సామాజిక రిజర్వేషన్లు 50% మించరాదని సుప్రీంకోర్టు మరోసారి తీర్పు ఇచ్చింది. 102వ రాజ్యాంగ సవరణ ద్వారా 342ఏ ఆర్టికల్ ను సృష్టించడంతో రాష్ట్రాల హక్కులకు జరిగే భంగం మీద రాష్ట్రాల అభిప్రాయాలను కోరి రెండు నెలలు కాకముందే ఈ తీర్పు వెలువడింది. రాజ్యాంగ మౌలిక అంశాలపై, 80 శాతం ఉన్న రిజర్వుడు వర్గాలు బాధితులుగా ఉన్న అంశంపై, ఆ వర్గాల నుంచి ఒక న్యాయమూర్తి లేని బెంచ్ ద్వారా, కరోనా కల్లోల కారణంగా సమాజం ప్రతిస్పందించే అవకాశం లేని పరిస్థితుల్లో ఈ తీర్పు వచ్చింది. కానీ, సామాజిక రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని రాజ్యాంగంలోని ఏ క్లాజులో, ఏ ఆర్టికల్లో ఉంది. రాజ్యాంగంలో లేని పరిమితిని న్యాయవ్యవస్థ ఎట్లా విధిస్తుంది?
ఈడబ్ల్యూఎస్ కోటాకు ఎలా ఓకే చెప్పారు?
ఒకవైపు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల అమలుకు రాష్ట్రాలు పోటీపడుతుంటే.. ఆ 10 శాతం రిజర్వేషన్లను అనుమతించిన సుప్రీంకోర్టు.. 1992 నాటి ఇందిరా సాహ్నీ కేసులో ఇచ్చిన 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని 2021లో కూడా ధృవీకరిస్తూ తీర్పునివ్వడం ఎంత వరకు సమంజసం. 60 శాతం రిజర్వేషన్ల అమలుకు అనుమతించిన అత్యున్నత న్యాయస్థానం.. ఇప్పుడు 50 శాతం పరిమితిని విధిస్తూ తీర్పునివ్వడాన్ని ఏమనాలి? ఆర్టికల్ 340 ప్రకారం ఓబీసీలకు జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే అన్ని రకాల రిజర్వేషన్లు కల్పించే అవకాశం ఉన్నా 71 ఏండ్ల నుంచి 54% ఓబీసీ రిజర్వేషన్లు ఎందుకు అమలు కావడం లేదు. సామాజికంగా, విద్యా పరంగా వివక్షతను, వెనుకబాటుతనాన్ని రూపుమాపేందుకు ఏర్పడినవే రిజర్వేషన్లు అనే మౌలిక అంశాన్ని అత్యున్నత న్యాయస్థానం ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదు. 80 శాతానికిపైగా ఉన్న వర్గాల వారికి 50 శాతం రిజర్వేషన్లు పరిమితం చేసి, 6 నుంచి 7 శాతం ఉన్న వారికి 50 శాతం అవకాశాలు ఇవ్వటమే కాకుండా 10% ప్రత్యేక రిజర్వేషన్లు ఇవ్వటంలోని ఔచిత్యం ఎందుకు ప్రశ్నించడంలేదు.
