కుర్చీ వేసుకొని అభివృద్ధి చేస్తానన్న కేసీఆర్​ ఎక్కడ?

కుర్చీ వేసుకొని అభివృద్ధి చేస్తానన్న కేసీఆర్​ ఎక్కడ?

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశ్న

హనుమకొండ/ వరంగల్, వెలుగు: రాష్ట్రంలోని మహిళలందరినీ మహాలక్ష్ములుగా మార్చి, వారిని పూజించేలా చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. మహిళా సంఘాలకు ఏడాదిలో రూ. 25 వేల కోట్ల వడ్డీ లేని రుణాలు ఇస్తున్నామని, ఐదేండ్లలో లక్ష కోట్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. ‘‘గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరా క్రాంతి పథంతో వడ్డీ లేని రుణాలు ఇచ్చింది. గత బీఆర్​ఎస్​ సర్కారు ఆ  రుణాలను గాలికొదిలేసింది. ఇప్పుడు ఇందిరమ్మ రాజ్యంలో మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దేందుకు  ప్రభుత్వం ఎన్ని వేల కోట్లయినా ఖర్చు పెట్టడానికి  సిద్ధంగా ఉంది” అని ఆయన వరంగల్​ సభలో తెలిపారు. వడ్డీ లేని రుణాలతో మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదగాలనే సంకల్పంతో  ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ‘‘వరంగల్​లో కుర్చీ వేసుకుని కూర్చుని అభివృద్ధి చేస్తానని, ప్రజలు దావత్​ ఇవ్వాలని నాడు కేసీఆర్​ చెప్పిండు. కానీ.. ఆయన ప్రభుత్వం పైసా నిధులివ్వలేదు. దావత్​ ఇద్దామంటే ఆయన కనిపించడం లేదు. రాష్ట్ర ప్రజలకు ఏం ఇచ్చారంటూ ప్రజా ప్రభుత్వాన్ని బీఆర్​ఎస్​ నేతలు ప్రశ్నిస్తున్నారు.. ఇచ్చివన్నీ చెప్తే ఆ నాయకుల కండ్లు తిరుగుతాయి” అని పేర్కొన్నారు. వరంగల్​ పట్టణాన్ని రూ.6 వేల కోట్లతో మహానగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. 

త్వరలోనే రెవెన్యూ యాక్ట్: మంత్రి పొంగులేటి  

రైతు కండ్లలో ఆనందం చూడటం కోసం బడ్జెట్​లో వ్యవసాయానికి రూ. 72 వేల కోట్లు  కేటాయించామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి అన్నారు. ‘‘వరంగల్​ గడ్డమీదే రాహుల్​గాంధీ  రైతు డిక్లరేషన్​ ప్రకటించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన  హామీలను నెరవేరుస్తున్నాం. గత ప్రభుత్వంలో ధరణి సమస్యలతో 2.45 లక్షల అప్లికేషన్లు కలెక్టర్ల దగ్గర పెండింగ్​లో ఉండేవి. ఈ నెలలో వచ్చిన ఫిర్యాదులు తప్ప ప్రస్తుతం  ఎక్కడా పెండింగ్​లో లేవు. గతంలో ప్రభుత్వ భూములతోపాటు పేదల భూములను పింక్​  నేతలు కబ్జా చేశారు. వాటన్నింటినీ బయటకు తెచ్చేందుకు దేశంలోనే ఆదర్శవంతమైన  రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తాం” అని వరంగల్​ సభలో ఆయన పేర్కొన్నారు. 

రేపు గాంధీభవన్​లో డిప్యూటీ సీఎంతో ముఖాముఖి

హైదరాబాద్, వెలుగు: గాంధీభవన్​లో గురువారం జరుగనున్న మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరుకానున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఆయన అందుబాటులో ఉండనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటల నుంచి పీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నారు.