బోధన్ చలాన్ల కుంభకోణం దర్యాప్తు ముగిసేదెన్నడు?

నిజామాబాద్ జిల్లా బోధన్ లోని వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో 2014లో నకిలీ చలాన్ల భాగోతం బయటపడింది. సింహాద్రి లక్ష్మీ శివరాజ్ అనే ట్యాక్స్ కన్సల్టెంట్, వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయ సిబ్బంది కలిసి నకిలీ చలాన్ల వ్యవహారం 2005వ సంవత్సరం నుంచి నడుపుతూ వస్తున్నారు. అయితే 2014లో ఎన్​ఫోర్స్​మెంట్ వారి దర్యాప్తులో ఈ వ్యవహారం బయటపడింది. నకిలీ చలాన్లు, అలాగే ఒక చలాన్ ముగ్గురు, నలుగురు పేర్లపై పన్ను కట్టినట్లు చూపిస్తూ సుమారు 9 సంవత్సరాలుగా ఈ దందా సాగింది. దీంతో ప్రభుత్వానికి సుమారుగా 230 కోట్ల రూపాయల ఆదాయానికి గండి పడింది. ఈ 9 సంవత్సరాల కాలంలో ఏజీ ఆడిట్, ట్రెజరీ ఆడిట్లు తూతూ మంత్రంగా పనులు చేయడంతో ఈ అవినీతి బయటకు రాలేదు. చివరకు ఎన్​ఫోర్స్​మెంట్​వారి తనిఖీలో బయటకు వచ్చింది. ఈ కుంభకోణంపై శాఖాపరంగా పూర్తి విచారణ జరిపి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు. 
 

మొత్తం 17 మంది అరెస్ట్​


జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి నకిలీ చలాన్లలో పేర్లు ఉన్న వ్యాపారవేత్తల నుంచి మళ్లీ పన్ను వసూలు చేయాలని ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో రాజకీయ ఒత్తిడులతో వ్యాపారుల నుంచి మళ్లీ పన్ను వసూలు ఆపివేశారని, అలాగే కేసు నీరుగార్చడానికి కేసును స్థానిక పోలీసు స్టేషన్ నుంచి సీఐడీ వారికి బదిలీచేయించారని పత్రికల్లో వార్తలు వచ్చాయి. ఎప్పుడైతే ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లుతుందో అప్పుడు మొదటగా చేయాల్సింది ఆ నష్టాన్ని రికవరీ చేయడం, ఆ తర్వాత దోషులను శిక్షించడం. బోధన్ వాణిజ్య పన్నుల శాఖ వారు, వ్యాపారస్థుల నుంచి కిస్తుల వారీగా డబ్బు తీసుకునే ప్రయత్నం ఆపివేశారు. అలాగే స్థానిక పోలీసు వారు చేస్తున్న విచారణను మధ్యలో ఆపి కేసు సీఐడీ శాఖ వారికి బదలాయించడం చూస్తుంటే దీనిలో జిల్లాలోని పెద్ద రాజకీయ నాయకుల ప్రమేయముందని అనుమానం కలుగుతుంది. ఈ 230 కోట్ల రూపాయల కుంభకోణం బోధన్​లో జరిగింది. ఎన్​ఫోర్స్​మెంట్​వారు అన్ని విషయాలు క్షుణ్నంగా పరిశీలించి తమ నివేదిక అందజేశారు. అలాంటప్పుడు సీఐడీ వారు ఒక సంవత్సరంలో విచారణ పూర్తి చేసి కేసు కోర్టులో ప్రాసిక్యూట్ చేయాలి. కానీ అలా జరగలేదు. 2017లో కేసు సీఐడీకి అప్పగించిన తర్వాత విచారణ మందకొడిగా సాగింది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ నుంచి కేసు విచారణ సమాచారం కోరగా గత 6 సంవత్సరాలుగా విచారణ కొనసాగుతోందంటూ తెలిపారు. ఇటీవల సీఐడీ చీఫ్ మహేశ్ భగవత్ మీడియాతో మాట్లాడుతూ.. నకిలీ చలాన్ల కేసులో ఇంతవరకు17 మందిని అరెస్టు చేయగా తాజాగా మరో నలుగురిని చాకచక్యంగా వివిధ ప్రదేశాల నుంచి అరెస్టు చేసి కరీంనగర్ అవినీతి నిరోధక శాఖ కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. 
 

దర్యాప్తు సంస్థలను నమ్మడం ఎలా?


రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఇబ్బందికర పరిస్థితుల్లో సమస్యను పక్కదోవ పట్టించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) వేయడం పరిపాటిగా మారింది. సిట్ అధికారులు రాజకీయ పెద్దల కనుసన్నల్లో దర్యాప్తు తిమ్మిని బమ్మి, బమ్మిని తిమ్మిగా చేసి రాజకీయ పెద్దలు చెప్పినట్లు రిపోర్టు తయారు చేస్తారు. కొన్ని సందర్భాల్లో విచారణ సరిగా జరిగినా ప్రభుత్వం సిట్ దర్యాప్తు పై చర్యలు తీసుకోకుండా పక్కన పెడుతున్నది. ఇక సీఐడీ శాఖ వారు అనుకుంటే కేసును త్వరగా పరిశీలించి తొందరలోనే విచారణ పూర్తి చేస్తారు. రాజకీయ నాయకులు కేసును పక్కన పెట్టాలంటే సీఐడీ శాఖ వారు సంవత్సరాల కొద్దీ విచారణ పేరుతో సాగదీసి చివరకు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు కేసును నీరుగారుస్తారు. ఇలాంటి చర్యలతో ప్రజలకు సిట్, సీఐడీల పనితీరుపై నమ్మకం పోతుంది.


రాజకీయ ఒత్తిడి


ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే ఈ కేసులో ప్రధాన నిందితుడు అయిన సింహాద్రి శివరాజ్ ఆరునెలల క్రితం చనిపోయాడు. అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్న నిందితుల్లో చాలామంది వాణిజ్యపన్నుల శాఖల్లో పదవీ విరమణ చేసిన వారే. వారందరూ వయోవృద్ధులే. తమ తమ నివాసాల్లో ఉంటున్నారు. అలాంటప్పుడు ఎంతో కష్టపడి వీరిని పట్టుకున్నామని, ఏదో ఉగ్రవాదులను అరెస్టు చేసినట్లు బిల్డప్ లు ఇవ్వడం దేనికి ? కేసులో విచారణ ఇంకా పూర్తి కాలేదు. విచారణ పూర్తి అయిన తరువాత కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయడం, ఆ తరువాత కేసులో తీర్పు వచ్చే నాటికి ఇంకా కొన్ని సంవత్సరాలు పట్టవచ్చు. రాజకీయ ఒత్తిడుల వలన ప్రభుత్వ ఖజానాకు జరిగిన నష్టాన్ని భర్తీచేసుకోవడానికి తీసుకునే చర్యలు ఆపివేయడం, సంవత్సరాల తరబడి సీఐడీ కేసును సాగదీయడం, అసలు నేరస్థులు చనిపోయి.. కేసు నీరుగారి పోయింది.  ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగింది.

 


- ఎం. పద్మనాభరెడ్డి,
కార్యదర్శి, 
ఫోరం ఫర్ ​గుడ్ ​గవర్నెన్స్