సమాచార చట్టం కమిషనర్ల నియామకం ఎప్పుడు?

సమాచార చట్టం కమిషనర్ల నియామకం ఎప్పుడు?

ప్రజల హక్కులను అంతగా గుర్తింపజేసిన చట్టం ఏదైనా ఉంది..అంటే అది సమాచారహక్కు చట్టం-2005 మాత్రమే!  తెలంగాణాలో రాష్ట్ర స్థాయిలో ఉండే కమిషనర్ల వ్యవస్థను సకాలంలో నియమించకపోవడం మూలంగా ప్రజల నుంచి వచ్చిన సుమారు 17వేల అర్జీలు, సమాచార హక్కు కార్యాలయంలో మూలనపడి మూలుగుతున్నాయి. కమిషనర్లు లేకపోవడం మూలంగా ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో  కేటాయించిన 47మంది ఉద్యోగులు  నిస్సహాయులుగా మిగిలిపోయారు.  పరిష్కారం చూపాలసిన ప్రభుత్వం విస్మరించడంతో రాష్ట్రంలో అవినీతిపరులు యథేచ్ఛగా చెలరేగిపోతున్నారు.  

పోరంఫర్ గుడ్ గవర్నెన్స్ కు చెందిన మాజీ ఐఏఎస్ పద్మనాభ రెడ్డి రెండోసారి హైకోర్టు తలుపుతట్టిన తర్వాత కోర్టు ఉత్తర్వులను గౌరవించడంలో బాగంగా ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం 11జూన్2024న 10మంది కమిషనర్లు, ఒక ప్రధాన కమిషనర్  నియామకం కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. స్పందన కూడా బాగావచ్చింది. ఈ పదవుల కోసం మాజీ ఐఏఎస్, ఐపీఎస్, రిటైర్డ్ జడ్జీలు, అర్హత ఉన్నవారి నుంచి 700పైగా దరఖాస్తులు  వచ్చాయి. ఇక ముఖ్యమంత్రి, మరో  మంత్రి,  ప్రతిపక్ష నాయకుడు సమావేశమై దరఖాస్తులు పరిశీలించి నియామకం చేసి గవర్నర్ ఆమోదం పొందాల్సి ఉంటుంది. అయితే, గత ఆరు మాసాలుగా ఎదురుచూసిన ప్రజలకు నిరాశే ఎదురైంది. 

గత ప్రభుత్వంఎడాది జాప్యం చేస్తే.. ఈ ప్రభుత్వం మరో ఏడాది సమయం తీసుకుంది?  వెరసి రెండేళ్లుగా రాష్ట్ర స్థాయి సమాచారహక్కు చట్టం వ్యవస్థ నిస్తేజంగా మారింది.  రాజస్థాన్ లో ప్రజాసమస్యలపై పోరాడే సమయంలో ఎదురైన సమస్యలను దృష్టిలో పెట్టుకొని అరుణ్ రాయ్ అనే మాజీ ఐఏఎస్ అధికారి ప్రజలకు సమాచారం ఇచ్చే జవాబుదారీతనం ఉండే చట్టం కావాలని పోరాడారు. 

ప్రజల నుంచి లభించిన మద్దతుకు తలొగ్గి  అప్పటి  మన్మోహన్ సింగ్  ప్రభుత్వం సమాచార హక్కు చట్టం-2005 తెచ్చింది.  రాజ్యాంగంలోని ఆర్టికల్19(1)సెక్షన్ ఆధారంగా ప్రజలు సమాచార హక్కు చట్టబద్ధం చేస్తూ చట్టం చేయడమైంది.  ఒక్క సమాచారహక్కుచట్టం మాత్రమే అన్ని చట్టాలకు భిన్నంగా ప్రజలకు జవాబుదారీగా ఉండి చేరువ అయ్యింది.  

ప్రజలు ఎక్కువగా  వినియోగించుకున్న చట్టంగా దేశంలో ఈచట్టం గుర్తింపు పొందింది. ఈచట్టం వచ్చిన తర్వాతనే  ప్రభుత్వ పాలనలో కొంతలో కొంతైనా ప్రజలకు జవాబుదారీ ఉంటుందన్న విషయం కొద్దో గొప్పో ప్రజలకు అర్థం అయ్యింది.  అవినీతి కూడా ఈచట్టం మూలంగా కొంతలో కొంత అయినా నియంత్రణలోకి వచ్చింది.  ప్రజల పన్నులు ద్వారా వచ్చిన నిధులు ప్రభుత్వం నుంచి ఖర్చు చేసే ప్రభుత్వరంగ సంస్థగానీ,  ప్రభుత్వ గ్రాంట్ల ద్వారా నడిచే ప్రైవేటు సంస్థలుగాని ప్రజలు సెక్షన్6(1) ప్రకారం ఏదైనా సమాచారం అడిగితే దరఖాస్తు చేసిన నెల రోజులలోపు ఆ సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. 

కమిషనర్ల నియామకంలో జాప్యం తగదు

తెలంగాణలో కమిషనర్ల  నియామకంలో జాప్యం జరగడం వలన ఇప్పటికే  రాష్ట్ర కమిషనరేట్ లో 17వేల దరఖాస్తులు విచారణకు నోచుకోక మూలన పడిఉన్నాయి. తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రభుత్వం 2017నుంచి కమిషనర్ల నియామకం నిలిపి వేసింది. సెక్షన్18(1), సెక్షన్ (2)(3) ప్రకారం సమాచారహక్కు కమిషనర్ పోస్టులు భర్తీ కావడంలేదని పోరంఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధి, రిటైర్ ఐఏఎస్ అధికారి పద్మనాభరెడ్డి, హక్కుల కార్యకర్త కోయిన్ని వెంకన్న 2019లో  హైకోర్టులో పిల్ వేసిన తర్వాత కోర్టు ఆదేశం ఇచ్చింది. 

కోర్టు ఆదేశం ఇవ్వడంతో 10 జనవరి2020న అప్పటి కేసీఆర్ ప్రభుత్వం కమిషనర్లను నియమించింది. అదీ అర్హులైనవారి కంటే రాజకీయ నిరుద్యోగులుకు అవకాశం కల్పించారనే ఆరోపణలు ఆనాడు వచ్చాయి.  అప్పటి ప్రభుత్వం నియమించిన కమిషనర్ల పదవీకాలం కూడా 10 జనవరి 2023కు పూర్తి అయ్యింది .అయినా, గత రెండు సంవత్సరాలుగా కమిషనర్ల నియామకం జరగకపోవడంతో  తిరిగి పద్మనాభరెడ్డి మళ్ళీ  హైకోర్టు నాశ్రయించారు.  

రెండు ప్రభుత్వాలు ఈవిషయంలో గత రెండేళ్లుగా ప్రదర్శించిన ఆలసత్వం మూలంగా వేలమంది ఫిర్యాదుదారులు న్యాయం కోసం ఎదురు చూస్తున్నారు. వాస్తవంగా రెండు నెలల్లో ఫిర్యాదు పరిష్కారం చేయాలని సమాచార హక్కుచట్టం చెబుతుంటే, రెండేళ్లుగా  కమిషనర్ల నియామకంలో జాప్యం మూలంగా ప్రజలకు న్యాయం జరగడంలేదు.  ప్రభుత్వ కార్యాలయాలు అవినీతి రహితంగా నడవాలంటే జవాబుదారీతనం అవసరం. ఆ జవాబుదారీతనం కోసమే సమాచార హక్కు కమిషనర్ల నియామకం పూర్తి చేయాలనేది ప్రజల ఆకాంక్ష.  

-  ఎన్. తిరుమల్​-