నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఆరేండ్లు గడిచినా లక్ష్యానికి ఆమడ దూరంలోనే ఉన్నది. రాష్ట్రంలో 1.25 కోట్ల ఎకరాలకు సాగునీటిని అందిస్తామని, ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీటి సౌకర్యం కల్పిస్తామని 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రకటించారు. అయితే ఆ హామీ ఎప్పటికి పూర్తవుతుందో తెలియడం లేదు.
భారీ, మధ్యతరహా ప్రాజెక్టులన్నీ కలిపి రాష్ట్రంలో మొత్తం 38 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. ప్రాణహిత చేవెళ్లను కాళేశ్వరంగా, పాలమూరు ఎత్తిపోతలను జూరాల నుంచి శ్రీశైలానికి తరలించడం, రాజీవ్ దుమ్ముగూడెం, ఇందిరా దుమ్ముగూడెం ప్రాజెక్టులను సీతారామ ప్రాజెక్టు పేరుతో రీడిజైన్ చేశారు. కాళేశ్వరం కింద 18 లక్షల ఎకరాలు, పాలమూరు ఎత్తిపోతల కింద 12.30 లక్షల ఎకరాలు, సీతారామసాగర్ నుంచి 6.74 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటి సౌకర్యం కల్పిస్తామని ప్రకటించారు.
మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమ-1, 2, కోయిల్సాగర్ ప్రాజెక్టులతోపాటు, ఆదిలాబాద్ జిల్లాలోని 20 మధ్యతరహా ప్రాజెక్టులు, శ్రీరాంసాగర్ రెండో దశ, వరద కాలువ పనులు ఎక్కడివక్కడే ఉన్నాయి. 2004 నుంచి 2014 వరకు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రూ.92 వేల కోట్లు ఖర్చు చేయగా, టీఆర్ఎస్ ప్రభుత్వం 2014-–2020 వరకు రు.83వేల కోట్లు ప్రాజెక్టులకు ఖర్చు చేసింది. 2004 నుంచి 2016 వరకు నూతన ఆయకట్టు 11 లక్షల ఎకరాలు కాగా, లక్ష ఎకరాలు స్థిరీకరణ కింద నీటిపారుదల సౌకర్యం కల్పించారు. కొత్తగా 558 టీఎంసీలను వినియోగంలోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బచావత్ తీర్పు ప్రకారం కృష్ణానదిలో 299 టీఎంసీలు, గోదావరిలో 965 టీఎంసీల నికర జలాలు తెలంగాణ వినియోగించుకోవాలి. మొత్తం 1,264 టీఎంసీలతోపాటు, 120 టీఎంసీల భూగర్భ జలాలను కూడా వినియోగంలోకి తేవాలి. ఆశ్చర్యమేమిటంటే బచావత్ కేటాయించిన నికర జలాలను ఈ రోజుకూ వాడుకోలేకపోతున్నాం. ఇప్పటి వరకు మొత్తం రాష్ట్రంలో మైనర్ ఇరిగేషన్తో పాటు 70 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీటిని అందించారు. ఇందులో 25 లక్షల ఎకరాల ఆయకట్టు మైనర్ ఇరిగేషన్ కింద సాగవుతున్నది.
