ముథోల్ నియోజకవర్గంలోని బైంసాలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తుండగా.. కొందరు మహిళలు నిరసనలు వ్యక్తం చేశారు. పార్టీ అభ్యర్థి విఠల్ రెడ్డికి మద్దతుగా కేసీఆర్ ప్రసంగిస్తుండగా.. ఆందోళన వ్యక్తం చేశారు. భైంసాలో సీఎం కేసీఆర్ సభలో మహిళలు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఐదేండ్లుగా తమకు సంక్షేమ పథకాలు అందడం లేదని చెప్పారు. తమ ఊర్లో ఒక్కరికి కూడా ట్రాక్టర్ ఇవ్వలేదని, కొన్ని ఊర్లల్లో రెండు చొప్పున ట్రాక్టర్లు ఇచ్చారని ఓ మహిళ చెప్పింది. ముథోల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి తమను ఏనాడు పట్టించుకోలేదని మరికొందరు మహిళలు ఆరోపించారు.
వికలాంగురాలైన తన మనవరాలికి ఇప్పటి వరకు పెన్షన్ ఇవ్వలేదని ఓ మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు తమకు ఎలాంటి సాయం అందలేదని చెప్పింది.
తన భర్త చనిపోతే.. ఇప్పటి వరకు గవర్నమెంటు నుంచి ఎలాంటి సాయం అందలేదని, భూములు ఉన్న రైతులు చనిపోతే మాత్రం వారికి ఐదు లక్షలు ఇస్తున్న ప్రభుత్వం తమలాంటి వాళ్లను ఎందుకు ఆదుకోవడం లేదని మరో మహిళ ప్రశ్నించింది.
భూములు లేని తమలాంటి వాళ్లకు సర్కార్ నుంచి ఎలాంటి సాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది మరో మహిళ. తమ బాధలు చెప్పుకుందామంటే పోలీసులు తమను మాట్లాడించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ కు తమ బాధలు చెప్పుకునేందుకు తమకు ఒకసారి చాన్స్ ఇవ్వండని వేడుకున్నారు. ఓట్లు వేసే సమయంలో తమ వద్దకు నాయకులు వస్తున్నారు గానీ.. తమ బాధలను మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదని చెప్పారు.