మహా అద్భుతం...  ఎంతో మహిమ గల క్షేత్రం... 108 శివలింగాలు.. 108 మారేడు మొక్కలు

మహా అద్భుతం...  ఎంతో మహిమ గల క్షేత్రం... 108 శివలింగాలు.. 108 మారేడు మొక్కలు

ఇది అద్భుతమైన మహిమగల క్షేత్రం. శ్రీ మహా శైవ క్షేత్రము శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ సమేత శ్రీ వైద్యనాదలింగేశ్వరస్వామి ... గోదావరి నదీ  తీరాన ఉన్న ఈ స్వామిని దర్శించుకొనినేందుకు తెలంగాణ రాష్ట్రం నలుమూలల నుంచి  వచ్చిన భక్తులు స్వామిదర్శనంతో పరవశించారు.  ఈ క్షేత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల పరిధిలో కొండాయిగూడెం, రామానుజవరం గ్రామాల సరిహద్దులో గోదావరి నది ఒడ్డున ఉంది.  ఈ దేవాలయాన్ని ఎప్పుడు కట్టారు.. ఏరోజు ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు.. ఈక్షేత్రానికి ఎలా వెళ్లాలి... అనే విషయాలను తెలుసుకుందాం. . . .

దేశంలోని ఎన్నో ప్రసిద్ధి చెందిన శైవక్షేత్రాలకు లేని ప్రత్యేకత ఇక్కడి భ్రమరాంబ సమేత వైద్యనాద లింగేశ్వర మహా శైవక్షేత్రానికి ఉంది. మరెక్కడా లేని విధంగా ఈ మహా శైవక్షేత్రంలో నవగ్రహాలు సతీసమేతంగా ప్రతిష్ఠించారు. 35 అడుగుల అభయాంజనేయ స్వామి క్షేత్రపాలకుడిగా దర్శనమిస్తాడు. ఆలయం చుట్టూ 108 శివలింగాలు ప్రతిష్ఠించారు. 108 మారేడు మొక్కలను కూడా నాటారు. భ్రమరాంబ సమేత వైద్యనాథ శివలింగ మహా శైవక్షేత్రం ప్రతిష్టాపన 2009లో జరిగింది. ఇది తూర్పు అభిముఖంగా ఉంటుంది. అంతేకాకుండా ఆలయానికి ఉత్తరం వైపున గోదావరి నది ప్రవహిస్తోంది. ఈ ఆలయం పక్కనే వల్లీ దేవసేనా సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం నిర్మించారు. మరిన్ని ఆలయాలు కూడా కడుతూ ఉన్నారు. 

ప్రతి సోమవారం క్షేత్రంలో అన్నదానం చేస్తుంటారు. సుబ్రహ్మణ్య షష్టి రోజున వల్లీదేవసేన సమేతంగా సుబ్రహ్మణ్య స్వామి వారి కల్యాణం జరుపుతారు. మాస శివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు చేసి, శివ, పార్వతుల కల్యాణం చేస్తారు. గోదావరి నది పక్కన ఈ మహాశైవక్షేతం ఉండడంతో ప్రభుత్వం గోదావరి పుష్కరాల సందర్భంగా పుష్కరఘాట్ ను కట్టించింది. గోదావరి నదికి చాలా దగ్గరగా ఉండడంతో వయసు పైబడిన వాళ్లు కూడా ఈజీగా ఇక్కడ నదీ స్నానాలు చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది  .

సతీ సమేతంగా నవ గ్రహాలు...

ఏ ఆలయంలోనైనా నవ గ్రహాలు అన్నీ ఒకే చోట ఉంటాయి. అందుకోసం ప్రత్యేకంగా ఆలయం కట్టరు. ఆలయం ముందు ఒకే రూఫ్ కింద వాటిని ప్రతిష్ఠిస్తారు. కానీ.. ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా ఒక్కో గ్రహం కోసం ఒక్కో ఆలయం కట్టారు. అంతేకాకుండా నవగ్రహాలను సతీసమేతంగా ప్రతిష్ఠించారు. మహాశివరాత్రికి ఇక్కడ ఉత్సవాలు ఎంతో వైభవంగా జరుగుతాయి. జాతరకు మణుగూరు, పినపాక మండలాల ప్రజలే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి మంగపేట, రాజుపేట, ఏటూరునాగారం ప్రాంతాల నుంచి కూడా భక్తులు వస్తారు. ఏటా మహాశివరాత్రి రోజున సుమారు 35వేల మంది భక్తులు స్వామి దర్శనం చేసుకుంటారు. 

ఎలా వెళ్లాలి..

మణుగూరు పట్టణం హైదారాబాద్ కు 330కిలోమీటర్ల దూరంలో ఉంది. ఖమ్మం పట్టణానికి 150 కిలోమీటర్లు, వరంగల్ కు 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. భద్రాద్రి కొత్తగూడెం నుంచి 70 కిలోమీటర్ల దూరం. హైదరాబాద్ నుంచి మణుగూరుకు బస్సు సౌకర్యం ఉంది. సికింద్రాబాద్ నుంచి ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది. ఖమ్మం నుండి భద్రాద్రి కొత్తగూడెం మీదుగా ప్రతి గంటకు ఒక బస్సు ఉంటుంది. వరంగల్ నుంచి ఏటూరు నాగారం మీదుగా బస్సులు ఉంటాయి.