60 శాతం కూడా పూర్తికాని కాళేశ్వరం
కాళేశ్వరం ప్రాజెక్టుకు 2016 మే 2న కేసీఆర్ శంకుస్థాపన చేశారు. 2020 మార్చి నాటికి రూ.63,541 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో బడ్జెట్ నుంచి రూ.23,901 కోట్లు, బ్యాంకుల అప్పు ద్వారా రూ.39,640 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంత వరకు ప్రాజెక్టు పనులు 60 శాతం కూడా పూర్తికాలేదు. ప్రస్తుతం కాళేశ్వరం ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.1.20 లక్షల కోట్లకు పెరిగింది. ప్రారంభంలో రు.75వేల కోట్లుగా అంచనా వేశారు. శ్రీరాంసాగర్ పునరుజ్జీవన పథకం, నిజాంసాగర్, కడెం ప్రాజెక్టులకు నీటిని సరఫరా చేసే ఉద్దేశంతో కాళేశ్వరం కింద 38 లక్షల ఎకరాల ఆయకట్టును లక్ష్యంగా పెట్టుకున్నారు. శ్రీరాంసాగర్కు 60 టీఎంసీల నీటిని కాళేశ్వరం నుంచి వరద కాల్వ ద్వారా నింపాలి. కాళేశ్వరం నూతన ఆయకట్టు కింద 18.25 లక్షల ఎకరాలు సాగులోకి తేవాలి. అయితే మల్లన్నసాగర్ ప్రాజెక్టు పూర్తికాకుండా దిగువకు నీరు వెళ్లడం సాధ్యంకాదు. కానీ బైపాస్ ద్వారా కొండపోచమ్మకు 10 టీఎంసీల నీటిని తరలించి సాగునీటిని సరఫరా చేస్తున్నట్లు రైతులకు భ్రమలు కల్పిస్తున్నారు. ఈ సంవత్సరం జూన్ 1 నుంచి 23 అక్టోబర్ వరకు అధిక వర్షాల వల్ల 75 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందింది. ఇదంతా కాళేశ్వరం నీటితోనేనని ప్రచారం జరుగుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వలు, నిర్మాణాలు బలహీనంగా ఉండడంతో గండ్లు పడుతున్నాయి. నిర్మాణంలో నాణ్యత లోపించినట్లు పరిశీలకులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టుకు కావాల్సిన నీటిని ఇంకా సేకరించాల్సి ఉన్నది. ఒక ప్రణాళికను రూపొందించి దానిని అమలు జరపడానికి బదులు అనేక సందర్భాల్లో డిజైన్స్ మార్చారు. మల్లన్నసాగర్ పూర్తయి నిజాంసాగర్కు ఒక కాల్వ ద్వారా, చిట్యాలకు మరో కాల్వ ద్వారా నీటి సరఫరా పూర్తి చేయడానికి మరో ఏడెనిమిదేండ్లు పడుతుంది. ఇప్పుడేసిన ప్రాజెక్టు బడ్జెట్ అంచనా మరింత పెరిగే అవకాశం ఉంది.
అంచనా వ్యయం పెరిగిపోతోంది
ఆదిలాబాద్ జిల్లాలో 7, ఖమ్మం జిల్లాలో 3, నిజామాబాద్ జిల్లాలో 2 ప్రాజెక్టులు 20 ఏండ్లుగా నిర్మాణాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ప్రాజెక్టులన్నీ రూ.70 కోట్ల లోపు బడ్జెట్ గలవే. ఆదిలాబాద్ జిల్లాలో మరో 12 ప్రాజెక్టులు పూర్తిచేయడానికి రూ.1,500 కోట్లు సరిపోతాయి. కానీ ప్రభుత్వం ఆదిలాబాద్, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాల ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం లేదు. సర్వరోగ నివారిణిగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాత్రమే కేటాయింపులు చేస్తున్నారు. మైనర్ ఇరిగేషన్ కింద రాష్ట్రంలో 46,531 చెరువులుండగా, ఐదు విడతలుగా 23 వేల చెరువులకే రిపేర్లు చేశారు. ఈ వరదల్లో 150 చెరువులకు గండ్లు పడ్డాయి. అలాగే ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్కు నిధులు కేటాయించకపోవడంతో ఆ శాఖ నిర్వహిస్తున్న 767 లిఫ్ట్ పథకాలు విస్తరణ కాలేకపోతున్నాయి. ఐడీసీ కింద 4.44 లక్షల ఎకరాల ఆయకట్టు సాగు కావాల్సి ఉన్నది. అన్ని వనరులను వినియోగించుకోవడం ద్వారా రాష్ట్రంలో 80 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీటిని ఇచ్చే అవకాశముంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మైనర్, మీడియం ఇరిగేషన్లపై దృష్టి పెట్టకపోవడం వల్ల కేటాయించిన బడ్జెట్ ప్రయోజనం పొందడం లేదు. భారీ ప్రాజెక్టులు ఎప్పుడు పూర్తవుతాయో తెలియదు. బడ్జెట్లు మాత్రం లక్షల కోట్లకు పెరిగిపోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా 70-–80 శాతం పూర్తయిన ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తిచేయాలి. మైనర్ ఇరిగేషన్, ఐడీసీకి కేటాయింపులు పెంచాలి. మహబూబ్నగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లోని ప్రాజెక్టులకు తగినన్ని నిధులు కేటాయించి ఏడాదిలోపు పూర్తిచేయాలి. ఆ విధంగా సాగునీటి బడ్జెట్కు కేటాయింపులు చేయాలి.
సీతారాం సాగర్
2016 ఫిబ్రవరి 18న రూ.7,926 కోట్లతో 6,74,387 ఎకరాలకు సాగునీరు అందించడం లక్ష్యంగా దుమ్ముగూడెం వద్ద రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ను రీ డిజైన్ చేశారు. ఈ ప్రాజెక్టులో ఇంత వరకు రూ.2,855 కోట్లే వ్యయం జరిగింది. ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలకు నీటి సౌకర్యం కల్పించడానికి ఈ ప్రాజెక్టు డిజైన్ను రూపొందించారు. ఇంత వరకు భూసేకరణ పూర్తిగా జరగలేదు. పనులు నత్తనడకన సాగుతున్నాయి.
ఇవన్నీ పూర్తి కావడానికి పదేళ్లు పడుతుంది
2019–-20 బడ్జెట్లో మొత్తం ఇరిగేషన్కు రూ.7,714 కోట్లు కేటాయించగా 2020-–21లో రూ.10,451 కోట్లే కేటాయించారు. ఏఎంఆర్ ప్రాజెక్టుకు 3 కోట్లు, కల్వకుర్తికి 4 కోట్లు, భీమాకు 25 కోట్లు, డిండికి 70 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ పద్ధతిలో ఇరిగేషన్కు కేటాయింపులు జరిపితే మరో దశాద్దం గడిచినా ఏ ఒక్క ప్రాజెక్టూ పూర్తికాదు. ప్రస్తుత ప్రభుత్వ అంచనా ప్రకారం ప్రాజెక్టులన్నీ పూర్తి కావాలంటే రూ.2,11,535 కోట్లు కావాలి. ఇప్పటి వరకు చేసిన వ్యయం భారీ ప్రాజెక్టులపై రూ.1,07,916 కోట్లే. బడ్జెట్ నుంచి కేటాయింపులు చేయలేని పరిస్థితుల్లో కాళేశ్వరం, పాలమూరు, సీతారామ సాగర్ లను ఇరిగేషన్ కార్పొరేషన్ కిందకు తేవడం జరిగింది. శ్రీరాం సాగర్ వరద కాల్వ, శ్రీరాంసాగర్ 2వ దశకు ఇంత వరకు నీటి విడుదల లేదు. రెండవ దశ కింద కాకతీయ కాల్వ 284వ కిలోమీటర్ నుంచి 364వ కిలోమీటర్ వరకు ప్రధాన కాల్వ పూర్తయినప్పటికీ పంట కాల్వల్లో, బ్రాంచ్ కాల్వల్లో తుమ్మలు మొలిచి నీరు వెళ్లలేని స్థితిలో ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రూ.82 వేల కోట్లు వ్యయం చేసి ఈ ఆరేండ్లలో 6 లక్షల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే నీరివ్వడం జరిగింది. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా ప్రాజెక్టుల క్రింద బ్రాంచ్ కాల్వలు, పంట కాల్వలు లేకపోవడంతో నీరు వృథాగా పోతున్నది. రాష్ట్రంలోని 12 మధ్యతరహా ప్రాజెక్టులకు మార్చి 2005లో రూ.1,800 కోట్లతో 1.72 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వడానికి ప్రణాళిక రూపొందించారు. 15 ఏండ్లు గడిచినా ఇప్పటికీ 53,697 ఎకరాలకే సాగునీటి వనరులు కల్పించారు.
