విశ్లేషణ: ప్రభుత్వ పథకాల్లో పారదర్శకత ఏది?

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి 2018 అక్టోబర్ మధ్య కాలంలో పథకాల ప్రకటనల కోసం ప్రభుత్వం ఏకంగా రూ. 310 కోట్లు ఖర్చు చేసినట్లు ‘సొసైటీ ఫర్ సేఫ్టీ ఆఫ్ పబ్లిక్ అండ్ గుడ్ గవర్నెన్స్’ సమాచార హక్కు చట్టం ద్వారా బయటపెట్టింది. పేదల కోసం అద్భుత పథకం తీసుకొచ్చామని ప్రకటనల ద్వారా చెబుతున్న నాయకులు వాటి అమలు తీరును పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో రైతుబంధు, రైతు బీమా లబ్ధిదారుల వివరాల ఆధారంగా కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్​యోజన పథకం అమలు చేస్తోంది. అయితే ఈ పథకం కింద ఇప్పటి వరకు మొత్తం ఏడు విడతల్లో 53.52 కోట్ల ప్రజా ధనం దారి తప్పినట్లు ఇటీవల కేంద్ర బృందం పేర్కొంది. ప్రతి జిల్లాకు రెండు మండలాల చొప్పున మొత్తం పది జిల్లాల పరిధిలోని ఇరవై మండలాల్లోని లబ్ధిదారులను ర్యాండమ్ గా ఎంపిక చేసి ఆడిట్ నిర్వహించగా 78,314 మంది అనర్హులతో పాటు ఆదాయపు పన్ను చెల్లించే 32,409 మంది సైతం ఈ పథకం ద్వారా లబ్ధిపొందినట్టు తేలింది. పథకం అమలులో పారదర్శకత లోపించినందునే ఇలా నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. 

ప్రజాధనం వృథా..
సంక్షేమ పథకాల అమలుకు ఏటా వేలాది కోట్ల ప్రజాధనం ఖర్చవుతోంది. ఈ సొమ్మంతా ప్రజలు వివిధ రకాల పన్నుల రూపంలో కట్టిందే. 2014–2015 నుంచి 2021–2022 వరకు ఏడు రాష్ట్ర వార్షిక బడ్జెట్లలో సంక్షేమ పథకాల కోసం మొత్తం 3 లక్షల 94 వేల 517 కోట్ల రూపాయలు కేటాయించారు. సంక్షేమ పథకాల ముఖ్య ఉద్దేశం,లక్ష్యం కష్టాల్లో ఉన్న, తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్టలు, ఉండడానికి ఇల్లు లేని అభాగ్యులను ఆదుకోవడం. కానీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు లాంటి పథకాల్లో అనర్హులకు కూడా డబ్బులు అందుతున్నాయి. దీంతో ప్రజాధనం వృథా అవుతోంది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల పేరుతో పేదింటి ఆడబిడ్డ పెండ్లికి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది. ఈ పథకానికి 2020-–2021 బడ్జెట్ లో రూ.1,350 కోట్లు, 2021–-2022 బడ్జెట్​లో రూ. 2,750 కోట్లు, ప్రస్తుత ఆర్థిక బడ్జెట్​లో రూ. 2,750 కోట్లు కేటాయించింది. అయితే లగ్గమై ఏడాదిన్నర దాటినా లబ్ధిదారులకు సాయం అందడం లేదు. 2021 నవంబర్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 1,11,171 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి.  

డబుల్​ ఇండ్లదీ అదే పరిస్థితి..
పేదోడు సొంతింటి కల నెరవేర్చడంలోనూ ప్రభుత్వం చిత్త శుద్ధితో వ్యవహరించడం లేదు. 2016లో ఈ పథకం తీసుకొస్తే.. 2018 నాటికి ప్రభుత్వం రూ.22 వేల కోట్లు కేటాయించింది. నిరుడు బడ్జెట్​లో రూ.11,917 కోట్లు, ఈసారి రూ.12 వేల కోట్లు ప్రకటించింది. అయినా డబుల్​బెడ్​ రూం ఇండ్లు అందుకున్న పేదలు సంఖ్య వేలల్లోనే ఉంది. మరో వైపు కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద 2014  నుంచి 2021 వరకు 1,58,642 కోట్ల రూపాయలు, 2022-–2023 తాజా కేంద్ర బడ్జెట్​లో రూ. 48 వేల కోట్లు కేటాయించింది. ప్రభుత్వాలు బడ్జెట్​లో ఇంత పెద్ద మొత్తంలో నిధులు కేటాయిస్తున్నా.. రాష్ట్రంలో గ్రామానికో ఇల్లు కూడా మంజూరు కాలేదు. అభివృద్ధి కేవలం ప్రభుత్వ గణాంకాల్లో మాత్రమే కనిపిస్తోంది. కొత్త సెక్రటేరియట్ నిర్మాణంపై ఉన్న చిత్తశుద్ధి పూరి గుడిసెలో ఉండే నిరు పేదలకు ఇల్లు కల్పించడంపై లేకపోవడం చాలా బాధాకరం. 2017 జూన్ 2న ప్రవేశపెట్టిన కేసీఆర్ కిట్ పథకం  అమలు కోసం ప్రతి బడ్జెట్​లో రూ. 500 కోట్లు కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవం జరిగి బాబు పుడితే రూ.12 వేలు, పాప పుడితే రూ.13 వేలు నాలుగు విడతల్లో ప్రభుత్వం లబ్ధిదారులకు ఇస్తామని హామీ ఇచ్చింది. అయితే మొదటి విడత డబ్బులతో పాటు కేసీఆర్ కిట్ ఇస్తున్న అధికారులు మిగతా మూడు విడతల్లో ఇవ్వాల్సిన మొత్తం అందజేయడం లేదు. ఆసరా పింఛన్లలోనూ అదే పరిస్థితి. కొత్త పింఛన్ల మంజూరు కోసం అర్హులు ఏండ్లుగా ఎదురు చూస్తున్నారు. వివిధ స్థాయిల్లో ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న అనేక మంది తెల్ల రేషన్ కార్డు ద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్నా.. ప్రభుత్వం అలాంటి వారిని నియంత్రించడంలో విఫలమైంది. 

