వాళ్లవైనా కావాలి, బైపోలైనా రావాలి అభివృద్ధికి ఇంత వివక్షా!

‘అన్నపురాసులు ఒకచోట ఆకలి మంటలు ఒకచోట.. హంస తూలికలొకచోట అలసిన దేహాలొకచోట.. సంపదలన్నీ ఒకచోట గంపెడు బలగంబొకచోట!’ అంటూ సమాజంలోని అసమానతలను ప్రజాకవి కాళోజీ తన కలంతో ఎత్తిచూపారు. ఇప్పుడు తెలంగాణలోని ఆయా సెగ్మెంట్ల అభివృద్ధిలో సరిగ్గా కాళోజీ చెప్పిన అసమానతలే కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో119 నియోజకవర్గాలు ఉంటే సీఎం, ఆయన కుటుంబ సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల, గజ్వేల్, సిద్దిపేటల్లోనే అభివృద్ధి జరుగుతోంది. ఆదేశిక సూత్రాలలోని 38వ అధికరణం ప్రకారం ప్రభుత్వం అన్ని చోట్ల సమాన సౌకర్యాలు, వనరులు, పౌరుల అభివృద్ధికి అవకాశాలు కల్పించాలి. కానీ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా అయినవాళ్ల సెగ్మెంట్లలోనో లేదా ఉప ఎన్నికలొస్తేనో నిధుల వరద పారిస్తూ ఇదే అభివృద్ధి అని చెబుతోంది. 

ఆ మూడు చోట్లే అభివృద్ధి?

రాష్ట్రంలో సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్​లో నియోజకవర్గాల పరిధిలోనే విద్యాసంస్థలు, పరిశోధక సంస్థలు, విశాలమైన రోడ్లు, ట్యాంక్ బండ్లు, డబుల్ బెడ్ రూం ఇండ్లు, అర్హులందరికీ ఆసరా పింఛన్లు.. ఇలా అన్నీ కొనసాగుతున్నాయి. సిరిసిల్లలో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్, నర్సింగ్ కాలేజీలనున ప్రభుత్వ నిధులతో స్థాపించారు. టెక్స్​టైల్ పరిశ్రమను పునరుద్ధరించారు. సమీకృత మార్కెటింగ్ వ్యవస్థను అభివృద్ధి చేసుకున్నారు. హరీశ్ రావు తన సెగ్మెంట్​లో ఒక ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలు మంజూరు చేయించుకోగలిగారు. సిద్దిపేట చుట్టూ రింగ్ రోడ్లు, ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు, కోమటి చెరువు ​అభివృద్ధి లాంటి కార్యక్రమాలతో సిద్దిపేట ముఖచిత్రాన్ని మార్చుకున్నారు. గజ్వేల్ చుట్టూ రింగు రోడ్డు, అతిపెద్ద ఇంటిగ్రెటెడ్​మార్కెట్, సెగ్మెంట్​లో హార్టికల్చర్ యూనివర్సిటీ, ఫారెస్ట్ రీసెర్చ్​ ఇన్​స్టిట్యూట్ తోపాటు పలు ఫార్మా కంపెనీలు, సీడ్​కంపెనీలు ఉన్నాయి. వాటిల్లో వేల మందికి ఉపాధి దొరుకుతోంది. ఈ మూడు నియోజకవర్గాల్లోనే అత్యధిక డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేసి కార్యకర్తలకు ఇచ్చుకున్నారు. గత ఎనిమిదేండ్లలో వీటికి నిధుల కొరత లేదు. సీఎం సొంతూరు చింతమడకలో ఇంటికి రూ.10 లక్షలు అభివృద్ధి పనులకు పంచి పెట్టారు. ఆయా సెగ్మెంట్లలో వారికి నచ్చినోళ్లకు నామినేటెడ్ పదవులు ఇచ్చారు. ఇలా డెవలప్​మెంట్​అంతా సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్​లో జరిగితే, రాష్ట్రంలోని మిగతా నియోజకవర్గల్లో ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతాలు స్వరాష్ట్రంలోనూ నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. 

గ్రేటర్​ ఎన్నికల్లోనూ..

