కార్మికుల కనీస వేతనం ఇంకెన్నడు పెరుగుతది?

తెలంగాణ ఏర్పడి ఎనిమిదేండ్లు పూర్తవుతున్నా.. కార్మికుల జీవితాల్లో మార్పు రాలేదు. ప్రైవేటు రంగంలో పని చేసే కార్మికులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు. రాష్ట్రంలో 73 రంగాల్లో సుమారు కోటి మందికి పైగా కార్మికులు ఉన్నారు. ప్రతి అయిదేండ్లకోసారి రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలు సవరించి జీవోలకు గెజిట్ ఇవ్వాల్సి ఉన్నా ఇవ్వలేదు. ఉమ్మడి రాష్ట్రం నుంచే లెక్కిస్తే గత15 ఏండ్లుగా రాష్ట్రంలోని కార్మికులకు కనీస వేతనాల సవరణ జరగలేదు. అరకొర జీతాలతోనే వారు కాలం వెళ్లదీయాల్సి వస్తోంది. ఇదే అదునుగా ప్రైవేటు కంపెనీలు, సంస్థలు శ్రమదోపిడీకి పాల్పడుతున్నాయి. టీఎస్​ఐపాస్ పేరిట కొత్త పరిశ్రమల ఏర్పాటుకు 30 రోజుల్లోనే లైసెన్సులు ఇస్తున్న ప్రభుత్వం.. వాటికి మౌలిక సదుపాయాలు కూడా కల్పిస్తోంది. సుమారు 3500కు పైగా పరిశ్రమలు వచ్చాయని,16 లక్షల మందికి ఉపాధి కల్పించామని సర్కారు లెక్కలు చెబుతున్నాయి. అయితే ఉపాధి పొందుతున్న కార్మికుల్లో అత్యధికులు ఇతర రాష్ట్రాలవారే ఉంటున్నారు. స్థానికులకు పెద్దగా ఉపాధి దొరకడం లేదు. ఒకవేళ దొరికినా అది హౌస్ కీపింగ్ వంటి అన్​స్కిల్డ్ కేటగిరీల్లో ఉంటోంది. 

కనీస వేతన చట్టం అమలు చేయాలె..

2014 నుంచి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతన సవరణలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కార్మిక శాఖ నుంచి ప్రతిపాదనలు వెళ్లినా ముఖ్య మంత్రి ఆమోదించలేదని తెలిసింది. ఎవరి ప్రయోజనాల కోసం ప్రభుత్వం పనిచేస్తోంది? 1948 కనీస వేతనాల చట్టం ప్రకారం పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రతి అయిదేండ్లకోసారి వేతనాలు పెంచాలి. దీనిపై పలు సందర్భాల్లో రాష్ట్ర హైకోర్టు కూడా తీర్పు ఇస్తూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినా సర్కారు పట్టించుకోవడం లేదు. ఫార్మారంగం, విద్య, వైద్య రంగాల కార్పొరేట్ సంస్థల అధిపతులే ప్రజా ప్రతినిధుల అవతారం ఎత్తి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులయ్యాక కార్మికుల వేతనాలు పెంచేదెవరు? అని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇంటి కిరాయిలు, సెల్ ఫోన్ రీచార్జ్, డేటా ఖర్చులు, టీవీ, కరెంట్, వాటర్, గ్యాస్​ ఇలా నెల నెలా ఖర్చులు విపరీతంగా పెరిగాయి.  వచ్చే అరకొర జీతాలకు పెరిగిన ధరలతో సామాన్య కార్మికుడు బతికే పరిస్థితి లేదు. ప్రభుత్వాలు ఇప్పటికైనా స్పందించాలి. కనీస వేతనాల చట్టం1948 ప్రకారం,15 ఐఎల్ సీ తీర్మానం, సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుడి వేతనం కనీసం రూ.26 వేలు ఉండాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రాష్ట్ర కనీస వేతన సలహా మండలి కనీసం బేసిక్ రూ.18 వేలుగా తీర్మానం చేసి ఏడేండ్ల కింద ప్రభుత్వానికి పంపింది. కాగా ముఖ్యమంత్రి అందుకు అంగీకరించలేదు. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలోనే కనీస వేతనాలు ఎక్కువగా ఉన్నాయని యాజమాన్య సంఘాలు వాదిస్తున్నాయి. దీన్ని ప్రభుత్వం బలపరుస్తోంది. కార్మికుల వేతనాలు పెంచితే కంపెనీలు రాష్ట్రానికి రావని కొత్త అంశాన్ని తెరమీదకు తెస్తున్నాయి. 

ఇతర రాష్ట్రాల్లో వేతనాలు ఇలా..

