హైదరాబాద్: రాష్ట్రంలో అధికారంలోకి రాకముందు వడ్లకు రూ. 500 బోనస్ ఇస్తామని చెప్పి.. ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక కేవలం సన్నవడ్లకే బోనస్ ఇస్తామంటోందని బీజేపీ నేత, పార్టీ సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారి యెండల లక్ష్మీ నారాయణ అన్నారు.
నాంపల్లిలోని బీజేపీ ఆఫీస్ లో మాట్లాడుతూ.. 'ప్రభుత్వం ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయలేదు. మిల్లర్స్ బ్యాంక్ గ్యారెంటీలతో కొనుగోలు చేపిస్తామన్నారు. ఆ ప్రక్రియ జరగాలి అంటే నెల రోజులు పడుతుంది. అప్పటి లోపు రైతులు ఇంతకో కొంతకు అమ్ముకుంటారు. కాంగ్రెస్ నేతలు ఎప్పుడు ఎదో అంశంతో సమస్యలు పక్కదారి పట్టిస్తున్నారు. ఇప్పుడు మూసిలో భారీ గాంధీ విగ్రహం పెడుతాం అంటున్నారు.పెడితే పెట్టారు కానీ .. రైతులు మాత్రం మావడ్లు కొనుగోలు చేయండి అంటున్నారు' అని లక్ష్మీ నారాయణ అన్నారు.
ఇక పార్టీ రాజ్యాంగం ప్రకారం ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఉంటదని యెండల లక్ష్మీ నారాయణ తెలిపారు. ఈ నెల 7వ తేదీన సంస్థాగత ఎన్నికల నిర్వహణపై వర్క్ షాప్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరవుతారని వివరించారు. సంస్థాగత ఎన్నికలు కలిగిన అతిపెద్ద ప్రజాస్వామ్య పార్టీ బీజేపీ అని చెప్పారు. పోలింగ్ బూత్ నుండి మొదలు పెట్టి మండల, జిల్లా, రాష్ట్ర ఆతరువాత జాతీయ స్థాయి వరకు ఎన్నికలు నిర్వహిస్తున్నామని, బీజేపీ జాతీయ ఎన్నికల రిటర్నింగ్ అధికారిగా లక్ష్మణ్ ఉన్నారని వెల్లడించారు. సంస్థాగతంగా 33 జిల్లాలకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల అధికారులను నియమించామని వివరించారు. ఈనెల 8 , 10 వ తేదీల్లో జిల్లా వర్కుషాప్ లు, 11 నుండి 14 వరకు మండల ఎన్నికల వర్కుషాప్ లు ఉంటాయన్నారు.