7 లక్షల కోట్లు ఎటుపోయినయ్?: వివేక్ వెంకటస్వామి

7 లక్షల కోట్లు ఎటుపోయినయ్?: వివేక్ వెంకటస్వామి
  • అప్పుల కింద తెచ్చిన సొమ్మంతా ఎక్కడ ఖర్చు పెట్టారు?
  • బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో రాష్ట్రం ఆర్థికంగా దెబ్బతిన్నది
  • కమీషన్ల కోసమే కాళేశ్వరం కట్టి.. లక్ష కోట్లు దోచుకున్నరు   
  • పడావుపడ్డ భూములకు 33 వేల కోట్ల రైతుబంధు ఇచ్చారని ఫైర్ 
  • బడుల్లో ఆడపిల్లలకు టాయిలెట్స్ కట్టించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి 

హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో తెలంగాణ ఆర్థికంగా దెబ్బతిన్నదని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి అన్నారు. ‘‘రాష్ట్రం వచ్చినప్పుడు రూ.70 వేల కోట్ల అప్పులు ఉంటే, బీఆర్ఎస్​ ప్రభుత్వ హయాంలో ఆ అప్పులు రూ.7 లక్షల కోట్లకు పెరిగాయి. ఆ విషయాన్ని కేటీఆర్​ కూడా ఒప్పుకున్నారు. మరి ఆ సొమ్మంతా ఎక్కడ ఖర్చు పెట్టారు? దేనికి ఖర్చు పెట్టారో చెప్పాల్సిన అవసరం ఉంది. కేవలం కమీషన్లు, కాంట్రాక్టుల కోసమే ఖర్చు చేశారు. వారికి కావాల్సిన కాంట్రాక్టర్లను ప్రపంచంలోనే ధనికులుగా చేయడానికి నాటి బీఆర్ఎస్ ​ప్రభుత్వం పని చేసింది’’ అని అన్నారు. 

‘‘రీ డిజైనింగ్ పేరుతో కాళేశ్వరం కట్టి రూ.లక్ష కోట్లు దోచుకున్నది” అని వివేక్​ మండిపడ్డారు. బుధవారం అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా వివేక్ మాట్లాడారు. సభలో ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు వెల్​లోకి దూసుకెళ్లి నిరసన చేస్తుండగానే ఆయన తన స్పీచ్ కొనసాగించారు. ‘‘నాడు కాకా వెంకటస్వామి తలపెట్టిన ప్రాణహిత–చేవెళ్లను పూర్తి చేసుంటే కరీంనగర్, ఆదిలాబాద్, చేవెళ్ల వరకు నీళ్లు అందేవని కాంగ్రెస్ హయాంలో రూ.36 వేల కోట్లతో ఆ ప్రాజెక్టును ప్రారంభించారు.

 దానికోసం ఆనాడే రూ.11 వేల కోట్లు కూడా ఖర్చు చేశారు. మిగతా రూ.25 వేల కోట్లతో ప్రాజెక్టు పూర్తయి ఉండేది. కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. కమీషన్ల కోసమే రీ డిజైనింగ్​పేరుతో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టును పక్కనపెట్టి కాళేశ్వరం కట్టారు. రూ.లక్ష కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు నుంచి 1,200 టీఎంసీల నీళ్లను పంప్​ చేయాల్సి ఉండగా, కేవలం 400 టీఎంసీల నీళ్లనే పంప్​ చేశారు. ఈ ప్రాజెక్ట్​ బ్యాక్​ వాటర్​తో చెన్నూర్, మంథని, మంచిర్యాల నియోజకవర్గాల్లోని పొలాలు మునిగిపోతున్నాయి. రైతులు చాలా నష్టపోతున్నారు” అని వివేక్ అన్నారు. 

మాట నిలబెట్టుకున్నం.. 

తెలంగాణ ఇస్తామన్న మాటను సోనియాగాంధీ నిలబెట్టుకున్నారని వివేక్​ అన్నారు. ఇప్పుడు రైతులకు రుణమాఫీ చేస్తామని రాహుల్​ గాంధీ మాటిచ్చారని, ఆ మాటను నిలబెట్టుకున్నామని చెప్పారు. ‘‘సీఎం రేవంత్ రెడ్డి రెండు విడతలుగా రూ.లక్షన్నర వరకు రైతు రుణాలను మాఫీ చేశారు. ఆగస్టు 15లోగా రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయనున్నారు. 2008లో అప్పటి కాంగ్రెస్​ప్రభుత్వం రూ.70 వేల కోట్ల మేర రుణమాఫీ చేసి రైతులను ఆదుకుంది. 

