ఎవుసమంతా పాత ప్రాజెక్టులు, వాననీళ్లతోనే
కొత్త ప్రాజెక్టుల కింద ఆయకట్టే లేదు.. కాళేశ్వరంతో ఒక్క ఎకరానికీ నీళ్లందలే
ఈయేడు కాలం మంచిగైంది. సీజన్లో ఇప్పటివరకు కోటీ 26 లక్షల ఎకరాల్లో పంటలు వేస్తే.. అందులో 85 లక్షల ఎకరాలు కేవలం వానల కిందనే సాగులోకి వచ్చినయ్. ప్రాజెక్టుల కింద సాగులోకి వచ్చింది 41 లక్షల ఎకరాలు మాత్రమే. అది కూడా పాత ప్రాజెక్టుల వల్లనే. లక్ష కోట్లతో కట్టామంటూ గొప్పగా చెప్పుకుంటున్న కాళేశ్వరం కింద ఒక్క ఎకరానికైనా నీళ్లందలేదు. అయినా ప్రభుత్వం మాత్రం కాళేశ్వరం నీళ్లతోనే సాగుకోటి ఎకరాలు దాటిందని గొప్పలు చెప్పుకుంటోంది.
హైదరాబాద్, వెలుగు: ఈ ఏడాది కూడా రాష్ట్రంలోని పంటలకు పాత ప్రాజెక్టులే ప్రాణాధారమయ్యాయి. భారీగా కురిసిన వర్షాలు, బావులు, బోర్లు, పంపు సెట్లే రైతులను ఆదుకున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఈ వానా కాలంలో రికార్డు స్థాయిలో 1.26 కోట్ల ఎకరాల్లో పంటలు సాగులోకి వచ్చినట్లు వ్యవసాయ శాఖ ప్రకటించింది. ఇందులో ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా సాగులోకి వచ్చిన ఆయకట్టు కేవలం 41 లక్షల ఎకరాలు. అంటే మూడో వంతులోపే (32 శాతం మాత్రమే). మిగతా 68 శాతం భూములకు వర్షాలు, భూగర్భ జలాలు, చెరువులు, కుంటల నీరే ఆధారమైంది. దీన్ని బట్టి చూస్తే నిరుటి సీనే రిపీటైనట్లు కనిపిస్తోంది. ప్రాజెక్టుల రీడిజైనింగ్ తో కోటి ఎకరాల ఆయకట్టుకు సాగునీటిని అందిస్తామని సీఎం కేసీఆర్ పలుమార్లు ప్రకటించారు. కానీ, గడిచిన ఆరేండ్లలో ప్రాజెక్టుల ద్వారా ఆయకట్టు ఎంత పెరిగిందనేది ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత వానాకాలంలో 41 లక్షల ఎకరాలకు ప్రాజెక్టుల ద్వారా నీళ్లిచ్చేందుకు ప్రిపేర్ చేసుకున్నట్లు డిపార్ట్ మెంట్ చెబుతోంది. ఈ స్థాయిలో ప్రిపేర్ చేయడం గడిచిన ఆరేండ్లలో ఇదే తొలిసారి అని ఆఫీసర్లు అంటున్నారు.
46 శాతం ఎక్కువగా వానలు
ఈ ఏడాది దంచికొట్టిన వానలతో పంటల విస్తీర్ణం పెరిగింది. జూన్ నుంచి ఇప్పటివరకు సాధారణం కంటే 46 శాతం ఎక్కువ వర్షాలు కురిశాయి. ఈ సీజన్లో 560.4 మి.మీ. సాధారణ వర్షాపాతం అంచనా వేయగా.. ఇప్పటికే 819 మి.మీ. నమోదైంది. 14 జిల్లాల్లో భారీగా వానలు కురవగా, 11 జిల్లాల్లో అధికంగా, 8 జిల్లాల్లో సాధారణ రెయిన్ ఫాల్ రికార్డయింది. దీంతో అన్ని జిల్లాల్లోనూ పంటలకు అనువైన వాతావరణం నెలకొనడం సాగుకు కలిసొచ్చింది. ఈ నెలలో గురువారం వరకు సాధారణ వర్షపాతం 187 మి.మీ కాగా.. 103 శాతం అదనంగా 379 మి.మీ వాన పడింది.
వానలతోనే రికార్డుసాగు
ఈ సీజన్లో వ్యవసాయ శాఖ వేసిన అంచనాలను మించి పంటలు సాగయ్యాయి. టార్గెట్ రేట్ 1.25 కోట్ల ఎకరాలు కాగా.. గురువారం నాటికి 1.26 కోట్ల ఎకరాల్లో పంటలు సాగులోకి వచ్చినట్లు ప్రభుత్వం లెక్కలేసింది. ఎక్కువగా 58.95 లక్షల ఎకరాల్లో పత్తి పంట వేశారు. 46.70 లక్షల ఎకరాల్లో వరి నాట్లేశారు. ఇంచుమించు రాష్ట్రమంతటా ఒకేతీరుగా సాగు విస్తీర్ణం పెరిగింది. అందుకే ప్రాజెక్టు నీళ్లతో సంబంధం లేకుండానే వర్షాలు, భూగర్భ జలాలపై రైతులు ఆధారపడ్డట్లు స్పష్టమవుతోంది. నిరుడు రాష్ట్రంలో ఒక కోటి 9 లక్షల ఎకరాల్లోసాగు నమోదైంది. గత ఏడాది కంటే ఇప్పుడు 17 లక్షల ఎకరాలు అదనంగా పంటలు వేశారు.
ఎస్సారెస్పీ కిందనే ఇంచుమించుగా సగం
ప్రాజెక్టుల కిందసాగులోకి వచ్చిన భూముల్లో ఎక్కువ శాతం శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకిందే ఉన్నాయి. ఎస్సారెస్పీ స్టేజీ–1, 2, సదర్మాట్, చౌట్పల్లి హన్మంతరెడ్డి, అలీసాగర్, గుత్ప లిఫ్ట్ స్కీంలు, ఐడీసీ స్కీములు కలిపి 16.21 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని ప్రతిపాదించారు. రాష్ట్రంలో మొత్తం ప్రాజెక్టుల కింద సాగయ్యే భూమిలో 45 శాతం ఒక్క ఎస్సారెస్పీ కిందనే ఉంది. ఇందులో మాత్రమే సగానికన్నా ఎక్కువగా వరి, చెరుకు పంటలు ప్రతిపాదించారు.
కృష్ణాలోనూ పాతప్రాజెక్టుల కిందే నీళ్లు
నాగార్జునసాగర్ ఎడమ కాలువ, ఏఎమ్మార్ ఎస్ఎల్బీసీ కింద 8.50 లక్షల ఎకరాలకు సాగు నీళ్లు అందుతుండగా.. జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, కల్వకుర్తి లిఫ్ట్ స్కీంలు, ఆర్డీఎస్ కింద ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 8 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని ప్రతిపాదించారు. ఇవన్నీ ఉమ్మడి ఏపీలోనే చేపట్టిన ప్రాజెక్టులే. తెలంగాణ ఆవిర్భావం తర్వాత కొన్నిపెండింగ్ పనులు చేపట్టి కొంత ఎక్కువ నీటిని తీసుకోవడం తప్ప కృష్ణానీళ్లలో రాష్ట్రవాటాను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు.
ప్రాజెక్టుల కింద ఆరుతడి పంటలే
ఆయకట్టుకు ఎప్పుడు నీరందుతుందో.. ఎప్పుడు ఆగిపోతుందో తెలియని గత అనుభవాలతో ఆయకట్టు రైతులు ఆరుతడి పంటల సాగుకే మొగ్గు చూపుతున్నారు. ఈ సారి ప్రాజెక్టుల కింద సాగు చేస్తున్న 41 లక్షల ఎకరాల్లో సగానికి పైగా ఆరుతడి పంటలే కావటం గమనార్హం. ఇవన్నీ వర్షాధార పంటలే. కేవలం 19.85 లక్షల ఎకరాల్లోనే వరి, చెరుకు సాగు చేస్తున్నారు . ఈ మొత్తం ఆయకట్టుకు 421.72 టీఎంసీల నీళ్లు అవసరమని ప్రభుత్వం లెక్కలేసింది. తెలంగాణ ఏర్పడిన ఆరేండ్ల తర్వాత కూడా ప్రాజెక్టుల కింద వరి, చెరుకులాంటి నీటి ఆధారిత పంటల సాగు విస్తీర్ణం పెరగ లేదు.
లెక్కల్లో లేని కాళేశ్వరం ఆయకట్టు
రూ. 1.14 లక్షల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు నీటి ద్వారానే రాష్ట్రంలో సాగు విస్తీర్ణం కోటి ఎకరాలు దాటినట్లు ప్రభుత్వం షో చేసుకుంటోంది. కానీ.. ఈ ఏడాదీ కాళేశ్వరంతో ప్రభుత్వం ఒక్క ఎకరం ఆయకట్టు నైనా ప్రతిపాదించలేదు. ఎగువన కురిసిన వర్షాలతో ఈసారి ఎస్సారెస్పీ కళకళలాడుతుండగా ఇటు ఎల్లంపల్లి దిగువన గోదావరి పోటెత్తింది.దీంతో కాళేశ్వరం నుంచి ఎల్లంపల్లి వరకు లిఫ్ట్ చేసిన 16 టీఎంసీల నీళ్లు మళ్లీ గేట్లు ఎత్తి గోదాట్లోకే వదిలేశారు. అరకోటి ఎకరాల భూమికి నీళ్లిస్తామని కడుతున్న ఈ ప్రాజెక్టుకు వరుసగా రెండో ఏడాది అదే పరిస్థితి. లింక్–1 నుంచి ఎల్లంపల్లికి నీళ్లను ఎత్తిపోయాలనే ఆరాటమే తప్ప అక్కడ ప్రతిపాదించిన 30 వేల ఎకరాలకు నీళ్లిచ్చే కాల్వల పనులు చేపట్టలేదు. లింక్–2లో ఎకరం కూడా ఆయకట్టు లేదు. లింక్–4లో కొండ పోచమ్మ వరకు నీటిని ఎత్తిపోసినా రిజర్వాయర్లు, చెరువులు నింపడం మినహా నీళ్లు ఇచ్చే డిస్ట్రిబ్యూటరీలు రెడీ కాలేదు. మల్లన్న సాగర్ నిర్మాణం కాక దానికింద ఆయకట్టుకు ఎప్పటికి నీళ్లొస్తాయో ప్రశ్నార్థకంగా మారింది.
For More News..