రిజర్వు బ్యాంక్ రిపోర్టు ప్రకారం దేశంలోనే కేరళలో అత్యధిక వేతనాలు ఉన్నాయి. అక్కడి ప్రభుత్వం రూ.16,022కు తగ్గకుండా నిర్ణయించింది. కర్నాటకలో 2016  ఏడాదిలో ఇచ్చిన జీవో ప్రకారం ఆటోమొబైల్ రంగం బేసిక్ రూ.10,010 వుంది. తమిళనాడులో రూ.10,094 ఉంటే తెలంగాణలో రూ.3,809 ఉండటం గమనార్హం. ఢిల్లీ ఆప్ ప్రభుత్వం కూడా రూ.16,506కు పెంచింది. దక్షిణాది రాష్ట్రాల్లో అతితక్కువ వేతనాలు ఉన్నది తెలంగాణలోనే అన్న విషయం గమనించాలి. రాష్ట్రంలో కార్మికుల వేతనాల దోపిడీతో పాటు వర్కింగ్ కండిషన్స్ దారుణంగా ఉన్నాయి. కేంద్రం తీసుకొచ్చిన అప్రెంటీస్ యాక్టులో సవరణల వల్ల 30 శాతం మందికి స్టయిఫండ్ ఇచ్చి పర్మినెంట్ వర్కర్ మాదిరిగా పని చేయిస్తున్నారు. వీరికి కనీస వేతనం, పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్ ఇతర సౌకర్యాలు ఏమీ లేకుండా యాజమాన్యాలు శ్రమ దోపిడీకి పాల్పడుతున్నాయి. ట్రైనీలు, లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్ రకరకాల పేర్లతో వెట్టిచాకిరీ పెరిగింది. వలస కార్మికుల పరిస్థితి మరింత దయనీయం. కంపెనీలు కార్మికులకు పందుల దొడ్ల మాదిరి నివాసాలు కేటాయిస్తున్నాయి. చట్టబద్ధ సౌకర్యాలు ఉండవు. ప్రమాదాలు జరిగినా, గాయపడినా, చనిపోయినా దిక్కులేని పరిస్థితి. అంతర్​రాష్ట్ర వలస కార్మిక చట్టం 1979 ప్రకారం వీరికి చట్టబద్ధ హక్కులు ఉన్నా ప్రైవేటు సంస్థలు, కంపెనీలు వాటిని తుంగలో తొక్కుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 2021లో జీవో 118 జారీ చేసింది. 600 రకాల సమస్యలకు యజమానులు సెల్ఫ్ సర్టిఫికెట్/డిక్లరేషన్ ఇస్తే సరిపోతుందనేది ఆ జీవో సారాంశం. అంటే యజమాని తన కంపెనీల్లో అన్ని చట్టాలు అమలు చేస్తున్నట్లు రాసిస్తే దాన్ని ప్రభుత్వ అధికారులు ఆమోదించాలి. అంతే తప్ప తనిఖీలు ఉండవు. ప్రభుత్వం కార్మికశాఖ కోరలు పీకి యజమానులకు పెద్దపీట వేస్తోంది. ఈ వైఖరిని మేధావులు, ప్రజాసంఘాలు, నాయకులు ఖండించాల్సిందే!.

ఇయ్యాల కార్మికుల మహాధర్నా

కరోనా మహమ్మారితో కార్మికులు తీవ్రంగా ప్రభావితమయ్యారు. ఎంతో మంది ఉపాధి లేక పస్తులు ఉన్నారు, కుటుంబాలను పోషించలేక బలవన్మరణాలకు పాల్పడ్డారు. కానీ కరోనా సమయంలో కూడా కార్పొరేట్​ కంపెనీల లాభాలు మాత్రం తగ్గలేదు. కొన్ని కంపెనీలు రికార్డు స్థాయి లాభాలు పొందడాన్ని చూస్తే.. ప్రభుత్వాలు కార్మికులకు మేలు చేస్తున్నాయా? కార్పొరేట్లకు మేలు చేస్తున్నాయా? అనేది స్పష్టమవుతుంది. ఇప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం 73 రంగాల్లో కనీస వేతనాలు సవరించి రూ.26 వేలు చేయాలి. ప్రైవేటు ట్రాన్స్​పోర్ట్ వర్కర్స్, హమాలీలకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి. భవన నిర్మాణ కార్మికుల బోర్డులో అందరిని నమోదు చేయాలి. లేదంటే ప్రభుత్వానికి కార్మికుల ఉద్యమ సెగ తగులుతుంది. కనీస వేతనాల సాధన కోసం వేలాది మందితో బుధవారం కార్మిక మహాధర్నా నిర్వహిస్తున్నాం.

 - భూపాల్
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి