
దుబాయ్ గడ్డపై బంగ్లాదేశ్ బ్యాటర్లు తడబడుతున్న తీరు చూస్తుంటే.. జట్టులో సీనియర్ ఎంత అవసరమో స్పష్టమవుతోంది. ఆట ప్రారంభమైన మొదటి గంటలోనే బంగ్లాదేశ్ సగం వికెట్లు కోల్పోయింది. బంగ్లా ప్రీమియర్ లీగులో వందల కొద్దీ పరుగులు చేసిన బంగ్లా క్రికెటర్లు.. దుబాయ్ గడ్డపై తేలిపోయారు. భారత బౌలర్లను ఎదుర్కోలేక పెవిలియన్ బాట పట్టారు.
ఆ సమయంలో బంగ్లా జట్టులో వెటరన్ ఆల్‌రౌండర్ షకీబ్ అల్ హసన్ ఉంటే బాగుండేదన్న మాటలు వినపడుతున్నాయి. అసలు షకీబ్ ఎక్కడ..? అతన్ని ఛాంపియన్స్ ట్రోఫీకి ఎందుకు ఎంపిక చేయలేదు..? అన్న ప్రశ్నలు తెరమీదకు వస్తున్నాయి.
ఏ ఐసీసీ టోర్నీ తీసుకున్నా.. బంగ్లా జట్టులో షకీబ్ కీలక ప్లేయర్. బౌలింగ్, బ్యాటింగ్ రెండు విభాగాల్లోనూ రాణించేవాడు. బ్యాటింగ్‌లో భారీ ఇన్నింగ్స్‌లు ఆడిన సందర్భాలు లేనప్పటికీ, బౌలింగ్‌లో అతన్ని ఎదుర్కోవడం అంత తేలికైన విషయం కాదు. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నరైన షకీబ్.. వేగంగా బంతులేస్తూ దెబ్బకొట్టేవాడు. అతడు జట్టులో ఉన్నాడంటే, బంగ్లా ఆటగాళ్లు మరింత ఆత్మవిశ్వాసంతో కనిపించేవారు. అటువంటిది అతని లేని లోటు స్పష్టంగా తెలుస్తోంది.
ఐసీసీ నిషేధం..
బంగ్లాదేశ్ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో షకీబ్ లేకపోవడానికి అసలు కారణం.. ఐసీసీ నిషేధం. అవును, ఈ వెటరన్ ఆల్‌రౌండర్ ఐసీసీ నిషేధం ఎదుర్కొంటున్నాడు. అతని బౌలింగ్ యాక్షన్ చట్టవిరుద్ధమని తేలడంతో ఐసీసీ అతనిపై ఈ చర్యలు తీసుకుంది. అతడు తన బౌలింగ్ యాక్షన్ సరైనదని నిరూపించుకునే అంతవరకూ ఈ సస్పెన్షన్ కొనసాగనుంది. పోనీ బ్యాటర్‌గా అతన్ని జట్టులోకి తీసుకుందామన్నా.. ఇటీవల కాలంలో ఈ అనుభవజ్ఞుడి బ్యాటింగ్ ఫామ్ పెద్దగా లేదు. అందువల్లే అతన్ని ఎంపిక చేయలేదు.
జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. షకీబ్ అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్టే కనిపిస్తోంది. ఇతగాడు మళ్లీ బంగ్లా జట్టులో కనిపించే దారులు లేవు. షకీబ్ మూడు ఫార్మాట్లలో 14000 పరుగులు, 700కుపైగా వికెట్లు పడగొట్టాడు.