మిడ్జిల్, వెలుగు : టెక్నికల్ప్రాబ్లమో, మరో సమస్యనో గాని, మహబూబ్‌నగర్‌జిల్లా మిడ్జిల్మండలం మున్ననూరు టోల్‌ప్లాజా నుంచి వెహికల్స్ వెళ్లపోయినా ఫాస్టాగ్ నుంచి అమౌంట్ కట్ అవుతోంది. ఒకటి రెండు సార్లు వెళ్తే.. నాలుగైదు సార్లు కంటిన్యూగా డిబెట్ అవుతున్నట్లు ఫోన్లకు మెసేజ్‌లు వస్తున్నాయి. దీంతో వెహికల్స్ ఓనర్లు రీఫండ్ చేయాలని టోల్ ప్లాజా వద్దకు వెళ్తే సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారు. చేసేది లేక వెహికల్స్ ఓనర్లు టోల్ ప్లాజా వద్ద ఆందోళనకు దిగుతున్నారు.
ఎన్‌హెచ్ 167పై..
జడ్చర్ల- కల్వకుర్తి మధ్య ఉన్న ఎన్‌హెచ్-167పై మున్ననూరు వద్ద రెండేళ్ల కింద టోల్‌ప్లాజాను ఏర్పాటు చేశారు. దీని మీదుగా మహబూబ్‌నగర్ నుంచి కల్వకుర్తి, నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, మిర్యాలగూడ, కోదాడ, ఏపీలోని గుంటూరు ప్రాంతాల మధ్య వెహికల్స్ వెళ్తుంటాయి. కార్లు, జీపులకు రూ.45, అప్‌అండ్‌డౌన్ అయితే రూ.65, లైట్ గూడ్స్, మినీ బస్సులకు రూ.70, అప్‌అండ్‌డౌన్ రూ.105, బస్సులు, ట్రక్కులకు రూ.150, అప్అండ్‌డౌన్‌కు రూ.225, హెవీ కన్స్ర్టక్షన్ మిషనరీలు, ఎర్త్ మూవింగ్ఎక్విప్మెంట్ వెహికల్స్‌కు రూ.235, అప్అండ్‌డౌన్‌కు రూ.355 ఫాస్టాగ్ కింద చార్జ్ చేస్తున్నారు.
రాయలసీమకు చెందిన వ్యక్తికి కాంట్రాక్ట్
గత సెప్టెంబర్‌లో టోల్‌ప్లాజా నిర్వహణ బాధ్యతను నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఏపీలోని అనంతపురం జిల్లాకు చెందిన కాంట్రాక్టర్ టి.సూర్యనారాయణ రెడ్డి అప్పగించింది. అప్పటి నుంచి ప్లాజా మీదుగా వెళ్లే వెహికల్స్‌కు అదనంగా ఫాస్టాగ్ వ్యాలెట్ నుంచి అమౌంట్ కట్అవుతోంది. సమీప ప్రాంతాల్లో ఉండే వెహికల్స్ఇక్కడి నుంచి వెళ్లకున్నా కూడా డబ్బులు డెబిట్ అవుతున్నాయి. సెప్టెంబర్ నుంచి ఇదే పరిస్థితి ఉన్నా.. పది రోజుల నుంచి ఇది మరీ ఎక్కువైందని, మూడు నాలుగు సార్లు అమౌంట్కట్ అవుతోందని వెహికల్స్ఓనర్లు వాపోతున్నారు. అక్కడి సిబ్బందిని ప్రశ్నిస్తే టెక్నికల్ప్రాబ్లం అని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తున్నారని వాపోతున్నారు.
మైనస్ అమౌంట్‌లోకి వెళ్తున్న వ్యాలెట్‌లు
సాధారణంగా ఫాస్టాగ్ వ్యాలెట్‌లో జీరో అమౌంట్ఉంటే వెహికల్ టోల్‌ప్లాజా వద్దకు వెళ్లినప్పుడు గేట్ ఓపెన్ కాదు. ఓనర్ బైహ్యాండ్ ద్వారా క్యాష్ కట్టాల్సి ఉంటుంది. కానీ, మున్ననూరు టోల్ ప్లాజా వద్ద మాత్రం జీరో బ్యాలెన్స్ ఉన్నా గేట్ తెరుచుకుంటోంది. వ్యాలెట్ అమౌంట్మైనస్లోకి పడిపోతుండడంతో వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పాసులు కూడా ఇస్తలేరు
టోల్‌ప్లాజాలు ఏర్పాటు చేశాక సమీప గ్రామాల్లో ఉండే కార్లు, జీపులు, ట్రాక్టర్ల యజమానులకు రూల్ ప్రకారం పాసులు ఇవ్వాలి. కానీ, మున్ననూరు టోల్‌ప్లాజా వద్ద ఇంత వరకు ఎవరికీ పాసులు ఇవ్వలేదు. టోల్ ప్లాజా నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉండే వెహికల్స్‌కు నెలకు రూ.150, 20 కిలోమీటర్ల దూరంలో ఉండే వెహికల్స్‌కు రూ.300 లాగా ఒక్కో వాహనానికి పాసులు ఇవ్వాలి. కానీ, రెండేళ్లు కావస్తున్నా, ఎవరికీ పాసులు ఇవ్వడం లేదు. దీంతో వారు ఈ వెహికల్స్‌ను టోల్‌ప్లాజా మీదుగా తీసుకెళ్లినప్పుడల్లా అమౌంట్ కట్అవుతూనే ఉంది.
టెక్నికల్ ప్లాబ్లంతోనే..
టోల్‌ప్లాజా నుంచి వెహికల్స్ వెళ్లకున్నా.. ఫాస్టాగ్ ద్వారా వాలెట్ నుంచి డబ్బులు కట్ అయిన మాట వాస్తవమే. టెక్నికల్ ఇష్యూ వల్ల ఇలా జరిగింది. ఇందులో మా తప్పిదమేం లేదు. ఈ విషయాన్ని నేషనల్ హైవే అధికారులకు వివరించాం. రీ ఫండ్ ప్రాసెస్ చేస్తున్నట్టు చెప్పారు. - వంశీ, మేనేజర్, మున్ననూరు టోల్ ప్లాజా
మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్‌కు చెందిన వరూణ్రాజుకు టీఎస్09ఈవై 5814 నంబర్ మీద కారు ఉంది. నవంబరు 20న మున్ననూరు టోల్ప్లాజామీదుగా ప్రయాణం చేశాడు. టోల్‌ఫీజు ఫాస్టాగ్ నుంచి ఒకసారికి బదులు మూడు సార్లు కట్అయ్యింది. - వరుణ్ రాజుకు కట్ అయిన అమౌంట్
మిడ్జిల్ మండలం బోయిన్పల్లి గ్రామానికి చెందిన నరేశ్ కారు (టీఎస్06ఎఫ్ఈ0792)లో ఈ నెల 20న కల్వకుర్తికి వెళ్లాడు. మున్ననూరు టోల్‌ప్లాజా మీదుగా వెళ్లకున్నా అమౌంట్ కట్ అయినట్లు 23న మెసేజ్ వచ్చింది. రూ.45 చొప్పున నాలుగు సార్లు రూ.180 కట్అయ్యింది. - నరేశ్ కోటక్ ఫాస్టాగ్ నుంచి కట్ అయిన అమౌంట్