బడుగులు అవకాశాలు పొందలేకపోతున్నరు
స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటి మూడు దశాబ్దాలు వ్యవస్థల్ని సంపూర్ణ బ్రాహ్మనాధిపత్యానికై కాంగ్రెస్ పార్టీ వాడుకుంది. 80వ దశకంలో సోషలిస్ట్ ఉద్యమ ప్రభావంతో బీపీ మండల్, నరేశ్ యాదవ్, జార్జ్ ఫెర్నాండెజ్ తదితరులు రాంమనోహర్ లోహియా నేతృత్వంలో సాగించిన సామాజిక ఉద్యమాల ప్రభావంతో విధి లేని పరిస్థితుల్లో ఓబీసీ రిజర్వేషన్ల అమలుకు అనుకూలత ఏర్పడింది. ఇది వీపీ సింగ్ హయాం వరకూ కొనసాగి.. మండల్ కమిషన్ సిఫార్సుల్లో కొన్ని ఆమోదం పొంది విద్యా, ఉద్యోగ అవకాశాల్లో 27శాతం కోటా దక్కింది. ఇది చూసి ఓర్వలేని బ్రాహ్మణ నాయకత్వం న్యాయ వ్వవస్థను చేజిక్కించుకోవటం కారణంగా 1992లో ఇందిరా సాహ్ని కేసు ద్వారా రాజ్యాంగంలో లేని 50% పరిమితిని రిజర్వేషన్లపై విధిస్తూ తీర్పు రావడం, గోబెల్స్ ప్రచారంలా దానికి అనుకూలంగా ప్రభుత్వాలు శిరోధార్యం అనటంతో మనువాద కుట్రకు ఆమోదం దొరికింది. ఇదే అదనుగా కొలిజియం ద్వారా న్యాయమూర్తుల నియామకమనే కొత్త విధానం న్యాయ వ్యవస్థల్లో బ్రాహ్మణాధిపత్యానికి, ఏకచ్ఛత్రాధిపత్యానికి రాచమర్గమైంది. అటు తర్వాత బ్రాహ్మణ కూటమి ఏకమై ఆర్థిక సంస్కరణల పేర రాజ్యాంగంలోని సోషలిస్టు ఆర్థిక విధానాన్ని అంతం చేసి, ఇందిరాగాంధీ ప్రమోట్ చేసిన మిశ్రమ ఆర్థిక వ్యవస్థను తొలిసారిగా తెరతీశారు. ఇదే నేటికీ కొనసాగుతోంది. సంస్కరణలు చేపట్టకపోతే దేశం దివాళా తీస్తుందని గోబెల్స్ ప్రచారం చేసి, ప్రజల్ని భయపెట్టి తమ విధానాలకు ఆమోదం పొందారు. తద్వారా ప్రభుత్వ ఉద్యోగాలు, ఉన్నత విద్యావకాశాలు బడుగులకు నామమాత్రమయ్యాయి.
కొంత మంది చేతుల్లోనే సంపద
బ్రాహ్మణ కూటమి కారణంగా మండల్ కమిషన్లోని ఇతర సిఫార్సులు, ఆర్టికల్ 340 ప్రకారం దామాషా ప్రకారం రావాల్సిన ఓబీసీ రిజర్వేషన్లు, రాష్ట్రాలు తమ పరిధిలో ఇవ్వాల్సిన బీసీ/ఓబీసీ రిజర్వేషన్లపై ఈ 50 శాతం పరిమితి అంకుశంగా మారింది. ప్రైవేటైజేషన్ విధానానికి అనుకూలంగా వచ్చిన గెజిట్ కారణంగా ప్రభావిత రంగాలన్నీ అగ్రకులాధిపత్యంలోకి వెళ్లి బడుగు బలహీన వర్గాలన్నీ 1947కు ముందున్న విధంగా వారి చేతిలో బందీలయ్యే వాతావరణం ఏర్పడింది. 1992 నుంచే ఆర్థిక అంతరాలు పెరిగే మార్గం ద్వారా నేడు సంపద 2 శాతం మంది వద్ద కేంద్రీకృతమై రాజ్యాంగ లక్ష్యాలను అటకెక్కించాయి. సంపద మొత్తం అదానీ, అంబానీ వంటి కొంత మందికే పరిమితం చేసే విధాన ఫలాలు పొందుతున్నారు. బడుగులు హక్కుగా పొందాల్సిన అవకాశాలు మళ్లీ యాచించే స్థితికి తీసుకొచ్చారు. అలాగే 70 ఏండ్లలో ఎస్టీ ప్రాతినిథ్యం లేకుండా ఓబీసీ, ఎస్సీల ప్రాతినిధ్యం 2 శాతం లోపే ఉన్న సుప్రీంకోర్టు న్యాయమూర్తుల వ్యవస్థను సమీక్షించాలి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 12, 124, 229 ప్రకారం హైకోర్టు, సుప్రీంకోర్టుల్లో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల పూర్థి స్థాయి రిజర్వేషన్లతో న్యాయమూర్తుల నియామకం చేపట్టాలి. ఆర్టికల్ 312(1), 42వ రాజ్యాంగ సవరణ 1976 ప్రకారం ఆలిండియా జ్యుడిషియల్ సర్వీస్, జ్యుడిషియల్ కమిషన్ వేసి హైకోర్టు, సుప్రీంకోర్టుల న్యాయమూర్తుల భర్తీకై పోటీ పరీక్షలు నిర్వహించాలి.
ఎర్ర సత్యనారాయణ.
తెలంగాణ బీసీ సంఘం అధ్యక్షుడు