తక్కువ ఓటింగ్ ఎవరికి లాభం?​

తక్కువ ఓటింగ్ ఎవరికి లాభం?​
  • ప్రభుత్వ వ్యతిరేక ఓటు పోలైందంటున్న బీజేపీ
  • ఇదే తమకు కలిసి వస్తుందని ధీమా
  • లబ్ధిదారులే ఓటేశారంటున్న టీఆర్​ఎస్​
  • మెజార్టీ సీట్లు తమవేనని అంచనా
  • చెప్పుకోదగ్గ సీట్లు గెలుస్తామంటున్న కాంగ్రెస్​
  • ఉన్న సీట్లు నిలబెట్టుకుంటామంటున్న ఎంఐఎం
  • ఓట్ల లెక్కలు తెప్పించుకుంటున్న లీడర్లు

హైదరాబాద్, వెలుగుజీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం తక్కువ నమోదు కావడంతో రాజకీయ పార్టీలు కంగుతిన్నాయి. ఓటు వేసేందుకు ఓటర్లు ఎందుకు ఉత్సాహం చూపలేదని, ఎక్కడ సమస్య వచ్చిందని విశ్లేషించుకుంటున్నాయి.  ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయని లెక్కలు వేసుకుంటున్నాయి. ఓటింగ్​ శాతం తగ్గినప్పటికీ తమకే లాభం అని ఇటు టీఆర్ఎస్ లీడర్లు, అటు బీజేపీ లీడర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. చెప్పుకోదగ్గ సీట్లు గెలుస్తామని కాంగ్రెస్, ఉన్న సీట్లను నిలబెట్టుకుంటామని ఎంఐఎం అంటున్నాయి. ప్రభుత్వంపై కోపంగా ఉన్న ప్రజలు పోలింగ్ లో పాల్గొన్నారని, ఇది తమకు కలిసివచ్చే అంశమని బీజేపీ లీడర్లు చెప్తున్నారు. వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులు పోలింగ్ లో పాల్గొన్నారని, మెజార్టీ సీట్లు తమకు వస్తాయని టీఆర్ఎస్ లీడర్లు అంటున్నారు.

ఓటింగ్ తగ్గడం కోసం రాష్ట్ర ప్రభుత్వం మొదట్నించి ప్లాన్ వేసిందని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. వరుసగా నాలుగు రోజుల పాటు సెలవులు ఇవ్వడంతో చాలా మంది ఓటర్లను ఊర్లకు వెళ్లేలా చేశారని వారు అంటున్నారు. అయితే ప్రభుత్వ విధానాలపై విసిగిపోయిన ప్రజలు పోలింగ్​లో పాల్గొన్నారని, ప్రభుత్వ వ్యతిరేక ఓటింగ్ తమకు అనుకూలమని బీజేపీ లీడర్లు అంచనా వేస్తున్నారు. ఆరేండ్లుగా కేసీఆర్ పాలన తీరుచూసిన సిటీ ప్రజలు ఓటింగ్ రూపంలో తమ నిరసనను వ్యక్తం చేశారని వారు అంటున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్న యూత్, ఎంప్లాయీస్ ఓటింగ్​లో పాల్గొన్నారని, శివారు డివిజన్లలో పెద్ద ఎత్తున పోలింగ్ నమోదైందని, అక్కడ ఎక్కువ సీట్లు సాధిస్తామని బీజేపీ లీడర్లు ధీమాలో ఉన్నారు.

లబ్ధిదారులే ఓటింగ్​కు వచ్చారా?

