- కాంగ్రెస్ లీడర్ల డిమాండ్
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను ఆ పార్టీ సమర్థించకపోతే అతన్ని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని విప్ ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తున్నారా అని గురువారం ఒక ప్రకటనలో ప్రశ్నించారు. ఆంధ్ర సెటిలర్స్‌పై బీఆర్ఎస్ నిజస్వరూపం బయటపడిందన్నారు. ఆంధ్ర సెటిలర్స్ బతకడానికే వచ్చారని అవమానించేలా కౌశిక్ మాట్లాడారని, మరోసారి తెలంగాణ సెంటిమెంట్‌ను రగిల్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మరో ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. సీనియర్ ఎమ్మెల్యే అయిన అరికెపూడి గాంధీ విషయలో కౌశిక్ మాట్లాడిన మాటలు అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు. బతకడానికి వచ్చారంటూ ఆంధ్ర వాళ్లపై కౌశిక్ అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు.
అధికారం పోగానే బీఆర్ఎస్ నేతలు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కేసీఆర్ స్పందించాలని కాంగ్రెస్ సీనియర్ నేత అద్దంకి దయాకర్ డిమాండ్ చేశారు. బీఆర్ఎస్‌లో రాజకీయ సంక్షోభం నెలకొందని, ఓ వైపు కేటీఆర్, హరీశ్ కొట్టుకుంటుంటే.. ఇంకోవైపు కౌశిక్ రెడ్డి చిల్లర వేశాలు వేస్తుండని మండిపడ్డారు. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి మాట్లాడుతూ.. అధికారం పోగానే మళ్లీ ఆంధ్ర, తెలంగాణ లొల్లి మొదలుపెట్టారని బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు.
కాంగ్రెస్ సీనియర్ నేత కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌కు నిజంగా తెలంగాణలో ఉన్న ఆంధ్ర సెటిలర్స్ విషయంలో ఏ మాత్రం సానుకూలత ఉన్నా కౌశిక్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నేతలు కొనగాల మహేశ్, బండి రమేశ్ తదితర నేతలు కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై మండిపడ్డారు. అతన్ని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు .