- ఈదురుగాలులతో కూడిన వర్షం
- గార్లలో రైల్వే స్టేషన్లో కూలిన గోడ
- పలుచోట్ల పంట నష్టం
వారం, పది రోజులుగా మండుతున్న ఎండలు ఉమ్మడి వరంగల్జిల్లాను ఉక్కిరిబిక్కిరి చేస్తుండగా, ఆదివారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడడంతో జనం ఊపిరి పీల్చుకున్నారు. బలమైన ఈదురు గాలులకు పలుచోట్ల పంటలు దెబ్బతిన్నాయి. మహబూబాబాద్, జనగామ జిల్లాలో ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. మహబూబాబాద్జిల్లా గార్ల మండల కేంద్రంలో రైల్వే స్టేషన్ లో సపోర్ట్ గోడ కూలిపోయింది. రైల్వే స్టేషన్ వద్ద రేకులు, గోడ కూలిపోయింది. ఈదురు గాలుల కారణంగా నరసింహులపేట మండలం బంజర గ్రామంలో మాతంగి వీరన్నకు చెందిన ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. పగలంతా భానుడి భగభగకు తాళలేక ఇబ్బందులు పడ్డ ప్రజలకు, సాయంత్రం కురిసిన గాలివనతో కొంతమేర ఉపశమనం లభించింది. కాగా, అక్కడక్కడ పంట నష్టం జరగడంతో రైతులు ఇబ్బందులు పడ్డారు.
- నెట్వర్క్, వెలుగు