కులగణనపై నీతులు చెప్పకండి :విప్ ఆది శ్రీనివాస్

కులగణనపై నీతులు చెప్పకండి :విప్ ఆది శ్రీనివాస్
  •     మా సర్కారుకు డెడ్ లైన్ పెట్టే అర్హత కేటీఆర్‌‌‌‌‌‌కు లేదు: ఆది శ్రీనివాస్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కుల గణనపై తమ ప్రభుత్వానికి నీతులు చెప్పాల్సిన అవసరం లేదని బీఆర్‌‌‌‌ఎస్‌‌ వర్కింగ్‌‌ ప్రెసిడెంట్‌‌ కేటీఆర్‌‌‌‌పై విప్ ఆది శ్రీనివాస్ ఫైర్ అయ్యారు. ఈ అంశంపై తమకు డెడ్‌‌లైన్ పెట్టే అర్హత కూడా ఆయనకు లేదన్నారు. గురువారం సీఎల్పీలో మీడియాతో ఆయన మాట్లాడారు. కుల గణనకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. దీనిపై అసెంబ్లీలో కూడా తీర్మానం చేసి, కేబినెట్‌‌లో నిర్ణయం తీసుకున్నామని, రూ.150 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చామని గుర్తుచేశారు.

గత ప్రభుత్వంలో చేసిన సమగ్ర కుటుంబ సర్వే ఇప్పటి వరకు ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చాక దేశవ్యాప్తంగా కులగణన చేస్తామని ప్రతిపాదన తెచ్చిందే రాహుల్ గాంధీ అని పేర్కొన్నారు. జనాభాలో ఎవరి వాటా ఎంతో తేల్చి.. అందుకు తగ్గట్టుగా నిధులు కేటాయించాలని రాహుల్ స్పష్టం చేశారన్నారు. గత పదేండ్లు అధికారంలో ఉండి కుల గణన ఎందుకు చేయలేదని బీఆర్‌‌‌‌ఎస్‌‌ నేతలను ప్రశ్నించారు. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు తగ్గించి బీఆర్‌‌‌‌ఎస్‌‌ మోసం చేసిందన్నారు. 

బీఆర్‌‌‌‌ఎస్ ప్రెసిడెంట్ పోస్ట్ బీసీకి ఇవ్వాలి..

పీసీసీ చీఫ్‌‌ మహేశ్‌‌ కుమార్ గౌడ్ బీసీ అని, మీ పార్టీలో ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఇద్దరూ మీ కుటుంబ సభ్యులే ఉన్నారని ఆది శ్రీనివాస్‌‌ అన్నారు. బీసీలపై ప్రేమ ఉంటే బీఆర్‌‌‌‌ఎస్ ప్రెసిడెంట్ పోస్ట్ లేదా వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ బీసీలకు ఇవ్వాలని డిమాండ్‌‌ చేశారు. తమ ప్రభుత్వ పాలన చూసి ఓర్వలేకనే బీఆర్‌‌‌‌ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. త్వరలో ఈ పార్టీ నుంచి అందరూ బయటకొస్తారని, మీ ఫ్యామిలీలోని నలుగురు మాత్రమే మిగులుతారని ఎద్దేవా చేశారు.

గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ప్రత్యేకంగా జీవో తీసుకొచ్చామని, గత పదేండ్లు వీరిని ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. సీఎం రేవంత్‌‌ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేస్తే తాము కూడా బాబు చిట్టి.. అని పిలుస్తామన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు లేకపోతే మీ కేసీఆర్ ఎక్కడని, వాళ్ల మీద ప్రేమతో నీకు కేటీఆర్ అని పేరు పెట్టారని గుర్తుచేశారు. విగ్రహాల మీద అంత ప్రేమ ఉంటే పదేండ్లలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదని ఆయన ప్రశ్నించారు.