ప్లాస్టిక్​ నిషేధం సరే ప్రత్యామ్నాయ చర్యలేవి ?

జులై 1 నుంచి కొన్ని సింగిల్​ యూజ్​ ప్లాస్టిక్​ వస్తువుల ఉత్పత్తి, దిగుమతి, వాడకంపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. దీనికి సంబంధించి నిరుడు ఆగస్టులోనే నోటిఫికేషన్ ​విడుదల చేసింది. ఉత్పత్తి పరిశ్రమ, వినియోగదారులు ప్రత్యామ్నాయం వైపు మళ్లడానికి ఇంత సమయం ఇచ్చిన ప్రభుత్వం.. రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థలతో కలిపి ప్రత్యామ్నాయాలను తీసుకురావడానికి ఎటువంటి చర్యలూ చేపట్టడం లేదు. 

ప్లాస్టిక్ వస్తువులతో కాలుష్యం పెరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకప్పుడు పట్టణాల్లో మాత్రమే కనిపించే ప్లాస్టిక్ బ్యాగులు ఇతర ప్లాస్టిక్ వస్తువులు ఇప్పుడు పల్లెలు, పచ్చని పొలాలు, అడవులు, మారుమూల ప్రాంతాల్లోనూ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ వ్యర్థాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. అవసరం ఉన్నా, లేకున్నా ఏదో ఓ రూపంలో ప్లాస్టిక్ కవర్ ను​ఇంటికి తీసుకువెళ్తున్న ప్రజలు.. ఒకసారి వాడి దాన్ని పడేస్తుండటంతో ప్రతి ఇంటి నుంచి ప్లాస్టిక్ వ్యర్థాల పరిమాణం రోజురోజుకు పెరుగుతున్నది. తేలికపాటి వ్యర్థాలు గాలికి కొట్టుకుపోతాయని భావిస్తున్న పారిశుద్ధ్య కార్మికులు.. వాటిని కాలపెడుతున్నారు. ఈ పని కాలుష్యాన్ని మరింత పెంచుతోంది. కరోనా మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో ప్లాస్టిక్ వినియోగం విపరీతంగా పెరిగింది. మాస్కులు, పీపీఈ కిట్లు ఉపయోగించి పడేయడంతో టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు పేరుకుపోయాయి. సముద్రాలు, చెరువులు, వాగులు, నదుల్లో ప్లాస్టిక్ వ్యర్థాల అవశేషాలు చూడడానికి అసహ్యంగా కనిపిస్తున్నాయి. ఈ భయానక పరిణామాల నేపథ్యంలోనే ప్రపంచమంతటా సింగిల్​యూజ్​ప్లాస్టిక్(ఎస్​యూపీ) వస్తువులను నిషేధించే ప్రయత్నాలు ఊపందుకున్నాయి. సింగిల్-యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో ముందున్న100 దేశాల్లో మొదటి మూడు స్థానాల్లో సింగపూర్, ఆస్ట్రేలియా, ఒమన్ ఉన్నాయి. ఇండియా 94 వ స్థానంలో ఉంది. దేశీయంగా ఏటా11.8 మిలియన్ మెట్రిక్ టన్ను(ఎంఎంటీ)ల ఉత్పత్తి, 2.9 ఎంఎంటీల దిగుమతి ఉంది. కాగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాల నికర ఉత్పత్తి 5.6 ఎంఎంటీ కాగా, తలసరి ఉత్పత్తి 4 కిలోలు. ఇతర దేశాలతో పోలిస్తే మన స్థానం దిగువనే ఉన్నా, మన చుట్టూ ఉన్న పరిసరాలను గమనిస్తే సమస్య తీవ్రత అర్థం అవుతుంది. 

ప్యాకేజింగ్ ​నుంచి ఎక్కువ

ప్రభుత్వం జులై 1 నుంచి నిషేధిస్తున్న ప్లాస్టిక్ వస్తువుల్లో సాధారణ ప్రజలు విందులు, వినోదాల్లో వాడే వస్తువులే ఎక్కువగా ఉన్నాయి. నిషేధిత జాబితాలో ఉన్న ప్లాస్టిక్ వస్తువులను ఎంచుకోవడానికి గల కారణాలు ప్రభుత్వం ఇప్పటి వరకు బహిర్గతం చేయలేదు. నిపుణుల అంచనా ప్రకారం.. ఒకసారి వినియోగించి పడేసే ప్లాస్టిక్ వస్తువుల్లో నిషేధించే వాటి పరిమాణం ఎక్కువగా లేదు. ఈ తరహా ప్లాస్టిక్ వ్యర్ధాలు దాదాపు 98 శాతం ప్యాకేజింగ్ నుంచి వస్తున్నవేనని వారు అంటున్నారు. నిరుడు నోటిఫికేషన్ ఇచ్చిన తరువాత పర్యావరణవేత్తలు లేవనెత్తిన అంశాల పట్ల కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించలేదు. ప్లాస్టిక్ ప్యాకేజింగ్ నియంత్రణ గురించిన చర్చ జరగాల్సి ఉంది. 

ప్లాస్టిక్ ​ను అరికట్టే మార్గాలున్నా..

