పీఆర్సీ సిఫార్సులపై జీవోలేవీ? : మానేటి ప్రతాపరెడ్డి

పీఆర్సీ సిఫార్సులపై జీవోలేవీ? : మానేటి ప్రతాపరెడ్డి

తెలంగాణ తొలి పీఆర్సీ జులై 2018 నుంచి నోషనల్ గా అమల్లోకి వచ్చింది. మరో తొమ్మిది నెలలు గడిస్తే ఐదేండ్లు పూర్తయి ఈ పీఆర్సీ గడువు కూడా ముగుస్తుంది. 2023 జులై నుంచి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు తెలంగాణ రెండో పీఆర్సీ అమల్లోకి రావాల్సి ఉంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వం నూతన పీఆర్సీ కమిషన్ ఎప్పుడు ఏర్పాటు చేస్తుందో ఎవరికీ తెలియదు. తొలి పీఆర్సీ గడువు ముగుస్తున్నా కమిషన్ చేసిన పలు కీలకమైన సిఫారసుల అమలుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయలేదు. సీఎం ఫిట్​మెంట్ ప్రకటించిన మూడు నెలలకు కొన్ని జీవోలు జారీ చేసి పీఆర్సీ అమలు చేశారు. మిగతా ప్రధాన జీవోలు ఇంకా జారీ కాలేదు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత ఆలస్యం ఎప్పుడూ జరగలేదు. దీనికి తోడు ప్రధాన ఉద్యోగ సంఘాలు ఈ విషయాలు ఏవీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంతో ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ప్రభుత్వంతో సఖ్యతగా ఉండటం మంచిదే కానీ, అందుకు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ప్రయోజనాలను పణంగా పెట్టడం సరికాదు.

కమిటీ సిఫారసులు

బ్లైండ్, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రతినెలా మూలవేతనంలో పది శాతం, గరిష్టంగా రూ.2000 చెల్లిస్తున్న కన్వేయన్స్ అలవెన్స్ మొత్తాన్ని రూ.3000కు పెంచాలని పీఆర్సీ రికమండ్ చేసింది. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్లకు నెలకు రూ.200 హెచ్ఎం అలవెన్స్, ఉన్నత పాఠశాలల్లో పైతరగతులకు బోధించే భాషాపండిట్లు, సెకండరీ గ్రేడ్ టీచర్లకు హయ్యర్ క్లాస్ హ్యాండ్లింగ్ అలవెన్స్ నెలకు రూ.200కు పెంచాలని కమిషన్ సిఫారసు చేసింది. స్పెషల్ పేస్, అన్ని రకాల అలవెన్సెస్ పెంపునకు కమిషన్ రికమండ్ చేసింది. మూల వేతనంపై 8 శాతం అడిషనల్ హెచ్ఆర్ఏను పెంచాలని కూడా కమిషన్ సిఫారసు చేసింది. పిల్లల సంరక్షణ కోసం ప్రస్తుతం ఇస్తున్న 90 రోజుల చైల్డ్ కేర్ లీవ్ ను 120 రోజులకు పెంచాలని, దివ్యాంగ పిల్లలుంటే రెండేండ్లకు పెంచి, 365 రోజులు వందశాతం వేతనంతో, మిగతా 365 రోజులు ఎనభై శాతం వేతనంతో మంజూరు చేయాలని సూచించింది. సర్వీస్ ఉండి మరణించిన ఉద్యోగ, ఉపాధ్యాయుల కుటుంబ సభ్యులు కారుణ్య నియామక పథకం కింద వచ్చే ఉద్యోగం వద్దనుకునే పక్షంలో నాలుగో తరగతి ఉద్యోగుల కుటుంబాలకు రూ.40 వేలు, నాన్ గెజిటెడ్ వారికి రూ.60 వేలు, గెజిటెడ్ వారికి రూ.80 వేల నష్టపరిహారాన్ని ఎక్స్ గ్రేషియా రూపంలో ప్రస్తుతం చెల్లిస్తున్నారు. ఈ ఎక్స్ గ్రేషియా మొత్తాలను ఐదు, ఎనిమిది, పది లక్షల రూపాయలకు పెంచాలని కమిషన్ సిఫారసు చేసింది. ఫ్యామిలీ పెన్షన్, ఫ్యునరల్​ చార్జెస్​ పెంచాలని కమిటీ తెలిపింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి కమిటీ సిఫారసుల అమలుకు చర్యలు తీసుకోవాలి. పీఆర్సీ అమల్లోకి వచ్చిన ఫస్ట్ జులై, 2018 నుంచే మొత్తం సిఫారసులు అమల్లోకి తేవాలి. 

మంత్రివర్గ ఉప సంఘం కావాలి

గ్రామీణ ప్రాంతాల్లో వర్క్ చేస్తున్నవారికి  రూరల్ అలవెన్స్ ఇవ్వాల్సిందేనని పలుమార్లు సీఎం కేసీఆర్​ స్పష్టంగా ప్రకటించారు. రూరల్ అలవెన్స్ ఇస్తామని హామీ కూడా ఇచ్చారు. స్వయంగా ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల అమలుకు ఉన్నతాధికారులు చర్యలు చేపట్టకపోవడం, ఫైల్ ప్రాసెస్ చేయకపోవడం బాధాకరం. ‘సీ’ కేటగిరీ ప్రాంతాల్లో పనిచేస్తున్న వారికి 6 శాతం, మారుమూల ప్రాంతాలైన ‘డి’ కేటగిరి గ్రామాల్లో పనిచేస్తున్నవారికి 10 శాతం రూరల్ అలవెన్స్ ప్రకటించాలి. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు, పెన్షనర్లు తమ సమస్యలు చెప్పుకోవడానికి సాధికారత కలిగిన ఓ వేదిక కావాలి. హెల్త్ కార్డ్స్ సిస్టంను సమూలంగా ప్రక్షాళన చేయాలి. 317 జీవోతో ఉత్పన్నమైన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. సీపీఎస్ సిస్టంను రద్దు చేసి మిగతా రాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలవాలి. పెండింగులో ఉన్న ఉపాధ్యాయుల ప్రమోషన్ల సమస్యను పరిష్కరించాలి. నూతన పీఆర్సీ కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలి. ఆరు నెలల్లోగా నివేదిక తెప్పించుకుని నోషనల్ లేకుండా జులై 2023 నుంచి ఆర్థిక ప్రయోజనాలు వర్తించే విధంగా పీఆర్సీ అమలు చేయాలి. రెండేండ్లుగా వేతనాలు, పెన్షన్లు చెల్లించడం ప్రతి నెలా ఆలస్యమే. ఈ విధానం మారాలి. ప్రతి సమస్యని సీఎం దృష్టికి తీసుకొనివెళ్లడం సంఘాలకు సాధ్యం కాదు. గతంలో కూడా ఎన్నోసార్లు మంత్రివర్గ ఉప సంఘం ఏర్పాటు చేసి, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించారు. ఈ విషయాలపై ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించాలి.

- మానేటి ప్రతాపరెడ్డి, టీఆర్ టీఎఫ్ గౌరవాధ్యక్షులు