దేశవ్యాప్తంగా జనాభా లెక్కలతోపాటు కుల గణన చేయాలని దేశంలోని అన్ని పార్టీలు డిమాండ్ చేస్తుండగా.. బీజేపీ మిత్రపక్షంగా ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు అందుకు భిన్నంగా ప్రకటన చేయటం చర్చనీయాంశం అయ్యింది. కుల గణన కాదు.. ముందు నైపుణ్య గణన.. స్కిల్ గణన చేయండి అంటూ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై బీజేపీ ఇప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది అనేది ఆసక్తికరంగా మారింది. స్కిల్ గణన ద్వారా PPP ( పబ్లిక్, ప్రైవేట్, పీపుల్ పార్ట్నర్ షిప్ ) ని విస్తరించవచ్చని, దీని ద్వారా మంచి ఫలితాలొస్తాయన్నది చంద్రబాబు వాదన.
కేంద్ర బడ్జెట్లో నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పనకు మోడీ సర్కార్ ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో స్కిల్ గణన ప్రతిపాదనను కేంద్రం ముందు ఉంచారు చంద్రబాబు. ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని సహా పలువురు పెద్దలతో భేటీ అయ్యారు.భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ఏపీ అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని, జగన్ పాలనలో గత ఐదేళ్లుగా ఎక్కడిక్కడ ఆగిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను పునః ప్రారంభించి రాష్ట్రానికి పునర్వైభవం తీసుకొస్తానని అన్నారు.
జగన్ విధ్వంసపాలన చూసి పెట్టుబడులు పెట్టడానికి ఇన్వెస్టర్లు ముందుకు రావటం లేదని, అరాచక పాలనను అంతం చేశామని ఇన్వెస్టర్లకు ఎటువంటి భయం అవసరం లేదని భరోసా కల్పిస్తున్నామని అన్నారు సీఎం చంద్రబాబు. గత ఐదేళ్లలో నష్టపోయిన రాష్ట్రాన్ని పునర్నిర్మించటమే తమ లక్ష్యమని అన్నారు బాబు. రాష్ట్ర ప్రజలు ఎన్డీయే కూటమికి ఇచ్చన మ్యాండేట్ పై గౌరవం ఉదని, ఎన్డీయేతో కలిసి బాధ్యతగా ముందుకెళ్తామని స్పష్టం చేసారు చంద్రబాబు.