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల లబ్ధిదారులే ఓటింగ్​కు వచ్చారని టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఆసరా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లబ్ధిదారులు ఓటింగ్​లో పాల్గొన్నారని, తక్కువ ఓటింగ్​ నమోదైనా తమకు కలిసి వస్తుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే డబుల్  ఇండ్ల లబ్ధిదారులను గుర్తించామని, వారంతా పోలింగ్ కు వచ్చారని చెప్తున్నారు. అయితే.. గ్రేటర్  పరిధిలో ప్రతి నెల 10 లక్షలు మంది ఆసరా పెన్షన్లు తీసుకుంటున్నారు. వీరంతా ఓటింగ్​కు రాలేదని టీఆర్​ఎస్​ పెద్దలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రీ వాటర్ స్కీమ్, పన్ను రాయితీ ప్రకటన వర్కవుట్ అయిందా? ఒకవేళ ప్రజలు ఆ హామీలకు ఆకర్షితులైతే పెద్ద ఎత్తున పోలింగ్​లో ఎందుకు పాల్గొనలేదని చర్చించుకుంటున్నారు. అనుకున్నంతగా లబ్ధిదారులు ఓటింగ్​లో పాల్గొనకపోయినా.. నమోదైన తక్కువ పోలింగ్​లో  పాల్గొన్నది లబ్ధిదారులేనని, అది కలిసి వస్తుందని టీఆర్​ఎస్​ లీడర్లు అంటున్నారు.

ఐటీ ఎంప్లాయీస్​ ఎటు వైపు?

ఐటీ ఎంప్లాయీస్​ ఓట్లు ఎటు వైపన్నది ప్రధాన పార్టీలకు అంతుచిక్కడం లేదు. వర్క్​ ఫ్రమ్​ హోం వల్ల పెద్ద సంఖ్యలో ఐటీ ఎంప్లాయీస్​ సొంతూళ్లకు వెళ్లిపోయారు. మిగిలిన వాళ్ల ఓట్లు ఎటు పడ్డాయని అన్ని పార్టీలు లెక్కలు వేసుకుంటున్నాయి. ఐటీని తాము అభివృద్ధి చేశామని, తమకే ఐటీ రంగంలోని వారి ఓట్లు పడుతాయని టీఆర్​ఎస్​లీడర్లు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఐటీ అనుకూల విధానాలతో ఆ రంగంలోని వారు తమకే మద్దతిస్తారని బీజేపీ లీడర్లు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత వారిలో ఎక్కువగా ఉంటుందని, అది తమకు కలిసి వస్తుందని బీజేపీ లీడర్లు భావిస్తున్నారు.

పట్టు నిలుపుకుంటామంటున్న కాంగ్రెస్​, ఎంఐఎం

ఎన్నికల్లో తాము చెప్పుకోదగ్గ సీట్లు సాధిస్తామని కాంగ్రెస్​ లీడర్లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు తమకు కలిసి వస్తుందంటున్నారు.  తమ పాలనలోనే నగరం అభివృద్ధి చెందిందని, దాన్ని ఓటర్లు గుర్తించి ఓటు వేశారని అంచనా వేసుకుంటున్నారు. ఇప్పటికే తమకు ఉన్న సీట్లను తిరిగి రాబట్టకుంటామని మజ్లిస్​ లీడర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

బస్తీవాసులు ఏ దిక్కో..?

నెలన్నర కింద వచ్చిన వరదలతో హైదరాబాద్​లోని బస్తీలు చాలా వరకు నీట మునిగాయి. ప్రభుత్వం సరిగ్గా పట్టించుకోలేదన్న ఆగ్రహం బస్తీవాసుల్లో ఉంది. అయితే.. వరద సాయం ఈ ఎన్నికల్లో తమకు ప్లస్​ అవుతుందని టీఆర్​ఎస్​ భావిస్తోంది. కానీ, వరద సాయం విషయంలో తలెత్తిన వివాదాలు, టీఆర్​ఎస్​ లీడర్లే పంచుకు తిన్నారన్న ఆరోపణలు ఎలక్షన్లలో ప్రభావం చూపుతాయని బీజేపీ లీడర్లు అంచనా వేస్తున్నారు. ప్రచారంలో కూడా టీఆర్​ఎస్​ లీడర్లను బస్తీల్లోని వరద బాధితులు నిలదీసిన సంఘటనలు వారు గుర్తుచేస్తున్నారు. ఇదే బీజేపీకి కలిసి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.