పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని నిందించడం, అందులో తమ పాత్ర ఏమీ లేదన్నట్లు వ్యవహరిస్తుండటం తెలంగాణ మంత్రులకు, అధికార పక్ష నేతలకు పరిపాటిగా మారింది. కేంద్ర ప్రభుత్వంపై బురద చల్లడం ద్వారా తమ పాలనపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని దృష్టి మళ్లించే ప్రయత్నంగానే దీన్ని భావించాలి. దేశంలో పెట్రోల్ ధరలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. బీజేపీ పాలిత మరే రాష్ట్రంలోనూ ఇంత ఎక్కువ ధరలు లేవు. కేంద్రం రెండు సార్లు ఎక్సైజ్ సుంకాలను తగ్గించింది. పలు రాష్ట్రాలూ తాము విధించే పన్నులను తగ్గించాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం ఏమాత్రం తగ్గించలేదు. వ్యాట్ పేరుతో లీటర్ కు రూ.35 మేరకు వసూలు చేస్తోంది. ఇంధన ధరల పెరుగుదలతో పరోక్షంగా టీఆర్ఎస్ప్రభుత్వానికే మేలు జరుగుతోంది. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలి.
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల లీటర్ పెట్రోలుపై రూ.5, డీజిల్ పై రూ.10 వరకు ఎక్సైజ్ సుంకాలను తగ్గించింది. కేంద్ర నిర్ణయాన్ని స్వాగతిస్తూ 18 రాష్ట్రాలు వ్యాట్‌నూ తగ్గించాయి. ఫలితంగా ఆయా రాష్ట్రాల్లో ఒక్కో లీటర్ పెట్రోలు, డీజిల్ పై రూ.10 నుంచి రూ. 20 దాకా తగ్గి సామాన్యులకు కొంతలో కొంత ఊరట కలిగింది. కానీ ఒక్క నయాపైసా కూడా తగ్గించని రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి కావడం గమనార్హం. పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే ప్రతి పైసాలో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే పన్నుల వాటా కూడా పెరుగుతుందని గమనించాలి. అంటే పన్నులు పెంచకపోయినా, వారి ఆదాయం పెరుగుతున్న ధరలతో పాటే పెరుగుతూ వస్తోంది.
క్రూడాయిల్ ధరలు పెరిగినప్పుడల్లా..
పెట్రోలు, డీజిల్ పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ రూపంలో పన్నులు వసూలు చేస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 4 శాతం మేరకు వ్యాట్ ను పెంచారు. దీంతో పెట్రోలు, డీజిల్ ధర పెరిగినప్పుడల్లా రాష్ట్రానికి వచ్చే వ్యాట్ ఆదాయం అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్‌ను మినహాయించుకుంటే లీటర్ పెట్రోలు ధర రూ.100 లోపే ప్రజలకు అందే అవకాశం ఉంటుంది. 2003 వాజ్ పేయి హయాంలో లీటర్ పెట్రోలు ధర 35 రూపాయలు. కాంగ్రెస్ పదేండ్ల పాలనలో పెట్రోలు ధర రూ.40 పెరిగింది. 2014లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దిగిపోయే నాటికి పెట్రోలు ధర రూ.75. పెట్రో ఉత్పత్తులను ప్రాసెసింగ్ చేశాక మిగిలిన కెమికల్స్‌కు పదేండ్ల క్రితం వరకు అంతర్జాతీయంగా విపరీతమైన డిమాండ్ ఉండేది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధర పెరిగినా వీటి ద్వారా వచ్చే ఆదాయంతో లోటును పూడ్చుకునే వారు. ప్రస్తుతం పెద్దగా డిమాండ్ లేక వీటి ద్వారా ఆదాయం లేకపోవడంతో క్రూడాయిల్ ధరలు పెరిగినప్పుడల్లా పెట్రోలు, డీజిల్ ధరలూ పెరుగుతున్నాయి.
ఏ రాష్ట్రాల్లో ఎలాంటి ధరలు?
దేశం మొత్తం మీద తెలంగాణ కన్నా పెట్రోల్ ధర ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు మూడే. అవి మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్ కావడం గమనార్హం. ఉదాహరణకు ఏప్రిల్ 20న తెలంగాణాలో లీటర్ పెట్రోల్ ధర రూ.118.59గా ఉండగా, మహారాష్ట్రలో రూ. 123.47, ఆంధ్ర ప్రదేశ్ లో రూ.121.63, రాజస్థాన్ లో రూ.121.06, కేరళ లో రూ.116.92, పశ్చిమ బెంగాల్ లో రూ.115.12, పంజాబ్ లో రూ.105.46, ఢిల్లీలో రూ. 105.41, ఒడిశాలో రూ.112.05, చత్తీస్ గడ్ లో రూ.111.45గా ఉన్నాయి. ఇవేవీ బీజేపీ, లేదా దాని మిత్రపక్షాల పాలిత రాష్ట్రాలు కాకపోవడం గమనార్హం. బీజేపీ లేదా ఎన్డీయే అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ధరలు చూస్తే.. ఒక్క మధ్య ప్రదేశ్‌లో అత్యదికంగా రూ.118 ఉంది. ఆ మొత్తం కూడా తెలంగాణ కంటే తక్కువే కావడం గమనార్హం. బీజేపీ పాలిత రాష్ట్రాలతో పోల్చుకుంటే చాలా రాష్ట్రాల్లో తెలంగాణలో కన్నా రూ.10 నుంచి రూ.12 వరకు తక్కువగా ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది. తెలంగాణాలో ధరలు ఎందుకు అంత ఎక్కువగా ఉన్నాయి? రాష్ట్ర మంత్రులు ఎవరైనా సమాధానం చెప్పగలరా? వ్యాట్ పేరుతో కేసీఆర్ ప్రభుత్వం లీటర్ కు రూ.35 మేరకు వసూలు చేస్తున్న పన్నుల్లో ఏమాత్రం తగ్గించినా ప్రజలకు మేలు జరుగుతుంది.
ప్రజలు టీఆర్ఎస్కు బుద్ధి చెప్పాలె
ధాన్యం కొనుగోలు విషయంలో తన బాధ్యతను విస్మరించి పంజాబ్ తరహా విధానాన్ని అమలు చేయాలంటూ వితండవాదం చేసిన రాష్ట్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ విషయంలో పంజాబ్ రాష్ట్రాన్ని ఎందుకు అనుసరించడం లేదో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు సమాధానం చెప్పాలి.? పంజాబ్ లో తెలంగాణకన్నా పెట్రోల్ లీటర్ కు రూ.13 మేరకు తక్కువగా విక్రయిస్తున్నారు. పెట్రోల్ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకు వస్తే వాటి ధరలు తగ్గుతాయని కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ప్రతిపాదన తీసుకొస్తే తీవ్రంగా వ్యతిరేకించిన రాష్ట్ర ప్రభుత్వాల్లో తెలంగాణ ఒకటనేది గమనార్హం. తెలంగాణ ప్రజలు వాస్తవాలను అర్థం చేసుకొని, టీఆర్‌ఎస్ నేతలకు తగిన బుద్ధి చెప్పాలి.
రాష్ట్రాలకే మేలు జరుగుతోంది
మొత్తం ధరల్లో 40 శాతం వరకు ‘ప్రాథమిక ధర’ అంటే పెట్రోల్ ఉత్పత్తి చేసే కంపెనీలకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తంలో కేంద్రం తగ్గించగలిగింది ఏమీ లేదు. మిగిలిన 60 శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించే పన్నులు. దేశంలో అత్యధికంగా పన్నులు విధించే రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి కావడం గమనార్హం. కేంద్రం విధించే పన్నుల్లో తిరిగి అందులో 42 శాతం మేరకు ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్రాల వాటాగా కేంద్రం రాష్ట్రాలకు చెల్లిస్తోంది. అంటే మొత్తం ధరల్లో కేంద్రంకు సుమారు 17 శాతం మాత్రమే వస్తుండగా, రాష్ట్రాలకు 43 నుంచి 49 శాతం వరకు వస్తున్నది. మొత్తం పెట్రోల్ పన్నుల్లో సింహభాగం రాష్ట్రాల ఖజానాకు వెళుతున్నది. ఈ వాస్తవం తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావుకు తెలియదా? తెలిసి కూడా నిరసనలు చేయడం సరికాదు.
- బండి సంజయ్ కుమార్, ఎంపీ, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, బీజేపీ