- ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి బండ బూతులు తిట్టడంతో మనస్తాపం
- రెండు రోజులుగా ఉన్నతాధికారులకు అందుబాటులో లేని సిఐ
- వైరల్ గా మారిన ఫోన్ ఆడియో రికార్డ్
- సీఐ కంప్లయింట్ తో ఎమ్మెల్సీపై కేసు నమోదు
తాండూరు టౌన్ సీఐ రాజేందర్ రెడ్డి ఇప్పుడు ఎక్కడున్నారు..? పోలీస్ డిపార్ట్ మెంట్ తో పాటు రాజకీయ వర్గాల్లోనూ ఇదే చర్చ నడుస్తోంది. మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ఫోన్ లో బండ బూతులు తిట్టడంతో మనస్తాపం చెందిన తాండూరు సీఐ రాజేందర్ రెడ్డి రెండు రోజులుగా ఉన్నతాధికారులకు అందుబాటులో లేరు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేపడుతున్నట్లు తెలుస్తోంది. సీఐ ఫిర్యాదుతో ఎమ్మెల్సీపై తాండూర్ టౌన్ పీఎస్‌లో కేసు నమోదైంది. ఎమ్మెల్సీ కామెంట్స్ పై పోలీస్ అధికారుల సంఘం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.
సీఐపై ‘పట్నం’ నోరుపారేసుకోవడానికి అసలు కారణమేంటి..?
శనివారం (ఈనెల 23న ) తాండూరులో భావిగి భద్రేశ్వర స్వామి జాతరలో పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, స్థానిక టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. ముందుగా వెళ్లిన ఎమ్మెల్సీ, నేతలు ఆనవాయితీగా పరిచిన రెడ్ కార్పెట్ పై కూర్చున్నారు. అనంతరం ఎమ్మెల్యే వెళ్లగా ఆలయ నిర్వాహకులు మరో రెడ్ కార్పెట్ వేశారు. అయితే దేవుడి విగ్రహం ముందు, పూజకు దగ్గరగా ఎమ్మెల్యే కూర్చున్నారు. వెనక వచ్చిన ఎమ్మెల్యేకు ప్రాధాన్యం ఇచ్చారంటూ ఎమ్మెల్సీ అనుచరులు చర్చించుకుని, ఇందుకు తాండూర్ టౌన్ సీఐ రాజేందర్ రెడ్డినే కారణమని ఆరోపిస్తూ మహేందర్ రెడ్డికి చెప్పారు. బుధవారం ( ఈనెల 27న ) సీఐకి మహేందర్‌రెడ్డి ఫోన్ చేసి బండ బూతులు తిట్టారు. దమ్ముంటే కేసు పెట్టుకో అంటూ సవాల్ చేశారు. ఆ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో సీఐ తాను డ్యూటీ చేస్తున్న స్టేషన్‌లోనే పట్నం మహేందర్ రెడ్డిపై ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్సీపై 353, 504, 506 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎమ్మెల్సీ తీరును పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు వై.గోపిరెడ్డి ఖండించారు. ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహేందర్ రెడ్డి తీరును ఖండిస్తూ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మద్దతుదారులు బుధవారం రాత్రి తాండూరులో ఆందోళనలు చేశారు.
గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో దిగిన పైలట్ రోహిత్ రెడ్డి చేతిలో పట్నం మహేందర్ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఫైలట్ రోహిత్ రెడ్డి అధికార టీఆర్ ఎస్ లో చేరారు. అప్పటి నుంచి ఈ ఇద్దరు నేతల మధ్య వర్గ పోరు నెలకొంది.
ఫోన్ ఆడియో రికార్డ్ నాది కాదు : పట్నం
తాండూరు టౌన్ సీఐ రాజేందర్ రెడ్డిని తాను బూతులు తిట్టలేదని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఇదంతా కావాలనే కొంతమంది సృష్టించారంటూ కొట్టిపారేశారు. శనివారం (ఈనెల 23న ) తాండూరులో భావిగి భద్రేశ్వర స్వామి జాతరలో వేదికపై ఉన్న తనను ఇద్దరు రౌడీషీటర్లు ఇబ్బంది పెట్టారని, ఇదే విషయంపై తాండూరు టౌన్ సీఐ రాజేందర్ రెడ్డిని వివరణ అడిగానని చెప్పారు. ఫోన్ లో మాత్రం తాను సీఐను అసలు తిట్టనేలేదని చెప్పారు. పోలీసులంటే తనకు ఎంతో గౌరవం, అభిమానం అన్నారు.
తాండూరు ప్రజలకు తాను ఎల్లప్పుడు రుణపడి ఉంటానని, నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు. ఆ ఆడియోలో వాయిస్ తనది కాదన్నారు. ఇదంతా తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చేయించి ఉంటారని ఆరోపించారు. తన నియోజకవర్గ ప్రజల గురించి ఎంతవరకు అయినా వెళ్తానని, తనపై ఎన్ని కేసులు పెట్టినా ఎవరికీ భయపడనన్నారు. ఈ కేసును కోర్టులోనే న్యాయపరంగా ఎదుర్కొంటానని చెప్పారు. ‘ఆ రోజు అనుకోకుండా జరిగిన సంఘటనపై మంత్రి కేటీఆర్ ఏం మాట్లాడుతారు..?’ అంటూ విలేఖరులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అరాచకాల గురించి ఎవరిని అడిగినా చెబుతారని చెప్పారు. తమ మధ్య విభేదాలు ఏంటో అందరికీ తెలుసు అంటూ మాట దాట వేశారు.