రైతుకు ధరణి చేస్తున్నది మేలా? కీడా?

రైతుకు ధరణి చేస్తున్నది మేలా? కీడా?

రెవెన్యూ, భూ సమస్యలకు సర్వరోగనివారిణిగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘ధరణి’ పోర్టల్ రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న భూ సమస్యలు పరిష్కరించకపోగా, కొత్త సమస్యలు సృష్టించింది. తమ భూముల సర్వే నెంబర్లు పోర్టల్​లో కనిపించడం లేదని, ఉన్నా నిషేధిత జాబితాలో ఉన్నాయని వేలాది మంది రైతులు నిత్యం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారు. తెలంగాణలో ధరణి పోర్టల్ ద్వారా భూ సమస్యలన్నీ పరిష్కరించి రైతులను ఆదుకుంటామని సీఎం కేసీఆర్​ అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ధరణి పోర్టల్ ప్రారంభిస్తూ మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలంలో 2020 అక్టోబర్​29న సీఎం కేసీఆర్​ మాట్లాడుతూ.. దళారుల ప్రమేయం లేకుండా తహసీల్దార్ ఆఫీసు చుట్టూ తిరిగే పని లేకుండా పది నిమిషాల్లో ‘ఈ పాస్ బుక్’ భూ యజమాని చేతికి వస్తుందన్నారు. అన్ని భూ సమస్యలకు ధరణి పోర్టల్​ను పరిష్కారంగా చెప్పారు. కానీ ధరణి వచ్చినా భూ సమస్యలు తీరలేదు సరికదా.. మరిన్ని పెరిగాయి.

కొత్త సమస్యలు
గతంలో భూమి సమస్య ఏమున్నా.. తహసీల్దార్​ఆఫీసుకు పోతే.. పట్వార్లు లేదా గిర్ధవరీ లేదా ఎమ్మార్వో నైనా పరిష్కారం చేస్తారనే ఆశ ఉండేది. కానీ ధరణి పోర్టల్ వచ్చిన తర్వాత సమస్య ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాని అయోమయ స్థితిలో రైతులు బాధపడుతున్నారు. ఎమ్మార్వోలను కలిస్తే కలెక్టర్​దగ్గరకు వెళ్లాలని, కలెక్టర్​ను కలిస్తే సీసీఎల్ఏ ఆఫీసుకు వెళ్లాలని సూచిస్తున్నారు. భూ సమస్య పరిష్కారం కోసం పేద రైతు సీసీఎల్ఏ ఆఫీసుకు వెళ్లి పరిష్కరించుకోగలడా? గతంలో పట్టాపాసు బుక్​లు ఉన్న రైతుల పేర్లు, భూముల సర్వే నెంబర్లు ధరణి పోర్టల్​లో లేక, కొత్త పాసుబుక్​లు రాక.. వారు రైతుబంధు, రైతు బీమా లాంటి పథకాలు పొందలేకపోతున్నారు. క్షేత్రస్థాయిలో భూముల వివరాలను సరిగా ఆన్​లైన్​లో నమోదు చేయకపోవడంతో ధరణి పోర్టల్ లో అనేక తప్పులు దొర్లాయి. మిస్సింగ్ సర్వే నంబర్లు, మిస్సింగ్ పాస్ బుక్కులు, పట్టాభూమిని ప్రొహిబిటెడ్​ లిస్ట్​లో చేర్చడం లాంటి అనేక సమస్యలు రైతులను ఇప్పటికీ వేధిస్తున్నాయి. రాష్ట్రంలో చాలా చోట్ల అధికారుల తప్పిదాలతో భూములు అమ్ముకున్న యజమానుల పేర్లు పోర్టల్​లో ప్రత్యక్షమవగా, వాటిని కొని ఏండ్లుగా సాగు చేసుకుంటున్న రైతుల పేర్లు మాత్రం కనిపించడం లేదు. 

