- బైక్‌ను కారు ఢీకొనడంతో గాల్లో ఎగిరిపడ్డ యువతి
- తలకు తీవ్ర గాయం కావడంతో స్పాట్లోనే మృతి
- మరో ఐటీ ఉద్యోగికి గాయాలు
- నిందితుడు డిగ్రీ ఫస్టియర్ స్టూడెంట్
గచ్చిబౌలి, వెలుగు: బైక్‌ను కారు ఢీ కొనడంతో బీటెక్ విద్యార్థిని మృతి చెందగా, మరో ఐటీ ఉద్యోగికి తీవ్ర గాయాలయ్యాయి. కామారెడ్డి జిల్లా దోమకొండకు చెందిన ఐరేని శివాని ( 21) గండిపేటలోని సీబీఐటీ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ ఫైనలియర్ చదువుతోంది. రెండేండ్లుగా గండిపేటలోని ఓ ప్రైవేటు హాస్టల్లో ఉంటూ కాలేజీకి వెళ్లి వస్తోంది. ఆదివారం నిజాంసాగర్ మండల కేంద్రంలోని నవోదయ స్కూల్లో గెట్ టు గెదర్ పార్టీ నిర్వహించారు. ఈ స్కూల్లో చదివిన శివాని హైదరాబాద్ నుంచి అక్కడికి వెళ్లి, రాత్రి 7.30 గంటలకు కూకట్‌పల్లికి బస్సులో తిరిగొచ్చింది. అనంతరం హాస్టల్‌కు వెళ్లేందుకు తన సీనియర్, ఐటీ ఉద్యోగి అయిన వెంకటరెడ్డి (26)తో కలిసి బైక్‌పై బయలు దేరింది.
మార్గమధ్యలో నానక్ రాంగూడ నుంచి ఓఆర్ఆర్ సర్వీసు రోడ్డు మీదుగా వెళ్తున్న వీరిని వెనుక నుంచి కారు అతివేగంగా ఢీ కొట్టింది. దీంతో బైక్ వెనుక కూర్చున్న శివాని గాల్లో ఎగిరిపడి స్పాట్లోనే మృతి చెందింది. వెంకట్‌రెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో ప్రైవేట్హాస్పిటల్కు తరలించారు. పోస్టుమార్టం అనంతరం శివాని డెడ్‌బాడీని స్వగ్రామానికి తీసుకెళ్లి, కుటుంబసభ్యులు సోమవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు.
పోలీసుల అదుపులో నిందితుడు
అయితే, ప్రమాదానికి కారణమైన శ్రీకాలేశ్ (19)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీబీఏ ఫస్టియర్ చదువుతున్న అతడు తన స్నేహితులను నార్సింగిలో వదిలి వచ్చేందుకు వెళ్తూ మితిమీరిన వేగంతో బైక్ ను ఢీ కొట్టాడు. నిందితుడికి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించగా, మద్యం సేవించలేదని తేలింది. నిందితుడు సిటీలోని ప్రముఖ హాస్పిటల్లో పనిచేస్తున్న పల్మనాలజిస్ట్ డాక్టర్ కొడుకుగా తెలుస్తున్నది.
పని మాట్లాడుకొని వస్తుండగా యువకుడు..
మేడ్చల్: బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో యువకుడు మృతి చెందాడు. మేడ్చల్ మండలం కుమ్మరిగడ్డకు చెందిన మధు(31) డ్రైవర్ గా పనిచేస్తూ జీవిస్తున్నాడు. కొద్దిరోజులుగా ఉద్యోగం మానేశాడు. ఈ క్రమంలోనే సోమవారం కొంపల్లిలో ఒకరి దగ్గర డ్రైవర్ పని మాట్లాడుకొని బైక్ పై తిరిగి వస్తుండగా, అదుపుతప్పి చెట్టును ఢీకొట్టాడు. తీవ్ర గాయాల కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు.
ట్రీట్మెంట్ తీసుకుంటూ మరొకరు
అల్వాల్: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ యువకుడు ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతి చెందాడు. కానాజీగూడకు చెందిన చిన్న మహేశ్ (29) సెంట్రింగ్ పని చేస్తున్నాడు. ఈ నెల 21న రాత్రి తన ఫ్రెండ్ బర్త్‌డే వేడుకలకు బైక్‌పై వెళ్లి వస్తూ కిందపడ్డాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో మహేశ్ ను సమీప హాస్పిటల్‌కు తరలించగా, ట్రీట్మెంట్ తీసుకుంటూ సోమవారం మృతి చెందాడు.
బాలానగర్‌లో హిట్ అండ్ రన్.. కూతురు, మనవరాలు కళ్ల ఎదుటే మహిళ మృతి
కూకట్పల్లి: బాలానగర్ పీఎస్ పరిధిలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. స్కూటీని లారీ ఢీకొనడంతో మహిళ మృతి చెందింది. బాలానగర్‌లోని లైఫ్ స్పేస్ అపార్ట్మెంట్లో ఉంటున్న సంతోషిదేవి జైన్(54) తన కూతురు పూజ, మనవరాలు కుష్బూ(8)తో కలిసి సోమవారం మధ్యాహ్నం స్కూటీపై ఫతేనగర్‌కు వెళ్తున్నారు. పూజ డ్రైవింగ్ చేస్తుండగా, సంతోషిదేవి వెనుక, బాలిక మధ్యలో కూర్చుంది. బాలానగర్ ఫ్లైఓవర్ పిల్లర్ నంబర్11 వద్ద వీరిని లారీ వెనుక నుంచి ఢీ కొట్టడంతో ముగ్గురూ కిందపడ్డారు. ఆపై లారీ డ్రైవర్ ఆపకుండా వెళ్లడంతో టైర్ సంతోషిదేవి తలపై నుంచి వెళ్లి స్పాట్లోనే మృతి చెందింది. అదృష్టవశాత్తు తల్లీకూతుళ్లు పూజ, కుష్బూకు ఏం కాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నారు.