ప్లాస్టిక్ కాలుష్య భూతం అరికట్టాలంటే అనేక మార్గాలు ఉన్నాయి. ప్రభుత్వాలు కేవలం నిషేధ మార్గం ఎంచుకోవడం కూడా గమనార్హం. ఫలానా పట్టణంలో ప్లాస్టిక్ కవర్ల నిషేధం విధించారని ప్రకటనలు అనేకం చూశాం. ఇప్పటికీ అనేక పురపాలక సంఘాలు ప్లాస్టిక్ కవర్లలో 50 మైక్రాన్ లోపు ఉన్నవాటిని నిషేధించి, రోడ్ల మీద వ్యాపారాలు చేసుకునే వారి మీద తమ ప్రతాపం చూపడం చూస్తున్నాం. ప్లాస్టిక్​వాడకం తగ్గించాలంటే ఉత్పత్తి తగ్గించడం ఒక మార్గం. ఉత్పత్తి నియంత్రణపై స్థానిక ప్రభుత్వాల అజమాయిషీ లేని పరిస్థితిల్లో రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవచ్చు. లైసెన్సింగ్ విధానంలో మార్పులు తీసుకురావాలి. దూరదృష్టి, సమగ్ర ఆలోచన లేకనే ప్రభుత్వం నిషేధం విధించడాన్ని సులువైన మార్గంగా ఎంచుకున్నది. అందులోనూ పెద్దగా వ్యతిరేకత రాని ఉత్పత్తులు, సామాన్యులకు ఉపయోగపడే వస్తువుల మీద మాత్రమే. నిషేధ పద్ధతి అమలు కూడా సరైన ప్రణాళికతో చేయడం లేదు. నోటిఫికేషన్ ఇచ్చిన నెలల తరువాత, గత సంవత్సర కాలం ఉపయోగించుకోకుండా, ఆఖరు నిమిషంలో చర్యలు చేపడుతున్న ప్రకటన వల్ల కేంద్ర ప్రభుత్వానికి ఈ నిషేధం ద్వారా సత్ఫలితాలు రాబట్టే ఉద్దేశం ఉన్నట్లు కనిపిస్తలేదు. 

సహజ సిద్ధమైన వాటిని ప్రోత్సహిస్తేనే..

ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి, పుడమికి, జీవ జాతి మనుగడకు జరుగుతున్న హాని, జరగబోతున్న దీర్ఘకాలిక మార్పుల నేపధ్యంలో వ్యక్తులు, సంస్థలు, ప్రభుత్వాలు చేష్టలుడిగి చూస్తున్నారు. ఎవరూ ఏమీ చేయలేమని భావిస్తున్నారు. కానీ, సుస్థిర ఫలితాలకు అనేక మార్గాలు ఉన్నాయి. కొందరు వ్యక్తులు, కొన్ని సంస్థలు మనకు మార్గాలు చూపెడుతున్నాయి. ప్రత్యామ్నాయ ఉత్పత్తులు మార్కెట్లో ఇప్పటికే ఉన్నాయి. వాటి ఉత్పత్తి పెంచే విధానం కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటించలేదు. ప్రత్యామ్నాయాల మీద అధ్యయనం చేసి, ఆయా పదార్థాల ఉపయోగం మీద అంచనా వేసి, తగు విధంగా ఉత్పత్తి ప్రోత్సాహకాలు ఇచ్చే ఒక సమగ్ర ప్రణాళిక కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలతో కలిసి చేయాలి. మన దేశంలో ఇప్పటికీ చేతి వృత్తుల మీద ఆధారపడి బతుకుతున్న లక్షల కుటుంబాలు ఉన్నాయి. వారు తయారు చేసే వస్తువులకు ప్రభుత్వం నుంచి సహకారం లభిస్తే, వారికి ఆదాయం పెరిగితే, మన దేశానికి ప్లాస్టిక్ భూతం నుంచి విముక్తి లభిస్తుంది. పోకచెట్టు ఆకులతో, అరటి ఆకులతో ప్లాస్టిక్ ప్లేట్లకు ప్రత్యామ్నాయం అనేక మంది చూపెడుతున్నారు. మోదుగ ఆకు విస్తరులు ఉపయోగం పెంచితే నిషేధం లక్ష్యం నెరవేర్చే అవకాశం వస్తుంది. తేలిక నేలల్లో, పడావు భూముల్లో మోదుగ లాంటి చెట్ల పెంపకం ప్రోత్సహించాల్సిన ప్రభుత్వాలు నిషేధం మీదనే ఆశలు పెట్టుకున్నట్లు ఉన్నాయి. ప్రభుత్వాలు, పురపాలక సంఘాలు, పంచాయతీలు ఈ దిశగా పయనించడానికి ప్రజలు నుంచి ఒత్తిడి రావాలి.

స్థానిక సంస్థల సహకారంతో..

సూక్ష్మ, అతిసూక్ష్మ ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి జీవజాతికి హాని పొంచి ఉన్నది. యూరోప్ దేశాల్లో మంచి నీటిలో అతిసూక్ష్మ ప్లాస్టిక్ కణాలు, ఫైబర్ ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. వీటి గురించి ప్రజల్లో అవగాహన లేదు. ప్రభుత్వం వీటిని కూడా నిషేధించాల్సిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎస్​యూపీ వస్తువులపై నిషేధం అమలు చేసే బాధ్యత కేంద్ర కాలుష్య నియంత్రణ మండలికి అప్పగించింది. కాగా రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల సహకారం లేనిదే ఇది సాధ్యపడదు. ఇటీవల కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఎస్ యూపీ వస్తువుల నిషేధానికి చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. నిషేధిత వస్తువుల ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్థాల సరఫరా నిలిపివేయాలని పెట్రోకెమికల్ కంపెనీలను కోరడం, దిగుమతులను ఆపాలని కోరడం, ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించడం, ఉత్పత్తి అనుమతుల నిలిపివేత, ప్రజల ఫిర్యాదుకు యాప్ ను తేవడం, డిజిటల్ మాధ్యమాల ద్వారా ప్రజల్లో అవగాహన పెంచడం, రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలిలకు మార్గదర్శకాల జారీ లాంటి చర్యలను  కాలుష్య నియంత్రణ మండలి ప్రకటించింది. 

దొంతి నర్సింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్