కొత్త మాడ్యుల్ ​తీసుకొచ్చినా..
ధరణి సమస్యల పరిష్కారానికి కొత్త మాడ్యుల్​తీసుకొస్తున్నట్లు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆయా భూ సమస్యల పరిష్కారం కోసం ఒక్కో సమస్యకు రూ.1000 చొప్పున దరఖాస్తు రుసుము తీసుకుంది. ఇలా ఇప్పటి వరకు రెండున్నర లక్షల దరఖాస్తులు వచ్చాయి. కేవలం అర్జీల ద్వారానే ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. దరఖాస్తులు తీసుకొని నెలలు గడుస్తున్నా.. వాటి పరిష్కారానికి అడుగు కూడా ముందుకు పడటం లేదు. ఇప్పటికీ15 లక్షల ఎకరాలకు పాసుబుక్కులు రాలేదు. పది లక్షల పాసుబుక్కులు రైతులకు అందాల్సి ఉంది. 14 లక్షల ఎకరాల లావణ్య పట్టా భూములను ప్రభుత్వం పెండింగ్​లో పెట్టింది. ధరణి పోర్టల్ పట్టాలకు హద్దులు లేవు. సర్వేతోపాటు మ్యాపులు లేవు, సర్వేయర్స్ లేరు, డిజైన్ చేసే అధికారులు లేరు, సమస్యలపై దరఖాస్తులు తీసుకునే వారు కూడా లేరు. 

ఏజెన్సీ ప్రాంతాల్లోనూ..
భూపరిపాలన, రెవెన్యూ వ్యవస్థలు ధరణి పోర్టల్ ద్వారా సమూలంగా ప్రక్షాళనకు గురవుతాయని, జవాబుదారితనం పెరుగుతుందని సీఎం కేసీఆర్​పదేపదే చెప్పారు. కానీ వాస్తవంగా అలా జరగలేదు. ధరణి నిర్వాకం వల్ల ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం కజ్జర్ల గ్రామంలో జైపాల్ రెడ్డి 36 ఏండ్ల క్రితం 8 ఎకరాల భూమి కొన్నాడు. ఇప్పుడు ధరణితో ఆ భూమి ఆయనకు దక్కకపోవడంతో ఆత్మహత్యకు యత్నించాడు. అతనికి గ్రామస్తులు అండగా నిలబడి ధైర్యమిచ్చారు. రాష్ట్రంలో చాలా మంది రైతులదీ ఇలాంటి పరిస్థితే ఉంది. ఏజెన్సీ ప్రాంతంలో రెవెన్యూ పట్టా భూమి ఉన్నా, లావణి పట్టా పేరుతో ఆప్షన్ లేదని భూములను సరి చేయడం లేదు. పెద్దపల్లి జిల్లా అంతరాంగం మండలం మొగల్ పహాడ్ లో రాజ వెంకట మురళి మోహన్ పేరు మీద 23 రకాల సర్వే నెంబర్లతో 697 ఎకరాల భూమి ఉన్నది. భూములకు పట్టా ఇచ్చేముందు ఆ భూమి సర్వే నెంబరుతో పాటు హద్దులు నిర్ణయించి బందోబస్తు చేయాలి. 

దిద్దుబాటు చర్యలు చేపట్టాలె..
భూసమస్య పరిష్కారం కోసం దరఖాస్తు చేసుకుంటున్న రైతులు.. సవరణల కోసం ఎన్ని నెలలు ఎదురు చూసినా ఫలితం లేకుండా పోతోంది. రాష్ట్ర మంత్రి హరీశ్ రావు అధ్యక్షతన ప్రభుత్వం ధరణి సమస్యలపై ఓ కమిటీ వేసింది. కాగా ఆ కమిటీ 36 రకాల సమస్యలు గుర్తించింది. వాటిలో 20 సమస్యలను తక్షణమే పరిష్కారం చేయవచ్చని పేర్కొంది. నెల రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని చెప్పినా.. అది ఏ మాత్రం అమలు కాలేదు. ఇప్పటికే రైతులు భూ సమస్యలతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు. పేద రైతుల పాలిట శాపంగా మారిన ధరణి పోర్టల్​ను సవరించకుంటే, దాన్ని రద్దు చేయాలన్న డిమాండ్ ​రోజు రోజుకు పెరుగుతుంది. ధరణి పోర్టల్​ రియలెస్టేట్ దళారులకు, ఉన్నతవర్గాల వారికి చిటికెలో పనిచేసి పెట్టేలా ఉందని, పేద, బక్క రైతుల భూ సమస్యలను మరింత జటిలం చేసిందని  పలు రైతు సంఘాలు కూడా ఆరోపిస్తున్నాయి. ధరణిపై మరో ఉద్యమం మొదలుగాక ముందే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టాలె. 

- ఎం.ధర్మనాయక్, తెలంగాణ గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు