సెంట్రల్​ నామినేటెడ్​ పోస్టులు మాకేవి?

  • రాష్ట్ర బీజేపీ నాయకత్వాన్ని ప్రశ్నించిన పార్టీ లీడర్లు
  • ఏడున్నరేండ్లుగా ఎదురుచూస్తున్నా గుర్తింపు లేదని ఆవేదన
  • కిషన్ రెడ్డి, సంజయ్‌‌‌‌కి సీనియర్ల ఫిర్యాదు

హైదరాబాద్, వెలుగు: ఏడున్నరేండ్లుగా సెంట్రల్ నామినేటెడ్ పదవుల కోసం కండ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నా తమకు నిరాశే ఎదురవుతున్నదని రాష్ట్ర బీజేపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్కనున్న ఆంధ్రా నేతలకు ఇటీవల సుమారు 25 నుంచి 30 సెంట్రల్ నామినేటెడ్ పోస్టులు దక్కాయని, తమకు మాత్రం మొండిచేయి చూపారని రాష్ట్ర నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రాంత లీడర్లపై వివక్ష ఎందుకని ప్రశ్నించారు. ఒక్క నామినేటెడ్ పోస్టు కూడా ఇవ్వకపోవడం రాష్ట్ర నేతలను చిన్న చూపు చూడడం కాదా అని నిలదీశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ స్టేట్​ చీఫ్​ బండి సంజయ్, పార్టీ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ మంత్రి శ్రీనివాస్ కు సీనియర్ లీడర్లు ఫిర్యాదు చేశారు. దీంతో రాష్ట్ర కీలక నేతలు వెంటనే విషయాన్ని సెంట్రల్ పార్టీ దృష్టికి తీసుకెళ్లారు.
గుర్తింపు ఇస్తలే
ఈ ఏడున్నరేండ్లలో తెలంగాణ ప్రాంత నాయకులకు కనీసం 100 నుంచి 150 వరకు వివిధ కార్పొరేషన్లలో డైరెక్టర్ పదవులు దక్కాయని రాష్ట్ర పార్టీ నాయకత్వం ఊరడించే మాటలు చెబుతున్నదని సిటీకి చెందిన రాష్ట్ర నేత ఒకరు అన్నారు. గతంలో ఇచ్చిన పదవులు కాదు.. ఈ మధ్య ఆంధ్రాతో పోల్చుకుంటే తమకు వచ్చిన పదవులు ఏవని ప్రశ్నించారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు తమ వంతు కృషి చేస్తున్నా.. తమను గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్‌‌‌‌తో హోరాహోరీ పోరాడుతూ వారి దాడిలో గాయపడ్డామని, ఆస్పత్రుల పాలయ్యామని, కేసులు పెట్టి జైలుకు పంపినా.. తమకు నాయకుల పరామర్శ తప్ప పదవులు ఏవీ రాలేదని సీనియర్లు వాపోతున్నారు. మరో రెండేళ్లలోపే ఎన్నికలు రానున్నాయని, పైగా ముందస్తు ప్రచారం సాగుతున్నదని, ఈలోపే రాష్ట్ర నాయకత్వం మేల్కొని తెలంగాణ ప్రాంత నేతలకు వీలైనన్ని ఎక్కువ నామినేటెడ్ పోస్టులు ఇప్పిస్తే ఉత్సాహంగా పని చేయడంతో పాటు అధికార పార్టీని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి వారికి వస్తుందని రాష్ట్ర పార్టీ వ్యవహారాలు చూసే ఓ నేత అంటున్నారు. మోడీ మొదటి సారి ప్రధాని అయినప్పుడు నామినేటెడ్ పదవి కోసం దరఖాస్తు పెట్టుకుంటే ఇప్పటికీ దక్కలేదని మరో సీనియర్ నేత అసంతృప్తి వెళ్లగక్కారు.
ఆంధ్ర నేతలు మాతో సరితూగుతరా?
‘‘ఏపీలో నామినేటెడ్ పదవులు దక్కించుకున్న వాళ్లు పార్టీలోకి ఎప్పుడు వచ్చారు? పార్టీకి వారు చేసిన సేవలేంటి? జనంలో వారికున్న గుర్తింపేంటి?’’ అని రాష్ట్ర ఆఫీస్​ బేరర్ ఒకరు ప్రశ్నించారు. పార్టీకి తాము చేసిన సేవలతో పోల్చుకుంటే.. నామినేటెడ్ పదవులు దక్కించుకున్న ఆంధ్ర నేతలు ఏ రకంగా చూసుకున్నా తమతో సరితూగరని అన్నారు. బీజేపీ బలహీనంగా ఉన్న ఆంధ్రలోనే నామినేటెడ్ పదవులు ఎక్కువగా ఇవ్వడం, ఇక్కడ టీఆర్ఎస్‌‌‌‌తో నువ్వా నేనా అనే రీతిలో పోరు చేస్తున్న తమపై ఢిల్లీ పెద్దలు చిన్న చూపు చూడడం అంతా అయోమయంగా ఉందని మరో మహిళా నేత కామెంట్ చేశారు. ఆంధ్ర నేతలతో పోల్చుకుంటే లాబీయింగ్‌‌‌‌లో తెలంగాణ లీడర్లు బాగా వీక్ అని మరో ఆఫీసు బేరర్ అన్నారు.

పార్టీ సీనియర్ల ఆశలు
నామినేటెడ్ పదవుల కోసం ఎదురు చూస్తున్న వారిలో రాష్ట్ర పార్టీ సీనియర్ నేత, దళిత నాయకుడు చింతా సాంబమూర్తి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బంగారు శృతి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు ప్రకాశ్ రెడ్డి, కొల్లి మాధవి, అధికార ప్రతినిధి రాకేశ్ రెడ్డి, జాతీయ కిసాన్ మోర్చా నేత సుగుణాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ధర్మారావు, రామకృష్ణారెడ్డి, టి.రాజేశ్వర్ రావు తదితర నేతలు ఉన్నారు. హైదరాబాద్ సిటీతోపాటు పలు జిల్లాల బీజేపీ అధ్యక్షులు, జిల్లా పార్టీ ఇన్‌‌‌‌చార్జ్‌‌‌‌లు, వివిధ మోర్చాల రాష్ట్ర అధ్యక్షులు నామినేటెడ్ పోస్టులపై ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్ రెడ్డి రెండోసారి నామినేటెడ్ పదవి కోసం ఎదురు చూస్తున్నారు.