
నయీంతో పోలీసులు, లీడర్లకు లింకులు
సమగ్ర దర్యాప్తు జరిపించండి
గవర్నర్‌కు ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ
హైదరాబాద్, వెలుగు: గ్యాంగ్ స్టర్ నయీం కేసు విషయం మరోసారి గవర్నర్ ఆఫీస్‌కు చేరింది. నయీం ఇంట్లో పోలీసులు స్వాధీనం చేసుకున్న గన్స్, డైరీలు, ల్యాండ్ డాక్యుమెంట్స్, సిమ్ కార్డుల కాల్ డేటాపై సమగ్ర దర్యాప్తు చేయించాలని కోరుతూ గవర్నర్ తమిళిసైకి ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ పద్మనాభరెడ్డి సోమవారం లేఖ రాశారు. ఈ కేసులో సిట్ దర్యాప్తు సరిగా జరగడం లేదని ఆరోపించారు. నయీం ఇంట్లో మూడు ఏకే 47లు, స్టెన్ గన్, మరో 20 గన్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. గన్స్‌తో పాటు130 డైరీలు, 602 సిమ్ కార్డులు,752 ల్యాండ్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను పోలీసులు సీజ్ చేశారని చెప్పారు. పోలీసుల సపోర్ట్ లేనిదే నయీం చేతికి గన్స్ వచ్చే చాన్స్ లేదన్నారు. నయీంకు టెర్రరిస్టులతో ఉన్న లింకులపైనా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
కాల్ డేటా బయటపెట్టాలి
నయీం ఎన్‌కౌంటర్ తరువాత సీజ్ చేసిన 602 సిమ్ కార్డులు,130 డైరీలను పరిశీలించకుండానే కోర్టులో డిపాజిట్ చేశారని పద్మనాభరెడ్డి ఆరోపించారు. చిన్నచిన్న కేసుల్లో కాల్‌డేటాను బయటకు తీసే పోలీసులు నయీం కేసులో కాల్‌డేటా, డైరీల్లో ఉన్న వారి పేర్లను ఎందుకు బయటపెట్టడం లేదని ప్రశ్నించారు. నయీం డైరీలో పోలీస్ ఉన్నతాధికారులు, రాజకీయ నాయకుల పేర్లు ఉన్నాయని అనుమానం వ్యక్తం చేశారు. నయీం నెట్‌వర్క్ ఇంకా కొనసాగుతోందన్నారు. నయీం కేసులో అన్నింటిపైనా సమగ్రంగా దర్యాప్తు చేయించాలని కోరారు.
For More News..