చింతన్​ శిబిర్ నిర్ణయం చింత తీర్చిందా?

కాంగ్రెస్ పార్టీ అత్యున్నత స్థాయిలో ఇవ్వజూపిన హోదాను రాజకీయ/ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (పీకే) ఎందుకు నిరాకరించాడో... ఒక ‘చింతన్ శిబిర్’ ముగిస్తే గాని లోకానికి అర్థం కాలేదు. ఉదయ్​పూర్​లో మూడు రోజుల పాటు జరిగిన పార్టీ మేధోమధన సదస్సు తర్వాత ‘కాంగ్రెస్​ది సరికొత్త ఉదయం’ అని పార్టీ అధినేత్రి సోనియాగాంధీ స్వయంగా ప్రకటించినా, అంతటి స్పందన దేశ వ్యాప్తంగా వ్యక్తం కాలేదు. ముఖ్యంగా సామాన్య జనావళి నుంచి పార్టీ ఆశించిన స్థాయి ప్రతిస్పందన లేదు. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా, ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పునర్వైభవాన్ని అభిలషిస్తున్న వారు ఈ దేశంలో పెద్ద సంఖ్యలోనే ఉంటారు. నిస్తేజంగా ఉన్న పార్టీ శ్రేణుల్లో సదస్సు కొంత ఉత్సాహం నింపినా, పూర్తిస్థాయి సంతృప్తి వారిలోనూ వ్యక్తం కావటం లేదు. చింతన్ శిబిర్ కు ముందరి సందేహాలు కొన్నింటికి శిబిరం ముగిశాక కూడా సమాధానాలు రాకపోవటమే సదరు అసంతృప్తికి కారణం.

నూటా ముఫ్పై ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీని పునరుజ్జీవింప జేసుకోవడానికి శస్త్ర చికిత్స అవసరమైన చోట.. కాయకల్ప చికిత్సతో సరిపెట్టే ప్రయత్నం చేసింది కాంగ్రెస్​ నాయకత్వం! ఇది శంకించే కావచ్చు, పీకే గౌరవంగా పక్కకు తప్పుకున్నారేమో అనిపిస్తుంది. 2014 తర్వాత వరుస ఓటములు, ఒక్కో రాష్ట్రం నుంచి క్రమంగా పార్టీ కనుమరుగవుతున్న పరిస్థితుల్లో ఈ శిబిరంపై పార్టీ శ్రేణుల్లోనూ ఆశలు మోసులెత్తాయి. జీ–23 అసమ్మతి వాదులు లేవనెత్తుతున్నారనే కాదు, దేశ వ్యాప్తంగా పార్టీ శ్రేణులు నిరీక్షిస్తున్నట్టు...  నాయకత్వం విషయంలో స్పష్టత గానీ, సిద్ధాంతపరమైన దృక్పథం కానీ ఉదయ్​పూర్ డిక్లరేషన్ ద్వారా వెల్లడి కాలేదు. అసంతుష్టులు డిమాండ్ చేస్తున్న కేంద్ర పార్లమెంటరీ బోర్డు(సీపీబీ) పునర్​వ్యవస్థీకరణకు కూడా నాయకత్వం ససేమిరా అంది. ఏవో మూడు కమిటీలు ప్రతిపాదించినా, అవి సాధారణ వార్షిక సదస్సుల్లో తీసుకునే నిర్ణయాల వంటివే అనే భావన పార్టీ వర్గాల్లో వ్యక్తమౌతోంది. అట్టడుగు స్థాయి నుంచి పార్టీ శ్రేణుల, సామాన్య ప్రజల మనోభావాలు తెలుసుకుంటూ, ఎన్నికల ఎత్తుగడల కోసం ఒక వ్యూహకమిటీ  ఏర్పరుస్తారు. పార్టీ శ్రేణుల శిక్షణ కోసం ఒక విభాగం ఉంటుంది. పార్టీ సంస్థాగత సంస్కరణల కోసం ఒక టాస్క్​ఫోర్స్ ఏర్పాటు. ఇవి కాకుండా ఎప్పటికప్పుడు తాజా పరిస్థితుల్ని సమీక్షించేందుకు సీడబ్ల్యూసీలోనే ఒక సలహామండలి  సోనియా నేతృత్వంలో ఏర్పడుతుంది. అపోహలకు తావులేకుండా ఉండేందుకేమో, ‘అదేం ఉమ్మడి నిర్ణయాలు తీసుకునే కమిటీ కాదు, కేవలం  సలహాలు ఇవ్వడానికే’ అని వెనువెంటనే ఆమె వివరణ కూడా ఇచ్చారు.

