- వారం రోజుల్లో వస్తానన్న ఎమ్మెల్సీ
- వడ్డీతో సహా చెల్లిస్తానని ప్రతిన
- నెలరోజులు కావస్తున్నా జనంలోకి రాని కేసీఆర్ తనయ
- పార్టీ కార్యకలాపాల్లో బావ, బావమర్దులే
- కీలక పరిణమాల వేళ కనిపించని కవిత
- సోషల్ మీడియాలోనూ పోస్టుల్లేవ్!
- సమీపిస్తున్న బతుకమ్మ పండుగ.. జాగృతి ఆధ్వర్యంలో చేసే ఉత్సవాల్లో పాల్గొంటారా..?
హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయి ఐదున్నర నెలలు పాటు జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత గత నెలలో బెయిల్ పై విడులయ్యారు. వారం రోజుల్లో ప్రజల్లోకి వస్తానని చెప్పిన ఆమె ఇటు మీడియా ముందుకు గానీ, సోషల్ మీడియాలో గానీ అందుబాటులో ఉండటం లేదు. దీంతో ఆమె అభిమానులు, పార్టీ కార్యకర్తలు కవిత కోసం ఎదురు చూస్తున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మార్చి 15న ఈడీ అధికారులు ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేశారు. ఢిల్లీ తీసుకెళ్లి కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించిన ఈడీ అధికారులు తర్వాత కోర్టులో హాజరు పర్చగా జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఆమెను తీహార్ జైలుకు తరలించారు. ఆమె జైల్లో ఉండగానే సీబీఐ సైతం అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించి పీటీ వారెంట్ జారీ చేసింది. సీబీఐ, ఈడీ కేసులపై కోర్టుల్లో న్యాయపోరాటా చేసిన కవిత సుప్రీంకోర్టు ఆదేశాలతో గత నెల 27న బెయిల్ పై బయటికి వచ్చారు. తీహార్ జైలు నుంచి బయటికి వచ్చిన కవిత తన అన్న కేటీఆర్ ను చూసి భావోద్వేగానికి లోనయ్యారు.
‘‘నేను కేసీఆర్ బిడ్డను.. తప్పు చేసే ప్రసక్తే లేదు. మొండిదాన్ని.. మంచిదాన్ని. అనవసరంగా నన్ను జైలుకు పంపి జగమొండిని చేశారు. నన్ను నా కుటుంబాన్ని ఇబ్బందులకు గురిచేసిన వారికి వడ్డీతో సహా చెల్లిస్తాం. చట్టబద్ధంగా నా పోరాటం కొనసాగిస్తా. క్షేత్ర స్థాయిలో మరింత నిబద్ధతగా పనిచేస్తాం’’అంటూ ప్రతిన బూనారు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చిన కవితకు శంషాబాద్ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. శంషాబాద్ ఎయిర్ పోర్టు ప్రాంగణమంతా జై తెలంగాణ నినాదాలతో హోరెత్తింది. ఇంటి వరకు భారీ ర్యాలీగా చేరుకున్న కవితకు గులాబీ పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. 500 కార్లతో ర్యాలీ నిర్వహించారు.
గత నెల 28న హైదరాబాద్కు వచ్చారు. ఆ తర్వాత మరుసటి రోజు ఎర్రవల్లి ఫాంహౌస్ కు వెళ్లి మాజీ సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. వారం రోజుల వరకు తానెవరినీ కలువనని రెస్టు తీసుకుంటానని కవిత అదే రోజు ఉదయం ప్రకటించారు. ఆగస్టు 29న కేసీఆర్ ను కలిసిన కవిత దాదాపు నెల కావస్తున్నా బయటికి రావడం లేదు. రాష్ట్రంలో అనేక రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నా స్పందించడం లేదు. కనీసం సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉండటం లేదు.
ఆమె ట్విట్టర్ హ్యాండిల్ నుంచి కేసీఆర్ ను కలిసిన ఫొటోనే చివరదిగా ఉంది. ఆ తర్వాత ఆమె తన స్పందించలేదు. ఆమెపై ఏమైనా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా..? జైలులో ఉన్నప్పుడు దాదాపు 11 కిలోల బరువు తగ్గిన కవితకు ఏమైనా అనారోగ్య సమస్యలు వచ్చాయా..? అన్నది అంతుచిక్కడం లేదు. ఇదిలా ఉండగా మరో వైపు బతుకమ్మ పండుగ సమీపిస్తోంది. ఈ సారి భారత జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ పండుగ నిర్వహిస్తారా..? ఎక్కడ ఎలా నిర్వహించబోతున్నారు.. ఈ ఉత్సవాల్లో కవిత పాల్గొంటారా..? అన్న క్లారిటీ రావడం లేదు.