ఇప్పుడు కూడా అదే రీతిలో మళ్లీ రుణమాఫీ చేస్తున్నాం. అంతేగాకుండా రైతులకు పెట్టుబడి సాయం కోసం రైతు భరోసా స్కీమ్​నూ అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాం. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇప్పటికే రైతులతో నాలుగు విడతల్లో సమావేశాలు నిర్వహించారు. రైతు భరోసా అమలుకు రైతుల నుంచే ఫీడ్​బ్యాక్​ తీసుకున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు పథకంలో భాగంగా రూ.80 వేల కోట్లను పంపిణీ చేస్తే, అందులో రూ.33 వేల కోట్లను పడావుపడ్డ భూములకే ఇచ్చింది. వాళ్లు కౌలు రైతులను పట్టించుకున్న పాపాన పోలేదు. 

కానీ, మా​ప్రభుత్వం అలా కాదు.. కౌలు రైతులకు కూడా రైతు భరోసా కింద రూ.15 వేల పెట్టుబడి సాయాన్ని అందిస్తుంది. రైతు కూలీలకు కూడా ఏటా రూ.12 వేలు ఇవ్వాలని మా ప్రభుత్వం నిర్ణయించింది. పంటబీమాను కూడా గత ప్రభుత్వం అమలు చేయలేదు. కానీ మా ప్రభుత్వం కేంద్రం అందిస్తున్న ఫసల్​బీమా పథకంలో భాగంగా రైతులు కట్టాల్సిన బీమా ప్రీమియం చెల్లించి స్కీమ్ ను అమలు చేస్తుంది” అని వెల్లడించారు. 

ఆరోగ్యశ్రీ లిమిట్ రూ.10లక్షలకు పెంచినం.. 

పేదలను ఆదుకునేందుకు ప్రభుత్వం బడ్జెట్​లో మంచి కేటాయింపులు చేసిందని వివేక్ అన్నారు. ‘‘కేసీఆర్ పాలనలో కరోనా టైమ్​లో ఆరోగ్యశ్రీ ఉన్నా కూడా ట్రీట్​మెంట్ కోసం పుస్తెలు, ఇండ్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్​ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచింది. ట్రీట్​మెంట్​కు రూ.10 లక్షల కన్నా ఎక్కువ ఖర్చయితే, సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదుకోవాలని నిర్ణయించింది. 

పేద ప్రజలను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. పారాసిటమాల్ వేసుకుంటే కరోనా పోతుందంటూ నాడు కేసీఆర్ చెప్పారు. కానీ, చాలా మంది పేదలు ఆస్పత్రుల బిల్లులు కట్టి తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు రాజీవ్​ఆరోగ్య శ్రీలో 163 కొత్త జబ్బులను యాడ్ చేశారు. హాస్పిటల్స్​కు కూడా ఆరోగ్యశ్రీ ప్యాకేజీలను 20 శాతం వరకు పెంచారు. 7 వేల నర్సుల పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది’’ అని చెప్పారు.  

విద్యావ్యవస్థ బలోపేతానికి సర్కార్ చర్యలు

విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు బడ్జెట్​లో ప్రభుత్వం రూ.22 వేల కోట్లు కేటాయించిందని వివేక్​గుర్తు చేశారు. ‘‘మంచిగ చదువుకున్నప్పుడే ఆర్థిక ఎదుగుదల ఉంటుందన్న బీఆర్ అంబేద్కర్ మాటలను నిజం చేసేందుకు కాంగ్రెస్​ ప్రభుత్వం సంకల్పించింది. అందుకు అనుగుణంగా స్కూళ్లను బలోపేతం చేసేలా డీఎస్సీ ద్వారా 11 వేల టీచర్​ పోస్టులను భర్తీ చేస్తున్నది. అంతేగాకుండా 45 గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు రూ.100 కోట్లు కేటాయించింది. 

వాటిని త్వరలోనే ప్రారంభించబోతున్నది” అని తెలిపారు. స్కూళ్లలో గర్ల్స్ ​టాయిలెట్స్​ కట్టించాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘నేను ఎంపీగా ఉన్నప్పుడు పెద్దపల్లి నియోజకవర్గంలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లలో ఎంపీ లాడ్స్​ నిధుల ద్వారా గర్ల్స్​ టాయిలెట్స్​ కట్టించాను. ఇప్పుడు కూడా గర్ల్స్​ టాయిలెట్స్​కోసం ప్రభుత్వం మరిన్ని నిధులు కేటాయించాలి” అని విజ్ఞప్తి చేశారు.