- ఫిట్స్‌తో తల్లడిల్లిన బాధితుడు
కోటపల్లి, వెలుగు: అంబులెన్స్ కోసం ఎదురుచూస్తూ ఫిట్స్వచ్చిన వ్యక్తిని 4 గంటలపాటు ఎడ్ల బండిపైనే ఉంచి వేచి చూశారు. ఈ దయనీయ ఘటన మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. మండలంలోని ఆలుగామ గ్రామానికి చెందిన అంబాల దుర్గయ్య పశువులు కాస్తూ జీవనం సాగిస్తున్నాడు.
ఎప్పట్లాగే దుర్గయ్య శుక్రవారం ఉదయం పశువులను కాసేందుకు సమీప పొల్లాల్లోకి తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే దుర్గయ్య ఫిట్స్వచ్చి పడిపోయాడు. గమనించిన రైతులు అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. అనంతరం అతడిని ఎడ్ల బండిపై ఇంటికి తీసుకొచ్చారు. అంబులెన్స్వచ్చి తీసుకెళుతుందని ఎడ్ల బండిపైనే ఉంచారు.
కానీ ఎంత ఎదురుచూసినా రాలేదు. పేషెంట్ నరకయాతన అనుభవిస్తుండడంతో తన కొడుకును కాపాడాలని తల్లి పోసక్క చుట్టుపక్కల వారిని వేడుకున్నా లాభంలేకుండా పోయింది. స్థానికంగా ఉన్న హెల్త్ సబ్ సెంటర్ వైద్యురాలు రమణి వచ్చి పేషెంట్ ను పరిశీలించారు.
సబ్ సెంటర్ లో సరైన మందులు లేకపోవడంతో పేషెంట్ కు బీపీ మాత్రమే చెక్ చేసి వెళ్లిపోయారు. చివరకు 4 గంటల తర్వాత అంబులెన్స్రావడంతో దుర్గయ్యను చెన్నూర్‌కు తరలించారు. రోడ్డు సరిగా లేకపోవడంతో ఆలస్యం అయ్యిందని పేర్కొన్నారు. ప్రస్తుతం దుర్గయ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు.