ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ ఎటు పాయె

ఎంప్లాయిస్ ఫ్రెండ్లీ ఎటు పాయె

కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి 2014 మేలో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఉద్యమ నేతగా ఉన్న కేసీఆర్​ నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు బలపర్చడంతో రాష్ట్రానికి మొదటి సీఎంగా కేసీఆర్​ పీఠం ఎక్కారు. రెండో దఫా 2018 నవంబర్ లో ముందస్తు ఎన్నికలకు వెళ్లి మళ్లీ విజయం సాధించారు. రాష్ట్రంలో ఆరేండ్ల మూడు నెలలుగా కేసీఆర్ పాలన నడుస్తున్నది. కానీ, నీళ్లు, నిధులు, నియమాకాల కోసం సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో హామీలన్నీ నీటిమూటగా మారింది.

మొదటి దఫా ఎన్నికల్లో విజయం సాధించగానే ఉద్యోగ సంఘాలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి తమది ‘ఎంప్లాయీస్​  ఫ్రెండ్లీ’ సర్కార్​ అని సీఎం కేసీఆర్​ ప్రకటించడం ఉద్యోగులకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఉద్యోగులు కోరుకునేది మంచి వేతనాలు. దీనికి అనుగుణంగా 2013లో ఉమ్మడి రాష్ట్రంలోనే పదో పీఆర్సీ అమలు కావలసి ఉంది. 2012లో ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యోగులంతా ‘జీతం కంటే జీవితం’ముఖ్యమని 42 రోజుల పాటు ‘సకల జనుల సమ్మె’చేశారు. ఆనవాయితీ ప్రకారం పదో పీఆర్సీ అమలు కోసం 2013లో పీకే అగర్వాల్ కమిటీని ఏర్పాటు చేశారు. 2014 జనవరి 1 నుంచి 27% ఐఆర్ మంజూరు చేస్తూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అగర్వాల్​ కమిటీ తన రిపోర్ట్​ను 2014 మేలో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 2014 జులైలో పదో పీఆర్సీ ఫిట్​మెంట్​ కోసం సీఎం కేసీఆర్​తో సమావేశం జరిగింది. ఉమ్మడి రాష్ట్రంలో నిర్ణయించిన పీఆర్సీలకు భిన్నంగా అన్ని సంఘాలతో చర్చించకుండాతానే పీఆర్సీ ప్రకటిస్తానని కేసీఆర్​ ఆ సందర్భంగా చెప్పారు. అయితే అన్ని సంఘాలతో మాట్లాడి ప్రకటిస్తే బాగుంటుందన్న కొందరి సూచన మేరకు టీఎన్జీవో, పీఆర్టీయూ నేతలను పిలిచారు. ఉద్యోగులంతా మనోళ్లే, వాళ్లు కొట్లాడితేనే రాష్ట్రం వచ్చింది, వాళ్లను సంతోషపెట్టడం మన బాధ్యత. 43% ఫిట్​మెంట్​ ఇస్తామని చెప్పారు. బకాయిల విషయాన్ని ప్రస్తావించగా 2014 జూన్ 2 నుంచి చెల్లిస్తామన్నారు.

పోరు బాట పడితే పిలిచి మాట్లాడారు

పీఆర్సీ ప్రకటించాలంటూ, ఉద్యోగులపై వేధింపులను నిరసిస్తూ 2018 ఫిబ్రవరిలో మేడ్చల్ లో టీఎన్జీవో ఆధ్వర్యంలో బహిరంగ సభ నిర్వహించారు. అదే ఏడాది మార్చిలో రాష్ట్రంలోని మొత్తం 53 ఉపాధ్యాయ సంఘాలతో ఏర్పాటైన జాయింట్ కమిటీ ఆఫ్ టీచర్స్ యూనియన్ (జేసీటీయూ) ఎస్ఎస్​సీ​స్పాట్ బహిష్కరణకు పిలుపు ఇచ్చింది. దీంతో 2018 మేలో సంఘాలతో కేసీఆర్​ సమావేశం అయ్యారు. ఉద్యోగుల పనితీరును బట్టే ప్రభుత్వానికి పేరు వస్తుందని, ముఖ్యంగా భూ సర్వే కోసం రెవెన్యూ సిబ్బంది బాగా కష్టపడ్డారని, ఒడిశా, ఉత్తరప్రదేశ్ సీఎంలు మన పనితీరును మెచ్చుకున్నారని, టీచర్లు మంచి ఫలితాలు సాధించారని ప్రశంసలు కురిపించారు. పీఆర్సీ, ఫిట్ మెంట్ అంశాన్ని ఉద్యోగులు లేవనెత్తగా.. ‘పనికి మాలిన కమిషన్లు. మీరు అంటున్నారు కాబట్టి మూడు నెలల్లో రిపోర్టు వచ్చేలా త్రీమెన్ కమిటీ వేద్దాం. 2018 జూన్ 2న ఐఆర్ ప్రకటించుకుందామని, 2018 ఆగస్టు 15 నుంచి పీఆర్సీ అమలు చేసుకుందాం’అని కేసీఆర్​చెప్పారు. సీపీఎస్ రద్దు అంశాన్ని ప్రస్తావించగా, అది పెద్ద అంశమని కేబినెట్​ సబ్​ కమిటీని ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుందామని అన్నారు. దాదాపు ఐదు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో సీపీఎస్ ఉద్యోగులకు గ్రాట్యూటీ చెల్లింపు, బదిలీలు చేపట్టడం, టీచర్ల సర్వీస్ రూల్స్, స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్ల(రూ.398) మంజూరు, పండిట్, పీఈటీ పోస్టుల అప్ గ్రేడేషన్, వేసవి సెలవుల్లో మధ్నాహ్న భోజనం విధుల్లో పాల్గొన్న వారికి ఈఎల్స్ మంజూరు, పెన్షనర్లకు 70 ఏండ్ల క్వాంటమ్ ఆఫ్​ పెన్షన్, 1969, 2000 సంవత్సరాల్లో ఉద్యమంలో పాల్గొన్న పెన్షనర్లకు తెలంగాణ ఇన్సెంటివ్ మంజూరుతోపాటు ఇతర సమస్యలు పరిష్కరిస్తానని సీఎం కేసీఆర్​ హామీ ఇచ్చారు. రాత్రి 9 గంటల తర్వాత గంట పాటు ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాలన్నింటినీ ప్రకటించారు.

ఉద్యోగులూ తెలంగాణ పౌరులే

ఆరేండ్ల కేసీఆర్​ పాలన తీరును రాష్ట్ర ప్రజలు గ్రహించారు. రెండున్నర లక్షల మంది ఉద్యోగులు, టీచర్లు, రెండు లక్షల మందికిపైగా పెన్షనర్లు కూడా తెలంగాణ పౌరులే. గ్రాడ్యుయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాము బీ-ఫాం, మద్దతిచ్చిన అభ్యర్థుల ఓటమిని, అసెంబ్లీ, లోక్​సభ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్స్ వేయలేదనే కోపంతో ఇవ్వాళ మీరు ప్రకటించిన ఎంప్లాయీస్ ​ఫ్రెండ్లీ ప్రభుత్వం.. ఎంప్లాయీస్​ను ఎనిమీలుగా చూస్తోంది. సీఎం కేసీఆర్​ ఇచ్చిన మాట తప్పొద్దని కోరుతున్నాం. సమస్యలను పరిష్కరించకపోతే కరోనా ఉధృతి తగ్గిన వెంటనే రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య వేదిక(జేఏసీ) ఏర్పాటు చేసి, మరోమారు సకల ఉద్యోగులు, యువత, విద్యార్థి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం వచ్చింది.

కేసీఆర్​ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులపై వేధింపులు పెరిగాయి. రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన మొదలుపెట్టారు. టీచర్ల రిక్రూట్​మెంట్​ చేపట్టకుండా విద్యా రంగాన్ని నిర్వీర్యం చేశారు. సంఘాలకు ఒ.డి. రద్దు చేశారు. ఐఆర్, పీఆర్సీపై మాట తప్పారు. 2020 డిసెంబర్ వరకు పీఆర్సీ కమిటీని పొడిగించారు. గతేడాది ఆర్టీసీ సమ్మె సందర్భంగా ఇతర ఉద్యోగ సంఘాలకు ఎర వేసి సమ్మెను నిర్వీర్యం చేశారు. మార్చి నుంచి ‘కరోనా’ మహమ్మారి కారణంగా మూడు నెలలు ఉద్యోగులు, పెన్షనర్లకు సగం వేతనాలే చెల్లించారు. బకాయిల ఊసే ఎత్తలేదు. టీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన 61 ఏండ్లకు రిటైర్మెంట్​ వయసు పెంపు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్, కరోనా పేరు తో కాంట్రాక్టు ఉద్యోగుల తొలగింపు వంటి వాటినీ అటకెక్కించిన ఘనత సీఎం కేసీఆర్​దే.

ఎమ్మెల్సీ ఎన్నికలతో  మారిన సీన్

మారిన పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగుల పట్ల సీఎం కేసీఆర్​ వ్యతిరేకత పెంచుకున్నారు. దీనికి కారణం ఎమ్మెల్సీ ఎన్నికలు. 2015 మార్చిలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ సీటులో టీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోగా, నల్గొండ, ఖమ్మం, వరంగల్ లో ఆ పార్టీ అభ్యర్థి గెలిచాడు. అయితే టీచర్ల వల్లే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోయామని వారిపై కక్ష సాధింపు మొదలుపెట్టారు. తొమ్మిది నెలల పీఆర్సీ బకాయిల చెల్లింపు ఆపేశారు. ఎన్నో ఒత్తిడిలతో 18 వాయిదాల్లో బకాయిలు చెల్లించారు. ఉమ్మడి రాష్ట్రంలో జాయింట్ ఆఫ్​ కౌన్సిల్ లో మెంబర్ షిప్ ఉన్న సంఘాల రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులకు ఒ.డి.(అదర్ డ్యూటీ) సౌకర్యం ఉంది. అది 2014 డిసెంబర్​ 31 వరకు కొనసాగింది. 2015 జనవరి నుంచి ఒ.డి. అడగ్గా మూడు నెలలకు ఒకసారి ఇచ్చారు. ఒ.డి.పై ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఆ కమిటీ రిపోర్ట్​ ప్రకారం ఒ.డి. సంఘాలను నిర్ణయిస్తున్నారు. ప్రస్తుతం రెండు ఉద్యోగ సంఘాలకు మాత్రమే ఒ.డి. ఇచ్చి గతంలో ఒ.డి. పొందిన నాలుగు ఉపాధ్యాయ సంఘాలకు నిలిపివేశారు. – పులి సర్వోత్తమ్ రెడ్డి, బీజేపీ రిటైర్డు టీచర్స్ & ఎంప్లాయిస్ రాష్ట్ర కో-చైర్మన్.