75 ఏండ్ల రాజ్యాంగ వజ్రోత్సవాలు చేసుకుంటున్న సందర్భంగా రాజ్యాంగ గొప్పదనాన్ని కొనియాడిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ... ఆ రాజ్యాంగం కోసం, ఈ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడింది కాంగ్రెస్ అనేది గుర్తుంచుకోవాలి. ఈ దేశ ప్రజలు తమని పరిపాలించేందుకు కాంగ్రెస్కు 54 ఏండ్లు అవకాశమిచ్చారు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న జవహర్ లాల్ నెహ్రూను మొదటి ప్రధానిగా ఎన్నుకున్నది ఈ దేశం. భారత్లోని మతతత్వ శక్తుల్ని ఎదిరించి ఈ దేశాన్ని లౌకిక దేశంగా మార్చటానికి ఆయనకు చేయూతనిచ్చింది దేశ ప్రజలు. మనం ప్రస్తుతం పాకిస్థాన్, బంగ్లాదేశ్లలో అరాచక పరిస్థితి చూస్తున్నాం. అలాంటి విచ్ఛిన్నకర శక్తుల పీచమణచటంలో కాంగ్రెస్ ఎనలేని కృషి చేసింది. తమ కేంద్ర కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరవేయటానికి దశాబ్దాలు నిరాకరించిన వారు ఇప్పుడు నెహ్రూను విమర్శించటం హాస్యాస్పదం.
జాతిపిత మహాత్మా గాంధీ హంతకుల్ని సమర్థించిన వారు రాజ్యాంగానికి తామే పరిరక్షకులమని చెప్పుకోవటం గర్హనీయం. రాజ్యాంగ రచనలో, దేశ స్వాతంత్ర్య పోరాటంలో మహిళల విజయాల్ని కీర్తించిన ప్రధానమంత్రి.. నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవానికి మహిళా రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం రాజ్యాంగాన్ని అవమానించటమే అని గుర్తుంచుకోవాలి. జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 వల్ల దేశానికి నష్టం జరిగిందన్న మోదీ... 2018 నుంచి 2024 వరకు ఎన్నికలు జరపలేకపోయారు. ఆ ఆర్టికల్ ని రద్దు చేసిన తర్వాత కూడా అక్కడ తీవ్రవాద కార్యకలాపాల్ని మోదీ ప్రభుత్వం ఆపలేకపోయింది. పన్నులు, ఎలక్షన్లలో ఒకే దేశం మంత్రం పఠిస్తున్న ప్రధానమంత్రి మోదీ.. ఈ దేశంలోని అన్ని రాష్ట్రాల్ని సమానంగా చూడలేకపోతున్నారు. ఓ వైపు మణిపూర్ తగలబడుతున్నా ఏ మాత్రం చలనం లేకుండా కేంద్ర ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోంది. అక్కడ తమ ప్రభుత్వమే ఉన్నా ప్రజల మానప్రాణాల్ని కాపాడలేకపోతోంది.
మోదీ పాలనలో అప్రకటిత ఎమర్జెన్సీ
దేశంలో ఎమర్జెన్సీకి కాంగ్రెస్ కారణమంటూ మోదీ కంటతడి పెట్టారు. కానీ, గత పదేండ్లుగా అన్ని రాజ్యాంగ సంస్థల్ని తమ అజమాయిషీలోకి తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తున్న నరేంద్ర మోదీ అప్రకటిత ఎమర్జెన్సీని కొనసాగిస్తున్నారు. గాంధీ కుటుంబం ఈ దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసింది. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ ఈ దేశ సమగ్రత కోసం కృషి చేశారు. విచ్ఛిన్న శక్తుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు. కనీసం స్వాతంత్ర్య ఉద్యమంలో పాలుపంచుకోని సిద్ధాంతమూలాలు కలిగినవాళ్లకు గాంధీ కుటుంబం గురించి మాట్లాడే అర్హత కూడా లేదు. రాజ్యాంగ సవరణలు ఈ దేశ ప్రయోజనాల కోసమే తప్ప బీజేపీలాగ ఏకపక్షంగా నోట్ల రద్దు లాంటి నిర్ణయాలు ఎప్పుడూ కాంగ్రెస్ తీసుకోలేదు. 1990లో దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు పీవీ నరసింహారావు, అప్పటి ఆర్థికమంత్రి మన్మోహన్ సింగ్ కృషివల్లే దేశం ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది. ఆర్టీఐ, జాతీయ గ్రామీణ ఉపాధి పథకం లాంటి చారిత్రాత్మక పథకాల్ని కాంగ్రెస్ ఈ దేశ ప్రజల కోసం ప్రవేశ పెట్టింది. గ్రామీణాభివృద్ధి కోసం కాంగ్రెస్ పాలనలో చేపట్టిన పథకాలు కొవిడ్ కాలంలో పల్లె ప్రజలకు ఆసరాగా నిలిచాయి. కానీ, మోదీ ప్రభుత్వం మాత్రం ఉపాధి హామీ పథకానికి గత పదేండ్లలో అత్యంత తక్కువగా నిధులు కేటాయించింది. కాంగ్రెస్ 75 సార్లు రాజ్యాంగ సవరణ చేసిందని విమర్శించిన ప్రధానమంత్రి మోదీ..అందులో మొదటి సవరణ జమిందారీ వ్యవస్థ రద్దు, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతికి చర్యల గురించి అనే విషయాన్ని విస్మరించారు.
Also Read : పోడు భూముల సమస్యలు పరిష్కరించాలి
కనీసం మూడేండ్లుగా జనగణన చేయటానికి కూడా జంకుతున్న ఈ ప్రభుత్వానికి ఈ దేశ ప్రజల ఆకాంక్షల్ని తీర్చిన కాంగ్రెస్ ను విమర్శించే నైతిక హక్కు లేదు. దేశ చరిత్రలోనే అత్యధిక వృద్ధి రేటు నమోదైంది కాంగ్రెస్ పరిపాలించిన 2007 సంవత్సరంలోనే. అలాంటి వృద్ధిని ఈనాడు అదానీలాంటి కార్పొరేట్ శక్తుల చేతుల్లో ఉంచి ఎప్పుడు ఎలాంటి అక్రమాలు బయటకు వస్తాయో అనే ఆందోళనకరమైన పరిస్థితిని దేశంలో సృష్టించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామిక పార్టీ, ఏకపక్ష నిర్ణయాలు, నిరంకుశత్వం లేకుండా మా పార్టీ పాలన అందించింది. గుజరాత్ లో సీఎంగా పనిచేసినప్పుడు నరేంద్రమోదీ వ్యవహారశైలిపై అంతర్జాతీయంగా విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం రాష్ట్రాలకు నిధులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఆయనే సారథ్యం వహిస్తున్నారు. మతం పేరుమీద, జాతీయవాదం ముసుగులో ప్రచారం చేసుకుంటూ ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నిస్తున్న ఆయనకు రాజ్యాంగం ఒక అడ్డంకిలా మారింది. మోదీకి రాజ్యాంగం మీద ఏ మాత్రం గౌరవం లేదు. ఆర్ఎస్ఎస్ విధానాల్నే ఎప్పటినుంచో పాటిస్తున్న ఆయనకు రాజ్యాంగాన్ని తాకే నైతికహక్కు ఎక్కడిది?
కాంగ్రెస్ పాలనలోనే దేశాభివృద్ధి
ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం హిందీని దక్షిణ భారతంపై రుద్దేముందు.. అప్పట్లోనే దేశంలోని సంస్కృతి, భాషా వైవిధ్యాల్ని గుర్తించి భాషా ప్రాతిపదికన రాష్ట్రాల్ని ఏర్పాటు చేసిన విషయాన్ని బీజేపీ గుర్తుంచుకోవాలి. దేశాన్ని ఐక్యం చేయటంలో భాగంగా దాద్రానగర్ హవేలీ, గోవా, నాగాలాండ్, పుదుచ్చేరి, సిక్కింని కలుపుకొని రాజ్యాంగ సవరణల ద్వారా ప్రత్యేక రాష్ట్రం, కేంద్ర పాలిత ప్రాంత హోదాను తెచ్చింది. రాష్ట్రాల ఆకాంక్షల్ని గుర్తించి ఆర్టికల్ 371 లాంటి వైవిధ్యమైన సవరణల్ని తీసుకువచ్చింది. పరిపాలనలో సౌలభ్యం, ప్రజాసంక్షేమం కోసం రాజ్యాంగాన్ని సవరించటంలో తప్పులేదని సుప్రీంకోర్టు అప్పట్లోనే తీర్పు చెప్పింది. రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోకుండా వన్ నేషన్ వన్ ఎలక్షన్ పేరుతో నరేంద్ర మోదీ తేబోతున్న రాజ్యాంగ సవరణ బిల్లులు దేశానికి ఏమాత్రం ప్రయోజనకరం కానప్పటికీ అప్పట్లో ప్రజాసంక్షేమం కోసం చేసిన సవరణల్ని ఆయన విమర్శించటం అన్యాయం.
- తోట లక్ష్మీకాంతరావు,
జుక్కల్ ఎమ్మెల్యే