ఎటూ తేలని పాలమూరు
పాలమూరు రీడిజైన్ పనులకు 2015 జూన్ 13న భూత్పూర్ మండలం కరివెన గ్రామం వద్ద కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఇంత వరకు రూ.5,372 కోట్లు ఖర్చు చేశారు. ప్రస్తుతం పనులు నత్తనడకన సాగుతున్నాయి. భూసేకరణ పూర్తికాలేదు. కాళేశ్వరంపైనే దృష్టి పెట్టడంతో పాలమూరు నిర్లక్ష్యానికి గురైంది. గతంలో ఈ ప్రాజెక్టును జూరాల నుంచి కోయిల్కొండకు డిజైన్ చేశారు. తర్వాత దాన్ని జూరాల నుంచి 250 కిలోమీటర్ల దిగువన శ్రీశైలం ప్రాజెక్టుకు మార్చారు.దీని వల్ల రూ.38,500 కోట్ల బడ్జెట్ రూ.75 వేల కోట్లకు పెరిగింది. మరింత ఆలస్యం అవుతుండటంతో ఇది లక్ష కోట్లకు పెరిగే అవకాశముంది. ఈ ప్రాజెక్టుకు డిండి ప్రాజెక్టును లింక్ చేశారు. దీంతో కల్వకుర్తి ఆయకట్టులోని 25 వేల ఎకరాలకు పైగా కాల్వ తవ్వకాలకు భూములు సేకరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో 3.5 లక్షల ఎకరాలకు సాగునీటి వనరులు కల్పించాల్సి ఉండగా నేటికీ నిర్లక్ష్యానికి గురవుతున్నది. ముఖ్యంగా నారాయణపేట జిల్లాకు జూరాల నుంచి ఆమోదించిన ప్రాజెక్టును రద్దు చేయడంతో ఆ జిల్లా ఆయకట్టును పాలమూరు ఆయకట్టుకు కలిపినట్లు ప్రభుత్వం చెబుతున్నది. కానీ డిజైన్లో కొద్ది ప్రాంతం మాత్రమే గుర్తించారు. మహబూబ్నగర్ జిల్లాలో 125 కిలోమీటర్లకు పైగా కృష్ణానది ప్రవహిస్తున్నా ఆ జిల్లాలోని కరువు ప్రాంతాలకు నీటి సౌకర్యం అందడం లేదు. జూరాలకు 17.90 టీఎంసీలు, ఆర్డీఎస్కు 15.80 టీఎంసీలు బచావత్ ట్రిబ్యునల్ కేటాయించినా ఆ నీటిలో 75 శాతమే ఆ జిల్లాలో వాడుకుంటున్నారు. బ్రిజేశ్ కమిటీ మధ్యంతర తీర్పులో జూరాలకు మరో 9 టీఎంసీలు కేటాయించింది. కానీ జూరాల ముంపు గ్రామాలైన మనిగడ్డ, బూడిదపాడు, కుర్వకర్ల, అగ్రహార గ్రామా లకు పరిహారం ఇవ్వకపోవడంతో ప్రాజెక్టులో నీటిని నిలుపడానికి కర్నాటక ప్రభుత్వం ఆమోదించడం లేదు. 9.5 టీఎంసీలకు బదులు 7 టీఎంసీలే నిల్వ పెడుతున్నారు. పాలమూరు ఎత్తిపోతల ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేని పరిస్థితి ఉన్నది.-సారంపల్లి మల్లారెడ్డి, ఉపాధ్యక్షుడు, ఆలిండియా కిసాన్ సభ