విద్యాశాఖలో సంక్షోభం తొలగేదెన్నడు? : చావ రవి,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టీఎస్ యూటీఎఫ్ 

లెక్కకు మిక్కిలి ఉపాధ్యాయ ఖాళీలతో విద్యాశాఖలో తీవ్రమైన సంక్షోభం నెలకొన్నది. న్యాయ వివాదాల పేరుతో  ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలను పట్టించుకోకుండా తాత్సారం చేస్తున్న ప్రభుత్వమే ఇందుకు బాధ్యత వహించాలి. పదిహేడేళ్లుగా పర్యవేక్షణ అధికారుల భర్తీ లేదు. ఎనిమిదేళ్లుగా పదోన్నతులు, ఐదేళ్లుగా బదిలీలు లేవు. డీఈవో, డిప్యూటీ ఈవో, ఎంఈవో, డైట్, బీఎడ్ కాలేజీ లెక్చరర్ల పోస్టులు 95 % ఖాళీగా ఉన్నాయి. 2000 పైగా హైస్కూళ్ల గెజిటెడ్ హెచ్ఎంలు, 7200 స్కూల్ అసిస్టెంట్, 2100 ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుల పోస్టులు,1000 పైగా మోడల్ స్కూల్ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రపతి నూతన ఉత్తర్వుల ప్రకారం సర్వీసు నిబంధనలపై వివాదం సమసిపోతుందని, సంక్షోభం పరిష్కారం అవుతుందని ఆశించాం. పీవో- 2018 పై కూడా న్యాయస్థానాల్లో కేసులు నడుస్తున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల తాయిలంగా వినియోగించుకుంటున్న పండిట్, పీఈటీల అప్​గ్రేడేషన్ పై న్యాయ వివాదం అపరిష్కృతంగానే ఉన్నది. పండిట్​లు, పీఈటీల అప్​గ్రేడేషన్ పై కొన్ని సంఘాల అవకాశవాద, ద్వంద్వ వైఖరే ఈ సంక్షోభానికి కారణం. కనీసం హెచ్ఎంలు, ఎస్ఏల ఖాళీలను యాజమాన్యం వారీగానైనా ప్రమోషన్ల ద్వారా భర్తీ చేస్తే బడుల్లో సబ్జెక్ట్​ టీచర్ల కొరత తీరుతుందని, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందని భావించాం. మూడేండ్లేగా ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ, జాక్టో ఆధ్వర్యంలో ఐక్య పోరాటాలు నిర్వహించాం. అన్ని శాఖల్లో పదోన్నతులు ఇచ్చారు. కానీ ఉపాధ్యాయులకు మాత్రం ఇవ్వలేదు సరికదా... పోరాటం చేస్తున్న నాయకులపై క్రిమినల్ కేసు పెట్టారు. 

ప్రక్రియను ఆపాలనే లక్ష్యం వద్దు..

పీవో 2018కి అనుగుణంగా నూతన క్యాడర్లలో ఉపాధ్యాయుల కేటాయింపు తర్వాత పదోన్నతులు వస్తాయని ఆశించాం. ప్రభుత్వం ఏకపక్షంగా జీవో317ను విడుదల చేసి, అభ్యంతరాలను బుల్డోజ్ చేస్తూ  ఉపాధ్యాయుల శాశ్వత కేటాయింపు పూర్తి చేశామనిపించింది. నష్టపోయిన ఉపాధ్యాయులు వేలాదిగా హైకోర్టులో కేసులు వేశారు. ఏడాది నుంచి యూఎస్పీసీ ఆధ్వర్యంలో వివిధ రూపాల్లో ఆందోళన, పోరాటాలు నిర్వహించిన తరువాత తప్పని పరిస్థితుల్లో  జనవరి 15 న విద్యాశాఖమంత్రి, ఆర్థిక మంత్రి ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి యాజమాన్యం వారీగా బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘ విరామం తరువాత బదిలీలు, పదోన్నతులు నిర్వహిస్తున్నందున ప్రక్రియ సజావుగా సాగేందుకు టీచర్లు, సంఘాలు సహకరించాలని మంత్రులు కోరారు. అందుకు సంఘాలూ ఓకే అన్నాయి. బదిలీ నిబంధనలపై అధికారులతో జరిగిన చర్చల్లో ఉపాధ్యాయులు అందరికీ బదిలీ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వాలని, జిల్లాల పరిధి తగ్గినందున స్పెషల్ కేటగిరీ పాయింట్లు ఐదుకు తగ్గించాలని యూఎస్పీసీ పక్షాన చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకుని ఉంటే బదిలీలపై న్యాయ వివాదాలు వచ్చి ఉండేవి కాదు. జీవో317 పై న్యాయస్థానంలో స్టే రాకుండా శ్రద్ధచూపిన ప్రభుత్వం కౌన్సెలింగ్ నిబంధనల జీవోపై స్టే రాకుండా అడ్డుకోలేక పోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రక్రియను ఆపాలనే లక్ష్యంతో ఉపాధ్యాయుల ఉమ్మడి ప్రయోజనాలకు వ్యతిరేకంగా రాజ్యాంగపరమైన మౌలిక అంశాలను లేవనెత్తి వివాదాస్పదం చేయటమే విషాదకరం.

సత్వర చర్యలు అవసరం

గురుకుల విద్యాసంస్థలు, మోడల్ స్కూల్స్ సొసైటీల ఆధ్వర్యంలో రన్​అవుతున్నందున రాష్ట్రపతి ఉత్తర్వుల అమలు నిర్బంధం కాదు. అయినా నిర్వహించబూనుకున్నప్పుడు ఉద్యోగుల విభజనలో గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుని వివాదరహితంగా రీఅలైన్​మెంట్ ప్రక్రియను అమలు చేసి ఉండాల్సింది. లేనందున ప్రభావితమైన ఉపాధ్యాయులు హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఇప్పుడు రీ అలైన్​మెంట్ పై హైకోర్టులో కేసు పరిష్కారం అయితే గానీ ఆయా విద్యాసంస్థల్లో బదిలీలు, పదోన్నతులు చేపట్టే పరిస్థితి లేదు. సుప్రీం కోర్టు, హైకోర్టులో ఉన్న న్యాయ వివాదాల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చొరవచూపాలి. పర్యవేక్షణ అధికారుల పోస్టులతో సహా వేసవిలో అన్ని యాజమాన్యాల ఉపాధ్యాయులకు బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను చేపట్టాలి. తద్వారా ఏర్పడిన ఖాళీలకు ప్రత్యక్ష నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చి సత్వరమే భర్తీ చేయాలి. - చావ రవి,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, టీఎస్ యూటీఎఫ్