హైదరాబాద్, వెలుగు: కేటీఆర్ కు జైలు భయం పట్టుకుందని, ఆ టెన్షన్ లోనే నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని విప్ ఆది శ్రీనివాస్ విమర్శించారు. ఓ నాలుగు రోజులు ఆగాలని, అప్పుడు అసలు రేవంత్ రెడ్డి అంటే ఏమిటో చూస్తారని కేటీఆర్ ను హెచ్చరించారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్ లో మీడియాకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పదేండ్లలో చేసిన అక్రమాలు బయటకు వస్తున్నాయన్న వణుకు కేటీఆర్ లో కనిపిస్తున్నదన్నారు.
అందుకే వెదవలు, హౌలాగాళ్లు అంటూ నీచమైన భాష మాట్లాడుతుండని మండిపడ్డారు. ‘‘మాకు ఏం చేతనవుతుందో రెండు ఎన్నికల్లో చూపించాం. నీ అయ్య కుర్చీ పీకి చూపించాం కదా. పార్టీ మారిన వారు వ్యభిచారులు అయితే.. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకొని మంత్రులను చేసిన వారిని ఏమనాలి. పదేండ్లలో 60 మందికి పైగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను చేర్చుకున్న మీ అయ్యకు ఏంపేరు పెట్టాలో నువ్వే చెప్పు’’ అంటూ ఆది శ్రీనివాస్ఫైర్ అయ్యారు.
‘‘అధికారంలో ఉన్నన్ని రోజులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన మిమ్మల్ని ఎన్ని రాళ్లతో కొట్టాలి. ఏ గాడిదలు కాయడానికి ఆనాడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకున్నావ్.. సిరిసిల్లలో అన్ని పార్టీల నుంచి పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థులను బీఆర్ఎస్ లో చేర్చుకున్న నీవు, ఇప్పుడు వాళ్లను పక్కన పెట్టుకొని సుద్దపూస కబుర్లు సక్కగా చెప్తున్నావు. ఇలా చెప్పడానికి కొంచెమైనా సిగ్గుండాలి. నువ్వెన్ని సొల్లు కబుర్లు చెప్పినా.. తెలంగాణ ప్రజలు నిన్ను, నీ అయ్యను పట్టించుకోరు”అంటూ విప్శ్రీనివాస్మండిపడ్డారు.