గడప దాటని ‘తెలంగాణ’పత్రిక: ముద్రించి మూలకేస్తున్న I & PR

  • ప్రజలకు చేరని  ప్రభుత్వ పథకాల సమాచారం
  • కుట్రలో భాగంగానే అడ్డుకుంటున్నారని టాక్
  • కోట్లు ఖర్చు చేసి ప్రింట్ చేసినా దండగేనా..?
  • సమాచారశాఖ వైఫల్యంపై విమర్శల వెల్లువ

హైదరాబాద్: ప్రభుత్వ పథకాలు, తెలంగాణ సాధించిన విజయాలను ప్రజలకు చేరవేయడమే లక్ష్యంగా ప్రింట్ అవుతున్న తెలంగాణ మాస పత్రిక సమాచారశాఖ ఆఫీసు గడపదాటడం లేదు. వేలాది కాపీలను గ్లేజ్డ్ పేపర్ పై అందగా ముద్రించి మూలకేస్తున్నారు. కోట్లు ఖర్చు చేసి ప్రింట్ చేస్తున్న ఈ పత్రిక ప్రజల్లోకి వెళ్లకపోవడంపై అనేక అనుమానాలున్నాయి. కొందరు అధికారులు కావాలనే వాటిని బయటికి పంపడం లేదనే చర్చ కూడా ఉంది. 

గతేడాది డిసెంబర్ 7న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రభుత్వం కొలువు దీరింది. ఈ మేరకు పలు కొత్త పథకాలను ఇప్పటికే ప్రవేశపెట్టింది. మహాలక్ష్మి, గృహజ్యోతి, రైతు రుణమాఫీ, సన్నవడ్లకు బోనస్, మహిళా సంఘాలకు రుణాలు.. ఇలా అనేక పథకాలను ప్రవేశపెట్టింది. వాటికి సంబంధించిన వివరాలను తెలంగాణ మాస పత్రికలో ముద్రిస్తున్నారు. తెలంగాణ సాధించిన విజయాలను అందులో పేర్కొంటున్నారు. ప్రతి నెలా 24 వేల కాపీలను ప్రభుత్వ సమాచార శాఖ ప్రింట్ చేస్తోంది. ఇందులో 20 వేల కాపీలు తెలుగులో, నాలుగు వేల కాపీలు ఉర్దూ భాషలో  ప్రింట్ చేస్తోంది. 

వీటిని సంబంధిత లైబ్రరీలకు, మున్సిపాలిటీలు, పంచాయతీలకు, ప్రభుత్వ కార్యాలయాలకు పంపాల్సి ఉంటుంది. ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి. తెలంగాణ మాస పత్రికను బాధ్యతయుతంగా పత్రికను ప్రజల్లోకి చేర్చాల్సి ఉన్నా.. సమాచార శాఖ పట్టించుకోకపోవడం, కార్యాలయంలో ఓ మూలన బండిళ్లను పడేస్తుండటం విస్మయం కలిగిస్తోంది. అయితే కొందరు అధికారులు కుట్రలో భాగంగా ఈ కాపీలను మూలన పడేస్తున్నారనే వాదన కూడా ఉంది. 

పోటీ పరీక్షలకు ఉపయుక్తం

ప్రభుత్వ పథకాలు, సర్కారు ఇచ్చే గణాంకాలు తెలంగాణ మాస పత్రికలో ఉంటాయి. ఇవి పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ఉపయుక్తంగా ఉంటాయి. ఈ పుస్తకాలు అందుబాటులో ఉండకపోవడంతో ఉద్యోగార్థులు ఇతర సమాచారంపై ఆధార పడాల్సిన పరిస్థితి ఏర్పడింది.  అశోక్ నగర్, గాంధీ నగర్, దిల్ సుఖ్ నగర్, అమీర్ పేట లో తెలంగాణ పత్రికకు విపరీతమైన డిమాండ్ ఉంది. 

డీపీఆర్వో ఆఫీసుల్లోనూ కుప్పలు తెప్పలు

తెలంగాణ మాస పత్రికను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో సమాచార పౌరసంబంధాల శాఖ విఫలమైందనే వాదన బలంగా వినిపిస్తోంది. కొన్ని కాపీలుజిల్లాలకు హైదరాబాద్ నుంచి  వెళ్తున్నా.. అవి క్షేత్ర స్థాయికి చేరడంలేదు. డీపీఆర్వో ఆఫీసుల్లో కుప్పలు తెప్పలుగా పడి ఉంటున్నాయి. అవి తర్వాత స్క్రాప్ రూమ్ లోకి వెళ్లిపోతున్నాయి. సెక్రటేరియట్ నుంచి పంచాయతీ వరకు అన్ని ఆఫీసుల్లో ఈ పత్రిక అందుబాటులో ఉండాలి.  కానీ తెలంగాణ పత్రిక ఎక్కడికి చేరడం లేదు. సచివాలయంలోని మీడియా సెంటర్ లో గుట్టలుగా పేరుకు పోవడం గమనార్హం. కనీసం మంత్రులు తమ పేషీల్లో పెట్టే ప్రెస్ మీట్ల వేళ, సచివాలయానికి వచ్చే విజిటర్లకు ఇచ్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.

బ్లాక్ లో రూ. 40కి ఒక బుక్!

సమాచారశాఖ ఈ పుస్తకాలను బయటికి విడుదల చేయకపోవడంతో అశోక్ నగర్, ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని బుక్ స్టాళ్ల యజమానులు వాటిని జిరాక్స్ తీసి రూ. 40 గా ధర నిర్ణయించి విక్రయిస్తున్నారు.  పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారు వాటిని కొనుగోలు చేస్తున్నారు. ప్రభుత్వం ఈ పుస్తకాన్ని రూ. 20కి ఒకటి చొప్పు అందిస్తోంది. సమాచారశాఖ నిర్వాకం బుక్ స్టాళ్ల యజమానులకు వరంగా మారింది.