- ఈటలపై విప్ ఆది శ్రీనివాస్ ఫైర్
హైదరాబాద్, వెలుగు: రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్రంలో అలజడులు సృష్టించొద్దని విప్ ఆది శ్రీనివాస్ బీజేపీ నేతలకు సూచించారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో బీజేపీ నేతలు చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన మంగళవారం ప్రకటనలో ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఈర్ష్య, ద్వేషంతో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. నిన్నటిదాకా సెక్యులరిస్టునని చెప్పుకున్న ఈటల.. ఇప్పుడు అమాంతం మతతత్వ వాదిగా మారారని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీది నీచ చరిత్ర అని ఈటల అనడంపై ఆది శ్రీనివాస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ కాంగ్రెస్ అని గుర్తు చేశారు. దశాబ్దాలుగా దేశంలో శాంతి, సామరస్యాన్ని కాపాడుతున్న పార్టీ కాంగ్రెస్ అని స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడే గోద్రా ఘటన జరిగిందన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ గుడిపై జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు.
అయితే, బీజేపీ అధికారంలో ఉన్న చాలా రాష్ట్రాల్లో ఆలయాలపై దాడులు జరిగాయని, అయినా అక్కడి ప్రభుత్వాలు పట్టించుకోలేదని విమర్శించారు. అనేక ఏండ్లుగా హైదరాబాద్లో అన్ని మతాలవాళ్లు కలిసిమెలిసి ఉంటున్నారని గుర్తుచేశారు.