ఎంపిక బాధ్యత ఎమ్మెల్యేలకా?
డబుల్ బెడ్ రూం ఇండ్లు, కార్పొరేషన్ రుణాలు, సబ్సిడీ పై ప్రభుత్వం ఇచ్చే వ్యవసాయ యంత్ర పరికరాలు, ట్రాక్టర్లు, కల్యాణలక్ష్మి, షాది ముబారక్, దళిత బంధు తదితర ప్రభుత్వ పథకాలకు అర్హులను ఎంపిక చేసే బాధ్యతలను ఎమ్మెల్యేలకు అప్పజెప్పడం సరికాదు. ఎమ్మెల్యేల అనుచరులు, ఆ పార్టీ కార్యకర్తలను కాదని క్షేత్ర స్థాయిలో ఉండే సామాన్య, పేద, మధ్య తరగతికి చెందిన అర్హులకు పథకాలు చేరే పరిస్థితి ఉండదు. దీనిపై ప్రభుత్వం మరోసారి ఆలోచన చేసి పథకాలకు అర్హులను గుర్తించే బాధ్యత అధికారులకు ఇవ్వాలి.

పథకాల అమలుకు వ్యవస్థ ఉండాలె..
ఎంత గొప్ప లక్ష్యంతో ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతున్నా.. వాటి అమలు తీరు సరిగా లేక పూర్తి స్థాయిలో పేదలకు అందడం లేదు. ఒక్కో సంక్షేమ పథకాన్ని ఒక్కో శాఖకు అమలు చేసే బాధ్యతలను అప్పజెప్పి ఆయా శాఖల ఉద్యోగులకు అదనపు పని భారం పెంచేకంటే ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించాలి. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖలో కొత్తగా విస్తరణ అధికారి పోస్టులను మంజూరు చేసినట్లే..  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను పారదర్శకంగా అమలు చేసేందుకు  సమాజ శాస్త్రం చదివిన వారితో మండల స్థాయిలో  మండల సామాజిక అధికారి, గ్రామ సామాజిక అధికారి పోస్టులను మంజూరు చేయాలి. 

ఇందుకోసం ప్రత్యేకంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తే లబ్ధిదారులకు మేలు జరుగుతుంది. అనేక పోరాటాలతో సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు వీలైనన్ని ఉద్యోగ అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ కనీస బాధ్యత కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. 
ప్రతి అయిదేండ్లకోసారి ప్రభుత్వాలు మారుతున్నట్లే సంక్షేమ పథకాల పేర్లు మారుతున్నయి తప్ప పేదల బతుకులు మారడం లేదు. వేల కోట్ల నిధులతో కొత్త పథకాలు వస్తున్నా అమలు తీరు సక్కగ లేక పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు చేరడం లేదు. ప్రభుత్వాల నుంచి ఏదైనా సాయం పొందవచ్చని ఆశగా ఎదురుచూస్తున్న పేద ప్రజలకు ఎలాంటి ప్రయోజనం దక్కడం లేదు. ప్రతి సంక్షేమ పథకం అమలులో పారదర్శకత లోపించి ఎన్నో కొన్ని నిధులు దుర్వినియోగం అవుతూనే ఉన్నాయి. ఈ తీరు మారాలంటే ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు కోసం ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

సబ్​ ప్లాన్ ​నిధుల ఖర్చేది?
తెలంగాణ ప్రభుత్వం గత ఎనిమిది బడ్జెట్లలో ఎస్సీ సబ్ ప్లాన్ కోసం రూ. 1,17,319 కోట్లు, ఎస్టీ సబ్ ప్లాన్ కోసం రూ. 62,867 కోట్లు కేటాయించింది. కాగా అందులో షెడ్యూల్డ్ కులాల కోసం రూ. 66,398 కోట్లు, షెడ్యూల్డ్ తెగల కోసం రూ. 33,324 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. కేటాయించిన మొత్తం నిధుల్లో కనీసం 50 శాతం కూడా ఖర్చు చేయకుండా ఇతర శాఖలకు దారి మళ్లిస్తుండటం దారుణం. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టం కింద కేటాయించిన నిధులను ఆయా వర్గాల అభివృద్ధికే ఖర్చు చేయని రాష్ట్ర ప్రభుత్వం రాబోయే నాలుగైదు ఏండ్లలో ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇస్తామని చెప్పడం వెనక అనేక అనుమానాలు వస్తున్నాయి.
- మాణిక్​ డోంగ్రే, సోషియాలజిస్ట్