దారి చూపి ఉండాల్సింది

దేశంలో ఇప్పుడు నెలకొని ఉందంటున్న సిద్ధాంతపరమైన శూన్యత పూరించడానికి ఏం చేస్తారో చెప్పుకోలేదు. దేనికోసం కాంగ్రెస్ పార్టీ నిలబడుతుందో.. దేశ ప్రజానీకానికి గట్టి సందేశం ఇవ్వడానికి సరైన సమయంలో లభించిన ఒక వేదికను నాయకత్వం సరిగా వాడుకోలేకపోయిందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ఎందుకు మరో పార్టీని కాదని దేశ ప్రజలంతా కాంగ్రెస్ వెనుకాల బారులు తీరాలో... చెప్పే యత్నమేదీ జరుగలేదు. సంస్థాగత సదస్సే అయినా, దేశ సమస్యల్ని చర్చించడం కాంగ్రెస్​కు పరిపాటి. దేశం ఎదుర్కొంటున్న సవాళ్ల కన్నా పార్టీ అంతర్గత సమస్యల పరిష్కారం మీదే ఎక్కువ దృష్టి పెట్టారనే భావన జనంలోకి వెళ్లింది. కానీ, ఈ దేశాన్నీ, ఇక్కడ ప్రజాస్వామ్యాన్నీ, మైనారిటీలను కాపాడేది ఒక్క కాంగ్రెస్ పార్టీయే అన్నట్టు నాయకులు సదస్సు తర్వాత ప్రకటనలు మాత్రం చేశారు. రాజకీయ, ఆర్థిక, సంస్థాగత, సామాజిక న్యాయ, యువత, రైతాంగ పరమైన ఆరు అంశాలపై బృందాలుగా ఏర్పడి 430 మంది ప్రతినిధులు చర్చించి, ప్రతిపాదించిన అంశాలపై సదస్సు స్థూలంగా చర్చించింది. పార్టీ పరమైన పదవుల్లో సగం యాభై ఏళ్ల లోపువారికే ఇవ్వాలని, ఒక కుటుంబానికి ఒక పదవి, ఒక టిక్కెట్టు మాత్రమే ఇవ్వాలనీ నిర్ణయించారు. కానీ, అదే కుటుంబంలో ఎవరైనా అయిదేళ్లకు పైబడి పార్టీలో క్రియాశీలంగా వ్యవహరించిన వ్యక్తులు ఉంటే వారికీ అవకాశం ఇవ్వొచ్చని మినహాయింపిచ్చారు. పదవుల్లో, హోదాల్లో, ఇతర అవకాశాల్లో బలహీనవర్గాలకు సగానికి తగ్గకుండా అవకాశం కల్పించాలని నిర్ణయించారు. ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రతిపాదించినప్పటికీ, చివరి తీర్మానంలో దానికి చోటు దక్కలేదు. కొన్ని వర్గాల ప్రజలకు పార్టీ దూరమైందనే విషయాన్ని అంగీకరిస్తూ, వారికి తిరిగి చేరువ కావాలని, ప్రజా సమస్యలపై నిరంతరం వీధుల్లో పోరాటాలు చేయడం ఒక్కటే మార్గమని సదస్సు నిర్ణయించింది. సాధారణంగా ఏ రాజకీయ పార్టీ అయినా తీసుకునే, ఆచరించే విధానాలే ఇవి. ఇందులో ప్రత్యేకత ఏముందని కొందరు పార్టీ వారే పెదవి విరుస్తున్నారు. దేశంలో ప్రజల్ని మతంతో సహా వివిధ ప్రాతిపదికలపై పాలకపక్షం విభజిస్తోందని ఆరోపిస్తున్నందున, ఆయా వర్గాలను జోడించేందుకు ‘జోడో భారత్’ పేరిట కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తలపెట్టిన పాదయాత్ర కాంగ్రెస్ పునరుద్ధరణకు దోహదపడుతుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.

ఇంట గెలిచి రచ్చగెలవాలి

ఒకవైపు శిబిరం జరుగుతుండగానే, అసంతృప్తితో పార్టీని విడిచి వెళ్లిన పంజాబ్ మాజీ పీసీసీ చీఫ్ సునీల్ జాఖడ్ ఒక వ్యాఖ్య చేశారు.  కాంగ్రెస్ తాజా పరిస్థితికి తగినట్టుగా ఉన్న, ప్రఖ్యాత ఉర్దూ కవి వాసిం బర్వేలీ (జాహిద్ హుస్సేన్) గజల్​ను ప్రస్తావిస్తూ, పార్టీ బాగుపడుగాక అన్నారు. 
ఆ గజల్ అర్థం... ‘ఇంటిని అలంకరించే ఆలోచనలు బోలెడున్నాయి. కానీ, అసలు ఇంటిని కాపాడుకోవడం ఎలా? అన్నది ముందున్న తక్షణ కర్తవ్యం’ అందుకే ప్రశాంత్ కిశోర్ ఒక మాట నిష్కర్షగా చెప్పారు. తన సేవలకన్నా‘ కాంగ్రెస్​కు తక్షణం కావాల్సింది నాయకత్వం, సమూల సంస్కరణల ద్వారా పార్టీ సంస్థాగత సమస్యల్ని పరిష్కరించుకునే సమష్టి దృఢచిత్తం’ చింతన్ శిబిర్​లో అది దొరికిందా.. కాంగ్రెసే బేరీజువేసుకోవాలి.
- సవ్యసాచి