దుబ్బాక ఉప ఎన్నికలో ప్రభుత్వం 4 వేల మందికి మాత్రమే పింఛన్లు ఇచ్చి ఆపేసింది. జీహెచ్ఎంసీ ఎన్నికలకు ముందు హైదరాబాద్ మహానగరంలో వరదలు వచ్చి ప్రజలు తీవ్రంగా నష్టపోవడంతో ఇంటికి రూ.10 వేలు చొప్పున ఇస్తామని ప్రకటించి, కొందరికే ఇచ్చింది. హుజూరాబాద్ ఎన్నికల కోసం దళితబంధు పేరిట ఒక్క సెగ్మెంట్​లోనే 2 వేల కోట్లు ఖర్చు చేసింది. దీంతో తమ దగ్గర కూడా ఉప ఎన్నిక వస్తే తప్ప తమకు పథకాలు అమలు కావని, అభివృద్ధి జరగదని ప్రజలు భావించే పరిస్థితి వచ్చింది. అందుకే ప్రజలు వారి ఎమ్మెల్యేల రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. ఉప ఎన్నిక వస్తేనే మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని చెబుతూ వచ్చిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామా తర్వాతే ప్రభుత్వం అభివృద్ధి పనులు మొదలుపెడుతున్నట్లు కనిపిస్తోంది.

రాజీనామాలపైనే చర్చ

ఆదిలాబాదు, మహబూబ్​నగర్, ఖమ్మం, వరంగల్ ఉమ్మడి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలు,   మరికొన్ని నియోజకవర్గాలు అభివృద్ధికి నోచుకోలేదు. అక్కడి ప్రజలు కూడా ఉప ఎన్నికలు వస్తేనే తమ బతుకులు మారుతాయని భావిస్తున్నారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఒక్క ఉప ఎన్నిక వచ్చే విధంగానైనా నాయకులు ప్రతిస్పందిస్తే వేల కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతాయని అంతా చర్చించుకుంటున్నారు. వరంగల్ లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కాకతీయ మెగా టెక్స్​టైల్ పార్కు, ఐటీ పార్కులు, ఇలా అన్ని సమస్యలు ఉప ఎన్నిక వస్తేనే తీరుతాయని అంతా భావించే పరిస్థితి తెచ్చింది సర్కారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎవరు రాజీనామా చేసినా.. ప్రజలు వారిని గెలిపిస్తరనడంలో సందేహం లేదు!.

బైపోల్​ వస్తేనే నిధుల వరద

రాష్ట్రంలో మూడు సెగ్మెంట్లు మినహా అన్ని నియోజకవర్గాలకు నిధులు లేక అభివృద్ధి కుంటుపడగా, సర్కారు ఉప ఎన్నిక వచ్చిన చోటనే నిధుల వరద పారిస్తోంది. రాత్రికి రాత్రే రోడ్లు, కమ్యూనిటీ భవనాలు, మోరీలు ఇలా పనులు చకచకా చక్కబెడుతోంది. హుజూర్​నగర్, నాగార్జునసాగర్, దుబ్బాక, హుజూరాబాద్ నియోజకవర్గాల ఉప ఎన్నికల సమయంలో ఓట్లు పొందేందుకు అభివృద్ధి పేర ప్రభుత్వం కోట్లాది రూపాయలు విచ్చలవిడిగా ఖర్చు చేసిందని మీడియాలో వార్తలొచ్చాయి. బైపోల్​సెగ్మెంట్లలో 57 ఏండ్లు దాటిన వారికి ఆసరా పింఛన్లు ఇచ్చారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఆత్మగౌరవ భవనాలకు రూ. 20 కోట్ల కేటాయించి పనులు ప్రారంభించారు. జీపీలు, మున్సిపాలిటీలకు రూ.70 కోట్లు కేటాయించి అభివృద్ధి పనులు మొదలుపెట్టారు. నాగార్జునసాగర్, హుజూర్​నగర్ ఉప ఎన్నికల సందర్భంగా కూడా వందల కోట్లతో అభివృద్ధి పనులు చేస్తామని సీఎం కేసీఆర్​బహిరంగ సభల్లో ప్రకటించారు. వీటితోపాటు పోడు భూముల సమస్య పరిష్కరిస్తామని, మరో విడత గొర్రెల పంపిణీ చేపడుతామని, అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు ఇస్తామని హామీ ఇచ్చారు. కాగా హామీ ఇచ్చిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో కనీసం 20 శాతం కూడా పూర్తి కాలేదని హుజూరాబాద్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- కూరపాటి వెంకటనారాయణ
కన్వీనర్, తెలంగాణ జాక్(టీఎస్)