ఆంధ్రలో ఈసారి గెలిచేది ఎవరు?

ఆంధ్రప్రదేశ్ ఓటరు నాడి అంతు చిక్కడంలేదు. ఈసారి గెలవకపోతే జగన్‌‌కి భవిష్యత్తు లేదు. ఓడితే తెలుగు దేశం భవిష్యత్తు ఇబ్బందుల్లో పడుతుంది. మూడో పార్టీగా వచ్చిన జనసేన కింగా,కింగ్ మేకరా, చివరకు చంద్రబాబు చేతిలో బకరానా.  ఇలాంటి చాలా ఆసక్తికరమైన అంశాలు ఈ ఎన్నికల్లోఉన్నాయి. ఏపీలో రాజకీయం ఎలాఉంది.? ఓటర్లు ఎవరి వైపున్నారనే విషయాలను తెలుసుకునేందుకు ‘వీ6వెలుగు’ తెలంగాణ నుంచి అమరావతికి వెళ్లింది. పలు జిల్లాల్లో పర్యటించిం ది. ఈ సందర్భంగా గుర్తిం చిన అంశాలివి..

ఈసారి ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావొచ్చని ఎవ్వర్నిఅడిగినా వచ్చే సమాధానం ‘పోటాపోటీగా ఉందండి.ఇక్కడ చాలా మంది వైసీపీ హవా అంటున్నా రండి. కాకపోతే మా నియోజకవర్గంలో టీడీపీ గెలిచే అవకాశం ఉందండి’.నందిగామ నియోజకవర్గ కేంద్రంలో మెడికల్ షాపు నిర్వహిస్తున్న రమణ మాటలివి.  వాస్తవంగా పోటీ మాత్రం  టీడీపీ.వైసీపీల మధ్యనే కన్పిస్తోంది.  జనసేన పార్టీ తొలిసారి ఎన్నికల బరిలో నిలిచింది. దీని ప్రభావం గురించి అంతగా చెప్పలేదు. ఏ పార్టీకి ప్రత్యక్ష, పరోక్ష మద్దతున్నది. ఎవరు ఎవరికి ఎందుకు మద్దతునిస్తున్నా రనే విషయాల గురించి ఓటర్లకు అవగాహన ఉంది. నిర్ధిష్టంగా ఫలానా అని చెప్పడానికి జంకు తున్నా రు.కొన్ని నియోజకవర్గాల్లో బరిలో ఉన్నవారి వ్యక్తిగత ప్రభావం పనిచేస్తున్నట్లు కన్పించింది. మరి కొన్ని నియోజకవర్గాల్లో పార్టీ అధినేతల ఇన్‌ఫ్ల్యూయెన్స్‌ ఉన్నట్లు అర్థం అయింది. ప్రముఖులు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో గెలుపు ఓటముల గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది.

మంగళగిరి నియోజకవర్గంలో సీఎం చంద్రబాబునాయుడు కొడుకు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ గట్టి పోటీని ఎదుర్కొంటున్నారు. చంద్రబాబు ఏదో మాయ చేసి తమ పార్టీని గెలిపించుకుంటారని వైసీపీ నాయకులు మానసికంగా బలంగా నమ్ముతున్నారు.  ఇలాంటి అభిప్రాయాన్నే వైసీపీ అభ్యర్థి  ఆళ్ల రామకృష్ణా రెడ్డి  వ్యక్తం చేశారు.కృష్ణా , గుంటూరు జిల్లాల్లో తెలుగు దేశం ప్రభావం కన్పిస్తోంది.  ఇక్కడ కూడా వైసీపీ గట్టి పోటీనే ఇస్తున్నది. గుంటూరు జిల్లా తెనాలి నుండి పోటీ చేస్తున్న ఉమ్మడి రాష్ట్ర స్పీకర్ నాదెండ్ల మనోహర్ తన ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంది. నెల్లూరు జిల్లా సర్వేపల్లి స్థానం నుంచి పోటీ చేస్తున్న మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా గట్టి పోటీనే ఎదుర్కొంటున్నారు.అయితే  సీమ జిల్లాల ఓటర్లు తమ అభిప్రాయాలను చెప్పడానికి ఇష్టపడలేదు. చెబితే తమ ఓట్లు తీసేస్తారనే భయంతో ఉన్నట్లు కన్పించింది. ఈ భయం ఎక్కువగా కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో ఉంది. అనంతపురం జిల్లాల్లో ఓటర్లు తమ అభిప్రాయం  చెప్పడానికి అస్సలు ఇష్టపడటం లేదు. తాడిపత్రిలో మా బృందం ఓటర్లతో మాట్లాడే ప్రయత్నం చేసింది. బెరుకుబెరుకుగా  కొద్దిమంది మాత్రం ఫలానా పార్టీ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారని చెప్పారు.  చాలామంది కెమెరా ముందుకు రావడానికే ఇష్టపడలేదు.

బడుగు బలహీనుల్లో ఆశలు

కూలీ చేసుకుని పొట్ట పోసుకునేవారు, రోడ్లపై చిరు వ్యాపారాలు చేసుకునేవారు జగన్ వైపు ఉన్నట్లు కన్పించింది. చదువులు,ఇండ్లు, పెళ్లిళ్ల ఖర్చులను జగన్ భరిస్తాడనే నమ్మకంతో ఉన్నారు వీరు. ప్రకాశం, నెల్లూ రు, కడప జిల్లాల్లో జగన్‌ కి బాగా మద్దతు ఉన్నట్లు లోకల్‌‌ ట్రెండ్‌ని బట్టి తెలుస్తోంది. ఈ జిల్లాల్లో రెండు పార్టీల మధ్య పోటాపోటీ ఉంటుందని అంటూనే, జగన్‌ కి ఎక్కువ అనుకూలంగా ఉన్నట్లు కొందరు చెప్పారు. 2014 ఎన్నికల్లోనూ ఈ జిల్లాలలో జగన్ పార్టీకి అత్యధిక స్థానాలొచ్చాయి .ఈసారి అదే రిపీట్ అవుతుందనే చర్చ సాగుతోంది.  క్రైస్తవులు ,దళితుల్లో మెజార్టీ ఓటర్లు జగన్ వైపు ఉన్నట్లు అర్థం అయింది. చిత్తూరు, కర్నూలు జిల్లాల్లోని ఎక్కువ నియోజకవర్గాల్లో జగన్ హవా ఉన్నట్లు అన్పించింది.

నగదు పథకాలతో మారిన సీన్‌

‌ఉద్యోగాలు చేసేవారు, మధ్య తరగతి వారు మాత్రం రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. ప్రజలకు నేరుగా నగదు అందించే పథకాలు చివర్లో వచ్చినా తమకు మంచి చేశాయని అతి కొద్దిమంది చెప్పారు. వృద్ధులకు పెన్షన్లు, డ్వాక్రా సంఘాల సభ్యురాళ్లకు పసుపు కుంకుమ కింద డబ్బులివ్వడం, రైతులకు పెట్టుబడి సాయం అందించడం కొంత మేరకు చంద్రబాబు లాభించే అంశమే అంటున్నా రు. ఈ తరహా పథకాల వల్ల చంద్రబాబు గ్రాఫ్ పెరిగినట్లు కన్పించింది. వాస్తవానికి రెండు నెలల కిందటి వరకు జగన్‌ కే సానుకూలంగా ఉన్నప్పటికీ, ఈ పథకాలు ప్రవేశపెట్టాక తెలుగు దేశం గెలుపుపై అంచనాలు పెంచాయి.

అప్పడు అన్న, ఇప్పుడు తమ్ముడు

చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ… 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి పరోక్షంగా దోహదం చేసిం ది. 2014 ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ మెజారిటీ సీట్లు గెలవడానికి చిరంజీవి తమ్ముడు పవన్‌ కల్యాణ్‌ పెట్టిన జనసేన మద్దతు ప్రత్యక్షంగా పనిచేసింది. ఈసారి జనసేనకు చంద్రబాబు వల్ల నష్టం జరిగే సూచనలే ఎక్కువగా ఉన్నట్లు అన్పించింది. చంద్రబాబు డైరెక్షన్‌ లోనే పవన్, కె.ఎ.పాల్ నడుస్తున్నారనే అభిప్రాయం అక్కడి ఓటర్లలో బలంగా ఉంది. అధికార పక్షాన్నికాకుండా విపక్షాన్ని పదేపదే ఈ రెండు పార్టీల నాయకులు తిట్టడాన్ని అక్కడి ఓటర్లు ప్రస్తావిస్తున్నా రు. అందువల్ల పవన్ ఎన్నికల గుర్తు ‘గాజు గ్లాసు ’కి పగుళ్లొస్తాయనే అభిప్రాయం ఉంది.

సీన్‌‌లో లేని కాంగ్రెస్‌ , బీజేపీ

కాగా, ఏపీ ఎన్నికల్లో కాం గ్రెస్, బీజేపీలు సీన్‌ లోనే లేవు. కాం గ్రెస్ పార్టీ నుంచి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన కోట్ల విజయభాస్కర్ రెడ్డి కుమారుడు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కాంగ్రెస్‌‌ని వీడి టీడీపీలో చేరారు. ఆ పార్టీ తరఫున కర్నూలు నియోజకవర్గం నుంచి ఎంపిగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత పరిస్థితి గురించి ప్రశ్నించినప్పుడు సూర్యప్రకాశ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉనికి లేకుండా పోయింది కాబట్టే, తాము పార్టీ మారాల్సి వచ్చిందన్నా రు. బైరెడ్డిలాంటి వారు రాహుల్ గాంధీ ప్రధాని అయితే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని ప్రజలకు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ముందు చూపు లేక పోవడం వల్లనే పార్టీకి ఈ దుస్థితి వచ్చిందని, పార్టీ మారడం వల్ల తనకు ఎలాంటి బాధ లేదని చెప్పారు. ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాల్లో కీలకంగా కన్పించిన శైలజానాథ్, రఘువీరారెడ్డిలు కాం గ్రెస్ నుండి పోటీ చేస్తున్నారు.  వీరి ప్రచారానికి అంతగా జనాదరణ లేదు. పోయిన సారితోపోలిస్తే ఇప్పుడు తమ పరిస్థితి బాగుం దని శైలజానాథ్చెప్పారు.
అయితే పోలింగ్‌ కి రెండు రోజుల ముం దు జరిగే పరిణామాలు, పోల్‌‌ మేనేజ్‌ మెంట్ కీలకం కావచ్చని ఓటర్ల మాటలను బట్టి అర్థం అయింది. ఈసారి ఏపీ ఎన్నికలు రెండు అంశాల చుట్టూ తిరుగుతున్నాయన్నది స్పష్టంగా కనబడింది. ఒకటి అభివృద్ధిని కొనసాగించడం. రెండోది పాలనా పగ్గాల మార్పు . ప్రస్తుత పరిస్థితి పోలింగ్ నాటికి ఉన్నట్లయితే… ఏ పార్టీకీ భారీ మెజారిటీలు దక్కే ఛాన్స్‌లేదు. ఏ నియోజకవర్గంలోనైనా సరే సగటున ఐదు వేల లోపు మెజార్టీతో గట్టెక్కే అవకాశమే కనబడుతోంది.

‑ గొర్ల బుచ్చన్న