- వరదలతో కొండాయి దగ్గర జంపన్న వాగుపై కూలిన బ్రిడ్జి
- నిర్మాణం ఊసెత్తని గత బీఆర్ఎస్సర్కారు
- జాతరకు ఇంకా రెండు నెలలే సమయం
- ఆలోగా కొత్త బ్రిడ్జి నిర్మాణంపై అనుమానాలు
జయశంకర్ భూపాలపల్లి, వెలుగు : మేడారం మహాజాతరకు వచ్చే భక్తుల కోసం జంపన్నవాగుపై కట్టిన వంతెన ఈ ఏడాది జులైలో వచ్చిన భారీ వరదలకు కూలిపోయింది. బ్రిడ్జిని యుద్ధ ప్రాతిపదికన నిర్మించాల్సి ఉన్నా గత బీఆర్ఎస్ సర్కారు పట్టించుకోలేదు. ఈలోగా ఎన్నికలు రావడంతో బ్రిడ్జి విషయం మరుగునపడింది. తాజాగా మరో రెండు నెలల్లో మేడారం మహాజాతర మొదలుకాబోతోంది. దీంతో ఛత్తీస్ గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచ్చే సుమారు 20 లక్షల భక్తుల కోసం కొత్త రూట్ వెతకాల్సిన పరిస్థితి నెలకొంది. తాజా సర్కారు రాబోయే మహాజాతర కోసం రూ.75 కోట్ల నిధులు కేటాయించింది. ఇవి పాత ప్రతిపాదనలే. దీంట్లో కొండాయి బ్రిడ్జి గురించిన ప్రస్తావన లేదు. ఈ క్రమంలో జంపన్న వాగుపై కొత్త బ్రిడ్జి నిర్మాణం ప్రారంభిస్తారా? ప్రారంభించినా మహాజాతర నాటికి పూర్తిచేస్తారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాధారణంగా మేడారం మహాజాతరకు కోటి మంది భక్తులు వస్తారు. ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ జాతరకు వచ్చే భక్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నాలుగు రూట్లను ఏర్పాటు చేస్తోంది. ఇందులో ఏటూరునాగారం‒చిన్నబోయినపల్లి రూట్ అతి ముఖ్యమైనది. ఛత్తీస్ గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల నుంచి ప్రైవేట్ వెహికల్స్‌లో వచ్చే సుమారు 20 లక్షల మంది భక్తులు ఈ రూట్‌లో మేడారం చేరుకుంటారు. తిరిగి వెళ్లిపోవడానికి కూడా ఇదే రూట్ వాడుతారు. అయితే ఈ రూట్‌లో కొండాయి‒ఊరట్టం గ్రామాల మధ్య జంప్నవాగుపై కట్టిన బ్రిడ్జి జులై 27న వచ్చిన భారీ వరదలకు కొట్టుకుపోయింది. ఖాళీ పిల్లర్లు మాత్రమే కన్పిస్తున్నాయి. ములుగు జిల్లాలోని ఐటీడీఏ ఆఫీసర్లు రూ.25 లక్షలు ఖర్చు చేసి తాత్కాలికంగా మట్టి రోడ్డు వేశారు. ఈ నెలలో కురిసిన అకాల వర్షాలకు ఆ మట్టి రోడ్డు కూడా కొట్టుకుపోయింది.
ఇబ్బంది రాకుండా చూసుకోవాలని కలెక్టర్ ఆదేశం
మేడారం వచ్చే భక్తుల కోసం కేటాయించిన మూడు రూట్లలో పెద్దగా సమస్యలు ఏమీ లేవని ఆఫీసర్లు చెబుతున్నారు. చిన్నచిన్న రిపేర్లు చేసి ఈ రూట్లను క్లియర్ చేయవచ్చని అంటున్నారు. కానీ ఛత్తీస్ గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చే చిన్నబోయినపల్లి‒మేడారం రూట్ గురించే వారంతా ఆందోళన పడుతున్నారు. గతంలో కట్టిన బ్రిడ్జి కూలిపోవడం, తాత్కాలిక మట్టి రోడ్డు కూడా కొట్టుకుపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇటీవలే కురిసిన అకాల వర్షాల వల్ల కొండాయి దగ్గర జంపన్న వాగుపై కొట్టుకుపోయిన తాత్కాలిక మట్టి రోడ్డును ములుగు జిల్లా కలెక్టర్ త్రిపాఠి పరిశీలించారు. మహాజాతర సమీపిస్తుండడంతో భక్తులకు ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆమె ఆదేశించారు.
బ్రిడ్జి కడతారా.. రూట్ మారుస్తారా?
మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు ఛత్తీస్ గఢ్, ఒడిశా రాష్ట్రాల నుంచి ఆదివాసీలు భారీ సంఖ్యలో హాజరవుతారు. తమ పిల్లలను వెంట తీసుకొని వచ్చి నాలుగు రోజుల పాటు మేడారంలోనే ఉండి అమ్మవార్లను పూజిస్తారు. ఈ భక్తులంతా కూడా వచ్చేది చిన్నబోయినపల్లి‒మేడారం రూట్ లోనే. భారీ వరదల వల్ల కొండాయి దగ్గర బ్రిడ్జి కూలిపోయిన నేపథ్యంలో ఆదివాసీ భక్తుల కోసం సరైన రూట్ ఏర్పాటు చేయకపోతే వారంతా ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. కూలిపోయిన వంతెన దగ్గర తాత్కాలికంగా మట్టి రోడ్డు వేయాలని చూస్తున్నారు. ఒకవేళ అకాల వర్షాలు కురిసి ఆ రోడ్డు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జాతర సమయం నాటికి కొండాయి దగ్గర కొత్తగా బ్రిడ్జి అయినా నిర్మించాలి. లేదా రూట్ అయినా మార్చాలని ఆఫీసర్లు ప్లాన్ చేస్తున్నారు. మహాజాతర ఏర్పాట్లపై రాష్ట్ర మంత్రుల సమీక్ష నాటికి దీనిపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఐటీడీఏకు చెందిన ఓ ఇంజినీర్ తెలిపారు.