లీగ్ దశలో తొమ్మిదికి తొమ్మిది విజయాలు. నాకౌట్‌లో తడబడే ముద్రను చెరిపేసుకుంటూ సెమీఫైనల్లో బలమైన న్యూజిలాండ్‌పై గ్రాండ్ విక్టరీ. ఇంత జోరు చూపి.. మూడో కప్పుపై ఆశలు రేపిన టీమిండియా ఫైనల్లో ఇలా నిరాశ పరుస్తుందని ఎవ్వరూ ఊహించలేదు. టోర్నీ అసాంతం అద్భుతంగా ఆడిన రోహిత్‌సేన ఆఖరాటలో ఎక్కడ తప్పటడుగు వేసింది? అసలు తప్పెక్కడ జరిగింది? అంటే చాలానే ఉన్నాయి. ముందుగా స్లో వికెట్‌పై అత్యంత కీలకమైన టాస్ రూపంలోనే టీమ్‌కు తొలి దెబ్బ తగిలింది. పిచ్‌ను పక్కాగా చదివేసిన ఆసీస్ కెప్టెన్ కమిన్స్ టాస్ నెగ్గగానే బౌలింగ్ ఎంచుకొని సరైన నిర్ణయం తీసుకున్నాడు. తాను కూడా బ్యాటింగ్‌కు మొగ్గు చూపే వాడినని చెప్పిన రోహిత్ ప్రత్యర్థి ముందు భారీ స్కోరు ఉంచలేకపోయాడు.
ఓపెనర్‌గా మాత్రం మరోసారి ఇండియాకు మంచి ఆరంభం ఇచ్చాడు. కానీ, ఈ స్టేడియంపై మంచి పట్టున్న గిల్ అనవసర షాట్‌తో వికెట్ పారేసుకోడం తొలి తప్పు. ఈ టోర్నీలో నిర్భయంగా ఆడుతున్న రోహిత్ ఫైనల్లోనూ అదే టెంపో కొనసాగించినప్పటికీ తను ఇంకా కొన్ని ఓవర్లు క్రీజులో ఉండాల్సింది. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో వరుసగా 6, 4 కొట్టిప్పటికీ మరో షాట్‌కు ట్రై చేయడం.. అది సరిగ్గా కనెక్ట్ కాకపోవడం ఇంకో దెబ్బ. మరో మూడు బాల్స్‌లో ముగిసే పవర్ ప్లేను సద్వినియోగం చేసుకోవాలని అతను చేసిన సాహసం దెబ్బ తీసింది.
ఓపెనర్లతో పాటు ఫామ్‌లో ఉన్న శ్రేయస్ ఔటైన తర్వాత మిడిల్ ఓవర్లలో ఇండియా డీలా పడింది. కోహ్లీ, రాహుల్ క్రీజులో కుదురుకున్నప్పటికీ రన్‌రేట్ మెయింటేన్ చేయలేకపోయారు. ఈ ఇద్దరి మధ్య భారీ భాగస్వామ్యం ఉండి ఉంటే ఇండియా మంచి స్కోరు చేసేది. ఛేజింగ్‌లో లబుషేన్అద్భుత డిఫెన్స్‌లో ఇండియా బౌలర్ల ఓపికను పరీక్షించాడు. అతని సపోర్ట్‌తో స్వేచ్ఛగా షాట్లు ఆడిన ట్రావిస్ హెడ్ బౌలర్లను డిఫెన్స్‌లో పడేశాడు.
ఈ ఇద్దరిలా మిడిల్ ఓవర్లలో ఇండియా జోరూ చూపలేకపోయింది. తొలి పది ఓవర్లలో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 8 రన్‌రేట్‌తో రన్స్ రాబట్టిన ఇండియా 11–30 ఓవర్ల మధ్యలో ఒకే ఒక్క ఫోర్ కొట్టింది. దాంతో రన్ రేట్ 3.6కి పడిపోయింది. తొలి 30 ఓవర్లలో ఇండియా ఇన్నింగ్స్‌లో 78 డాట్ బాల్స్ ఉన్నాయి. ఆసీస్ ఇన్నింగ్స్‌లో 97 డాట్ బాల్స్ ఉన్నప్పటికీ హెడ్ క్రమం తప్పకుండా ఫోర్లు కొడుతూ రన్‌రేట్ మెయింటేన్ చేశాడు. లోయర్ ఆర్డర్‌లో బాగా ఆడి జట్టుకు మంచి స్కోరు అందించాల్సిన సూర్యకుమార్, జడేజా తమ లైఫ్‌లో అతి పెద్ద మ్యాచ్‌లో నిరాశ పరిచారు.
ఇక ఛేజింగ్‌లో కొత్త బాల్‌తో షమీ, బుమ్రా మంచి ఆరంభం ఇచ్చినా స్పిన్నర్లు, థర్డ్ పేసర్ సిరాజ్ నుంచి వారికి సపోర్ట్ రాలేదు. అలాగే బుమ్రా, షమీతో వరుసగా ఐదేసి ఓవర్లు వేయించిన కెప్టెన్ రోహిత్ 17వ ఓవర్ వరకూ సిరాజ్‌ను బరిలోకి దింపక తప్పు చేశాడు.. అప్పటికే క్రీజులో కుదురుకున్న లబుషేన్, హెడ్ స్పిన్నర్లతో పాటు సిరాజ్‌ను పక్కాగా ఎదుర్కోవడంతో ఆసీస్ ఎక్కడా తగ్గలేదు.
ఇండియా టీమ్‌లో ఆరో బౌలర్(పార్ట్ టైమర్) లేని స్పష్టంగా లోటు కనిపించింది. ఆసీస్‌లో ముగ్గురు పార్ట్‌టైమర్స్ 10 ఓవర్లు వేసి 44 రన్సే ఇచ్చి కీలకమైన రోహిత్ వికెట్ పడగొట్టారు. మరోవైపు రాత్రి పూట మంచు కారణంగా బౌలర్లకు బంతిపై పట్టు తప్పగా.. పిచ్ క్రమంగా బ్యాటర్లకు సపోర్ట్ ఇవ్వడమూ ఇండియాను దెబ్బతీసింది. ఇక ఫీల్డింగ్‌లో ఆసీస్ ఎప్పట్లానే ది బెస్ట్ అనిపించుకుంది. సర్కిల్ లోపల, బయట ఖతర్నాక్ ఫీల్డింగ్‌తో కనీసం 20–30 రన్స్ నియంత్రించింది.
మ్యాచ్‌లో అదే కీలకం అయింది. ఇండియా ఫీల్డింగ్ బాగానే ఉన్నా కాపాడుకునే స్కోరు లేకపోవడమే అతి పెద్ద లోటు అయింది. మొత్తంగా ఈ ఓటమి టీమిండియాకు ఓ పాఠం కానుంది. టోర్నీలో ఎంతబాగా ఆడినా ఆఖరాటలో ఏ చిన్న అవకాశాన్ని చేజార్చుకోవద్దని తెలుసుకోవాలి. మెగా మ్యాచ్‌ల్లో ఎలా ఆడాలో ఆస్ట్రేలియాను చూసి నేర్చుకోవాలి.
మనది కాని రోజు
ఒక్క రోజు చాలు (ఇట్ టేక్స్ వన్డే) అన్నది ఈ వరల్డ్ కప్ ట్యాగ్‌లైన్. దురదృష్టవశాత్తూ తమ జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు ఇండియా క్రికెటర్లది కాకుండా పోయింది. కానీ, ఈ టోర్నీలో ఇండియా ఎన్నో రోజులు అద్భుతంగా ఆడింది. ఇదే జట్టు వరుస విజయాలతో అభిమానులను, ప్రజలను ఎంతగానో అలరించింది. ఫైనల్లో టీమిండియా ఆట నిరాశపరిచినా.. ఈ కష్ట సమయంలో మన క్రికెటర్లకు అందరం మద్దతుగా నిలవాలి. వరుసగా పది మ్యాచ్‌ల్లో తిరుగులేని విజయాలు సాధించి ఫైనల్‌కు వచ్చిన వారి పోరాటాన్ని గుర్తించి గౌరవించాలి.