
- శత్రుత్వంతో ఎవరూ ఏమీ సాధించలేరు
- టెర్రరిస్టులకు పాకిస్తాన్ అడ్డాగా మారింది
- స్నేహం కోసం ప్రయత్నించిన ప్రతిసారీ మోసమే ఎదురైంది
- విమర్శలను స్వాగతిస్తా.. అది ప్రజాస్వామ్య ఆత్మ
- నా బాల్యం అంతా పేదరికంలోనే గడిచింది
- ట్రంప్ ఎంతో ధైర్యవంతుడు.. ముక్కుసూటి వ్యక్తి
- చైనాతో అసమ్మతికి బదులు చర్చలకే మా ప్రాధాన్యం
- అమెరికన్ పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్మన్తో ప్రధాని
వాషింగ్టన్: శాంతి, సామరస్యం గురించి ఇండియా చెప్తే ప్రపంచం మొత్తం వింటదని ప్రధాని మోదీ అన్నారు. గౌతమ బుద్ధుడు, మహాత్మా గాంధీలాంటి మహనీయులు పుట్టిన నేల భారత్ అని వివరించారు. ఇండియా, పాకిస్తాన్ మధ్య శాంతి స్థాపనకు ప్రయత్నించిన ప్రతిసారి.. శత్రుత్వం, మోసమే ఎదురైందని అన్నారు. ప్రజలంతా శాంతి కోరుకుంటున్నారని, హింసతో అందరూ అలసిపోయారని తెలిపారు. టెర్రరిస్టుల దాడుల్లో ఎంతోమంది అమాయక చిన్నారులు ప్రాణాలు కోల్పోయారన్నారు. ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపర్చుకోవడం.. పాకిస్తాన్ లీడర్షిప్పైనే ఆధారపడి ఉందని స్పష్టం చేశారు.
తాను విమర్శలను స్వాగతిస్తానని తెలిపారు. అది ప్రజాస్వామ్యం ఆత్మ అని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. టెర్రరిజానికి పాకిస్తాన్ కేంద్రంగా మారిందని ఆరోపించారు. అమెరికాకు చెందిన కంప్యూటర్ సైంటిస్ట్, పాడ్‌కాస్టర్ లెక్స్ ఫ్రిడ్మన్తో ప్రధాని మోదీ అనేక అంశాలపై మాట్లాడారు. తన బాల్యం, రెండేండ్లు హిమాలయాల్లో గడిపిన పరిస్థితుల గురించి తెలియజేశారు. చైనాతో ఉన్న సంబంధాలు.. ఉక్రెయిన్, రష్యా మధ్య వార్.. ట్రంప్‌తో ఉన్న ఫ్రెండ్షిప్.. లాంటి ఎన్నో ఆసక్తికర విషయాలను ఫ్రిడ్మన్తో మోదీ పంచుకున్నారు. గోద్రా అల్లర్లు.. 1999లో జరిగిన టెర్రరిస్టు దాడులు.. ఆర్ఎస్ఎస్తో ఉన్న అనుబంధం గురించి వివరించారు.
రక్తపాతంతో ఏం సాధిస్తారు?
ఇండియా, పాకిస్తాన్ మధ్య కొత్త అధ్యయనాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతో 2014లో తన ప్రమాణస్వీకార కార్యక్రమానికి నాటి పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను ఆహ్వానించానని మోదీ తెలిపారు. శాంతిని నెలకొల్పేందుకు ప్రయత్నం చేసిన ప్రతిసారి శత్రుత్వం, మోసమే ఎదురైందన్నారు. ఇప్పటికీ నిర్ణయం వారి చేతుల్లోనే ఉందని స్పష్టం చేశారు. శాంతి మార్గాన్ని ఎంచుకుంటారని ఆశిస్తున్నట్లు వివరించారు. ‘‘ప్రజలు శాంతి కోసం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. కలహాలు, అశాంతితో వారు అలసిపోయారు. టెర్రరిస్టుల దాడుల్లో ఎంతోమంది అమాయక చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు.
ఎంతోమంది జీవితాలు నాశనం అయ్యాయి. ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపర్చుకోవడం పాకిస్తాన్ లీడర్షిప్పైనే ఆధారపడి ఉంది. విమర్శలను స్వాగతిస్తా. అది ప్రజాస్వామ్యం ఆత్మ అని నా విశ్వాసం. టెర్రరిజానికి పాకిస్తాన్ కేంద్రంగా మారింది’’అని మోదీ తెలిపారు. ఇండియాను పదే పదే విభేదించడమే పాకిస్తాన్ పనిగా పెట్టుకున్నదని మోదీ అన్నారు. ‘‘మేము శాంతిని కోరుకుంటుంటే.. పాకిస్తాన్ హింసను ప్రేరేపిస్తున్నది. రక్తపాతంతో ఏం సాధిస్తారు? టెర్రరిజాన్ని పెంచి పోషిస్తూ ఏం చేయాలనుకుంటున్నారు? పాకిస్తాన్ వైఖరి.. ప్రపంచ దేశాలపై ప్రభావం చూపిస్తున్నది. ఎక్కడ టెర్రరిస్ట్ దాడి జరిగినా.. దాని మూలాలు పాకిస్తాన్‌లోనే ఉంటున్నాయి’’ అని మోదీ తెలిపారు.
మాది సామరస్యాన్ని సమర్థించే దేశం
ఇండియా.. శాంతి గురించి మాట్లాడినప్పుడల్లా ప్రపంచం మొత్తం వింటదని ప్రధాని మోదీ అన్నారు. ఎందుకంటే ఇది గౌతమ బుద్ధుడు, మహాత్మా గాంధీ పుట్టిన భూమి అని వివరించారు. ‘‘ప్రకృతితో లేదా ప్రపంచ దేశాలతో ఇండియా ఎప్పుడూ.. ఎలాంటి వైరాన్ని కోరుకోదు. మాది సామరస్యాన్ని సమర్థించే దేశం. నా శక్తి పేరులో లేదు. 140 కోట్ల మంది భారతీయుల మద్దతు, దేశ సంస్కృతి, వారసత్వంలోనే ఉంది. ఎక్కడికి వెళ్లినా.. వేల ఏండ్ల సంస్కృతి, వారసత్వాన్ని తీసుకెళ్తాను’’ అని మోదీ తెలిపారు.
చర్చలతో యుద్ధానికి ఫుల్స్టాప్ పెట్టాలి
ఉక్రెయిన్ వార్‌కు ముగింపు పలికే మార్గం యుద్ధభూమి ద్వారా కాకుండా, చర్చల ద్వారానే సాధ్యమని ప్రధాని మోదీ అన్నారు. మూడేండ్లుగా కొనసాగుతున్న ఈ యుద్ధాన్ని ముగించేందుకు ఉక్రెయిన్, రష్యా దేశాలు చర్చలకు రావాలని ఆయన సూచించారు. ‘‘ఉక్రెయిన్ శాంతి కోసం అది మిత్రదేశాలతో ఎన్ని చర్చలు జరిపినా ప్రయోజనం ఉండదు.
శాంతి రావాలంటే.. ఉక్రెయిన్, రష్యా దేశాలు ఒకే టేబుల్ వద్ద కూర్చొని మాట్లాడుకోవాలి. అప్పుడే యుద్ధానికి ఫుల్స్టాప్ పడుతుంది. చర్చల ద్వారానే ఎన్నో సమస్యలు పరిష్కరించుకోగలం’’అని ప్రధాని మోదీ చెప్పారు. ‘‘రష్యా, ఉక్రెయిన్‌తో నాకు సన్నిహిత సంబంధాలున్నాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో కూర్చొని ‘ఇది యుద్ధానికి సరైన సమయం కాదు’ అని చెప్పగలను. అలాగే, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి ఫ్రెండ్‌గానూ సలహా ఇవ్వగలనని మోదీ తెలిపారు.
అప్పుడు ట్రంప్‌లో నన్ను నేను చూసుకున్న
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్‌పై జరిగిన కాల్పులపై కూడా మోదీ స్పందించారు. ‘‘ఎన్నికల ప్రచారంలో భాగంగా ట్రంప్‌పై కాల్పులు జరిగాయన్న వార్త తెలిసి చాలా ఆందోళనచెందాను. కానీ.. ఒకవైపు రక్తం కారుతున్నా.. పిడికిలి ఎత్తి నినాదించడం ఎప్పటికీ మరిచిపోలేను. నేను ఆయన చేయి పట్టుకుని నడిచిన సందర్భంగా గుర్తుకొచ్చింది.
ఎంతో దృఢమైన ట్రంప్‌ను చూశాను. అతని జీవితం దేశం కోసమే అంకితమని తెలుసుకున్నాను. నేను కూడా ఇండియా కోసం నిలబడ్తాను. నన్ను నేను.. ఒక్కసారి ట్రంప్‌లో చూసుకున్నట్లు అనిపించింది. అందుకే.. ట్రంప్‌తో నాకు అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి’’ అని మోదీ వెల్లడించారు.
పర్సనల్‌గా తీసుకెళ్లి వైట్ హౌస్ చూపించారు
దేశహితం కోసం ట్రంప్ చాలా వరకు సొంత నిర్ణయాలే తీసుకుంటారని మోదీ తెలిపారు. అమెరికా ఫస్ట్ అనేది.. ఆయన నినాదమని, అది తనకెంతో నచ్చిందని వివరించారు. నన్ను కలిసేందుకు ట్రంప్ తన అన్ని ప్రొటోకాల్ ను ఉల్లంఘించారని గుర్తు చేశారు. ‘‘అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికయ్యాక సోషల్ మీడియా ద్వారానే విషెస్ చెప్పిన. అయితే.. ట్రంప్‌తో భేటీ కావాలని నాకు చాలాసార్లు రిక్వెస్ట్‌లు వచ్చాయి. కొన్ని కార్యక్రమాల వల్ల ఆలస్యమైంది.
అప్పటికే ట్రంప్ గురించి మీడియాలో చాలా వార్తలు వచ్చాయి. ముక్కుసూటితనం ఆయన నైజం. అయితే, వైట్‌హౌస్‌లో ఫస్ట్ టైమ్ ట్రంప్‌ను కలిశాను. అప్పటికే వైట్‌హౌస్‌కు ట్రంప్ కొత్త. నేను వైట్‌హౌస్‌లో అడుగుపెట్టానని తెలుసుకున్న ట్రంప్.. సెక్యూరిటీ, ప్రొటోకాల్స్ అన్ని బ్రేక్ చేసి నన్ను రిసీవ్ చేసుకున్నారు. పర్సనల్‌గా తీసుకెళ్లి వైట్‌హౌస్ చూపించారు. ట్రంప్‌తో తొలి భేటీ.. నాకు ఎప్పుడూ ప్రత్యేకమే..’’ అని మోదీ గుర్తు చేసుకున్నారు.
బూట్లను మెరిపించేందుకు చాక్‌పీస్‌లు వాడిన
తన బాల్యం మొత్తం పేదరికంలోనే గడిచిందని ప్రధాని మోదీ వివరించారు. తన తెల్ల కాన్వాస్ బూట్లను మెరిపించేందుకు స్కూల్లో పడేసిన చాక్‌పీస్‌లను తెచ్చుకునేవాడినని చెప్పారు. ఎన్నో రోజులు ఆకలితో అలమటించినట్లు తెలిపారు. రాగి చెంబులో వేడి నీళ్లు నింపి బట్టలు ఇస్త్రీ చేసుకునేవాడినని చెప్పారు. ‘‘నేను గుజరాత్ మెహసానా జిల్లా వాద్నగర్లో పుట్టాను. చిన్నప్పుడు ల్రైబరీలో స్వామి వివేకానంద గురించి పుస్తకాలు ఎన్నో చదివాను. ఆయన బోధనలు, స్పీచ్‌లు నాపై తీవ్ర ప్రభావాన్ని చూపించాయి.
గోద్రా అల్లర్ల బాధ్యులను కోర్టు శిక్షించింది
గోద్రా అల్లర్లను ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద హింసాకాండగా చెప్పుకోడం సరికాదని మోదీ అన్నారు. ‘‘గోద్రా అల్లర్ల సమయంలో కేంద్రంలో మా రాజకీయ ప్రత్యర్థులు అధికారంలో ఉన్నారు. సహజంగానే వాళ్లు మా మీద వచ్చిన ఆరోపణలను నిజం చేయాలని చూశారు. వాళ్లు ఎంత ప్రయత్నించినా, న్యాయవ్యవస్థ రెండుసార్లు ఈ విషయాన్ని లోతుగా పరిశీలించి, మమ్మల్ని నిర్దోషులుగా తేల్చింది. నిజమైన బాధ్యులు కోర్టుల ద్వారా శిక్ష అనుభవించారు.
2002కి ముందు గుజరాత్‌లో ఎన్నో అల్లర్లు జరిగాయి. 250కి పైగా పెద్ద అల్లర్లు రికార్డయ్యాయి. 1969లో జరిగిన అల్లర్లు 6 నెలల పాటు సాగాయి. కానీ.. 2002 తర్వాత (గోద్రా) గుజరాత్‌లో ఒక్క హింస కూడా జరగలేదు. రాష్ట్రం పీస్‌గా ఉన్నది’’ అని మోదీ వివరించారు.
ఆర్ఎస్ఎస్ నా జీవితాన్ని మార్చేసింది
ఆర్ఎస్ఎస్.. తన జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపిందని మోదీ వివరించారు. ఆర్ఎస్ఎస్తో తనకున్న అనుబంధం ఎంతో అద్భుతమైనదిగా అభివర్ణించారు. ‘‘ఆర్‌ఎస్‌ఎస్ నుంచి జీవిత పరమార్థం, నిస్వార్థ సేవా విలువలను పొందాను. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఆర్‌ఎస్‌ఎస్ తన సేవలు కొనసాగిస్తున్నది. దేశవ్యాప్తంగా ఆర్‌ఎస్‌ఎస్ పెద్దఎత్తున విద్య, వైద్య సేవలను అందిస్తున్నది. దేశమే ప్రధానమని ఆర్‌ఎస్‌ఎస్ బోధిస్తుంది. మానవ సేవే మాధవ సేవ. ఆ గొప్ప సంస్థ నుంచి ఎన్నో విలువలను నేర్చుకున్నా’’ మోదీ వివరించారు.
ఫ్రిడ్‌మన్ 45 గంటల ఉపవాసం
ప్రధాని మోదీతో పాడ్ కాస్ట్ కు ముందు తాను 45 గంటల పాటు ఉపవాసం ఉన్నట్లు లెక్స్ ఫ్రిడ్ మన్ చెప్పారు. ప్రధాని మోదీపై గౌరవసూచకంగా ఆహారం తీసుకోలేదన్నారు. కేవలం నీళ్లు మాత్రమే తాగినట్లు వివరించారు. స్థితమనస్తత్వం పొందేందుకు, ఆధ్యాత్మిక స్థాయికి చేరుకోవడానికి తాను ఉపవాసం ఉన్నట్లు వివరించారు. ఫ్రిడ్ మన్ ఉపవాసంపై ప్రధాని మోదీ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఫ్రిడ్ మాన్ ఉపవాసం ఉన్నారని తెలిసి ఆనందం వ్యక్తం చేశారు. తన పట్ల గౌరవానికి నిదర్శనంగా ఉపవాసం ఉన్న ఫ్రిడ్ మన్కు ప్రధాని కృతజ్ణతలు తెలిపారు.
నేను రిక్వెస్ట్ చేస్తే.. ట్రంప్ వద్దనలేదు
2019, హ్యూస్టన్‌లో నిర్వహించిన ‘హౌడీ మోదీ’ ఈవెంట్ గురించి కూడా మోదీ ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. ‘‘హౌడీ.. మోదీ ఈవెంట్ నా జీవితంలో ఎప్పటికీ మరిచిపోలేను. ఇండో అమెరికన్లను ఉద్దేశించి నా స్పీచ్ అయిపోయింది. పక్కనే ట్రంప్ ఉన్నారు. కృతజ్ఞతలు చెప్పేందుకు ఆయన వద్దకు వెళ్లాను. స్టేడియం చుట్టూ నడుచుకుంటూ సభకు వచ్చిన వారిని పలకరిద్దామని ట్రంప్‌ను కోరాను. దానికి వెంటనే ఆయన ఓకే చెప్పారు.
సెక్యూరిటీ, ప్రొటోకాల్‌పరంగా ట్రంప్ అభ్యంతరం చెప్తారేమో అనుకున్న. కానీ, ఆయన ‘‘అలాగే నడుద్దాం.. చేతులు ఊపుకుంటూ అందరినీ పలకరిద్దాం’’అని చెప్పేసరికి ఎంతో సంతోషం వేసింది. వేలాది మంది ప్రజల మధ్య ఒక అమెరికా అధ్యక్షుడు నడవడం అనేది అసాధ్యం. ఒక్కోసారి సెక్యూరిటీ సిబ్బంది కూడా అభ్యంతరం చెప్తారు. కానీ.. నా విషయంలో మాత్రం అలా జరగలేదు. చుట్టూ భారీ సెక్యూరిటీ మధ్య.. నేను, ట్రంప్ చేతిలో చెయ్యేసి అందరికీ అభివాదం చేశాం’’అని మోదీ తెలిపారు.
చైనాతో పోటీతత్వమే..
విభేదాలు వివాదాలుగా మారకుండా చూసుకోవడంపైనే తమ దృష్టి ఉంటుందని, అసమ్మతికి బదులు చర్చలకే తాము ప్రాధాన్యం ఇస్తామని ప్రధాని మోదీ అన్నారు. చైనాతో సంబంధాలపై మాట్లాడుతూ.. ఇండియా, చైనాలు ఆరోగ్యకరమైన పోటీతత్వంతో ముందుకెళ్లాలని కోరుకుంటున్నామని తెలిపారు. పోటీతత్వం చెడు కాదని, అది ఎన్నడూ సంఘర్షణకు దారి తీయకూడదన్నారు. ప్రపంచ శ్రేయస్సు కోసం ఇరు దేశాల సహకారం ఎంతో అవసరమని స్పష్టం చేశారు.