మండవ ఇంటికి రేవంత్.. టికెట్ ఇస్తామని హామీ! 

  • మండవ ఇంటికి రేవంత్ 
  • నిజామాబాద్ రూరల్ లేదా అర్బన్ టికెట్ ఇస్తామని హామీ! 
  • ఈ భేటీలో పాల్గొన్న బీజేపీ నేత రేవూరి ప్రకాశ్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్​ పార్టీ ఓ వైపు కొత్త లీడర్లకు ఆహ్వా నం పలుకుతూనే.. మరోవైపు టికెట్ దక్కక అలకబూనిన నేతలను బుజ్జగిస్తున్నది. పీసీసీ చీఫ్​ రేవంత్​రెడ్డి.. గతంలో టీడీపీ హయాంలో మంత్రిగా పని చేసిన మండవ వెంకటేశ్వరరావుతో ఆదివారం రాత్రి సమావేశమయ్యారు. కాంగ్రెస్​పార్టీలోకి రావాలని ఆయనను ఆహ్వానించారు. రేవంత్ తో పాటు పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి, తుమ్మల నాగేశ్వర్​రావు, మల్లు రవి, సంపత్​కుమార్.. మండవ ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. నిజామాబాద్​రూరల్ లేదా అర్బన్​ టికెట్ ఇస్తామని వాళ్లు హామీ ఇచ్చినట్టు తెలిసింది. అయితే ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని మండవ చెప్పినట్టు సమాచారం.

త్వరలోనే మండవ వెంకటేశ్వర రావు కాంగ్రెస్​ లో చేరతారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు ఈ భేటీలో బీజేపీ నేత రేవూరి ప్రకాశ్​రెడ్డి కూడా పాల్గొన్నారు. ఆయన కూడా కాంగ్రెస్ లోకి వెళ్తారన్న ప్రచారం జరుగుతోంది. రేవూరి పరకాల టికెట్​ను ఆశిస్తున్నట్టు పార్టీ వర్గాలు అంటున్నాయి. కాగా మండవ, రేవూరి ఇద్దరూ గతంలో టీడీపీలో పని చేశారు. ఆ చొరవతోనే రేవంత్​వారిని పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. 

నాగం ఇంటికి జానా.. 

నాగర్​కర్నూల్ టికెట్ రాలేదని అసంతృప్తితో ఉన్న నాగం జనార్దన్​రెడ్డి ఇంటికి ఆదివారం రాత్రి బుజ్జగింపుల కమిటీ సభ్యుడు జానారెడ్డి వెళ్లారు. ఆ యనను బుజ్జగించినట్టు తెలిసింది. నాగర్​క ర్నూల్ టికెట్ ఎప్పట్నుంచో నాగం జనార్దన్​రెడ్డి ఆశిస్తుండగా, అక్కడ కూచుకుళ్ల రాజేశ్​రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో నాగం అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తున్నది. రెండ్రోజుల క్రితమే గాంధీభవన్​కు నాగం కుమారుడు తన అనుచరులతో వచ్చి ఆందోళనకు దిగారు. తన తండ్రికి టికెట్ ​ఇవ్వాలని డిమాండ్​ చేశారు. కాగా, టికెట్ దక్కకపోయినా ఇండిపెండెంట్​గా పోటీ చేయాలని నాగం ఆలోచిస్తున్నట్టు తెలిసింది.