప్రజలు ఎదుచూస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ తవ్వుకున్న ఆరు గ్యారంటీల సమాధిలో ఆ పార్టీ సమాధి అవుతుందని జోస్యం చెప్పారు. సంతృప్తి, సంక్షేమం బీఆర్ఎస్ పాలనైతే.. సంక్షోభం, అసంతృప్తి, అసహనం కాంగ్రెస్ పాలన విధానమని మండిపడ్డారు. అంతకుముందు సిద్దిపేటలో యాదవ గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమంలో హరీశ్ రావు పాల్గొని, మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో యాదవులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని ఆరోపించారు. యాదవుల్లో ఒక్కరికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. అలాగే, రెండో విడత గొర్రె పిల్లలు ఇవ్వకుండా డీడీలు వాపస్ ఇచ్చారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి డిల్లీకి చక్కర్లు కొడుతున్నా రాహుల్ గాంధీ అపాయింట్‌మెంట్ దొకడం లేదన్నారు.
కేసీఆర్ తెలంగాణ ఆత్మ గౌరవం కోసం నిలబెడితే.. రేవంత్ రెడ్డి తెలంగాణ గౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టారని విమర్శించారు. అంతకు ముందు సి ద్దిపేట నియోజకవర్గం నంగునూర్ మండలం ఘన్‌పూర్‌లో నిర్మిస్తున్న పంప్ హౌస్ నిర్మాణ పనుల జాప్యంపై ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిట్టపల్లిలో ప్రమాదవశాత్తు దగ్ధమైన ఇల్లును హరీశ్‌రావు పరిశీలించి, బాధితుడు బిక్షపతికి రూ.50 వేలు ఆర్థిక సహాయం అందించారు.