సంగారెడ్డి, వెలుగు : సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంప్లెక్స్నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. 13 నెలలుగా కేవలం బేస్మెంట్ స్థాయిలోనే ఉన్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపంతోనే పనుల్లో డిలే కొనసాగుతోందని పలువురు ఆరోపిస్తున్నారు. సంగారెడ్డి టౌన్ లోని బైపాస్ రోడ్డు మూలమలుపు వద్ద రెండెకరాల స్థలంలో రూ.6.70 కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. అందరికీ సౌకర్యంగా ఉండాలని ఉద్దేశంతో ఒకే దగ్గర వెజ్, నాన్ వెజ్, పూలు, పండ్లు, కూరగాయలు ఇతరత్రా అమ్మకాలకు సంబంధించి 104 షాపులలో కాంప్లెక్స్ నిర్మించేందుకు ప్లాన్ చేశారు. ఇందుకు గాను 2021 డిసెంబర్ 18న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. వెంటనే టెండర్లు పూర్తిచేసి కాంట్రాక్టర్ కు పనులు అప్పగించారు. ఏడాదిలోగా కాంప్లెక్స్ నిర్మాణ పనులు పూర్తి చేయాలన్న నిబంధనలు ఉన్నాయి. కానీ ఏడాది దాటినా ఇంకా పునాది స్థాయిలోనే పనులు కొనసాగుతున్నాయి.
నాణ్యత లోపాలు..
భారీ స్థాయిలో జరుగుతున్న దుకాణా సముదాయాల నిర్మాణంలో నాణ్యత లేని స్టీల్, సిమెంట్, ఇసుక వాడాల్సిన చోట డస్ట్ వాడుతున్నట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. పనుల ఆలస్యంపై సంబంధిత కాంట్రాక్టర్ ను ప్రశ్నించినా పట్టించుకోవడం లేదని వారు వాపోతున్నారు. పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం ఆఫీసర్ల నిర్లక్ష్యంవల్లే ఈ పరిస్థితి ఉందని పలువురు వ్యాపారులు విమర్శిస్తున్నారు.
కంప్లీట్ అయితే ఎన్నో ప్రయోజనాలు..
ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కాంప్లెక్స్ పనులు త్వరగా పూర్తి చేస్తే పట్టణ ప్రజలకు ప్రయోజనం ఉంటుంది. దాదాపు 10 గ్రామాల ప్రజలు కొనుగోళ్ల కోసం సంగారెడ్డికే వస్తుంటారు. సంగారెడ్డి మున్సిపల్ పరిధిలో ప్రస్తుతం నాలుగు సంతలు కొనసాగుతుండగా, పోతిరెడ్డిపల్లి చౌరస్తా, బైపాస్ రోడ్డు, పాత బస్టాండ్ లోని భవానీ మందిర్, సినిమా రోడ్డులో ట్రాఫిక్ జామ్ అవుతోంది. మార్కెట్ సముదాయం పూర్తయితే ట్రాఫిక్ సమస్య తీరుతుంది. అలాగే టౌన్ లో ఎక్కడపడితే అక్కడ కొనసాగుతున్న మాంసం విక్రయాలకు చెక్ పెట్టవచ్చు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కాంప్లెక్స్ ను త్వరగా అందుబాటులోకి తెచ్చేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.