- రాజకీయ అవసరాల కోసం దిగజారి మాట్లాడకండి
- నల్లచట్టాలు తెచ్చిన శాడిస్టులు మీరు కాదా?
- చౌకబారు విమర్శలతో స్థాయిని తగ్గించుకోవద్దని కామెంట్
హైదరాబాద్, వెలుగు: రాజకీయ పదవుల కోసం ఈటల రాజేందర్ దిగజారి మాట్లాడుతున్నారని, ఆయన నోరు అదుపులో పెట్టుకోవాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఫైరయ్యారు. దేశంలో నియంతలు, శాడిస్టులు, సైకోలు ఎవరో అందరికీ తెలుసన్నారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి కోసం వ్యక్తిత్వాన్ని చంపుకొని ఈటల మాట్లాడుతున్నారన్నారు.
‘రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలను తెచ్చిన శాడిస్టులు ఎవరు? నల్లచట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న వందలాది మంది రైతులు చనిపోయినా పట్టించుకోని సైకోలు ఎవరు? రైతులను కారుతో తొక్కించి చంపిన బీజేపీ నాయకులను ఏమనాలి? ఆ బీజేపీ నాయకుడిని కేంద్ర మంత్రి పదవిలో కొనసాగించి, ఆ తర్వాత టికెట్ ఇచ్చిన పార్టీ ఏది? అన్నం పెట్టే రైతుల్ని వదిలేసి పెట్టుబడిదారులకు పట్టం కడుతున్న మోదీని ఏమని పిలవాలి. రుణమాఫీ అన్న పదం కూడా పలకని బీజేపీ నాయకులు రైతుల కోసం దీక్ష చేస్తారా?’ అని నిలదీశారు.
25 రోజుల్లో రూ.18 వేల కోట్ల రుణమాఫీ చేసిన సీఎం రేవంత్ రెడ్డిని సైకో అంటే.. రైతులకు ఏమీ చేయని బీజేపీ నాయకులను ఏమని పిలవాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూసీ నిర్వాసితులను గాలికి వదిలేయలేదని, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తున్నామని చెప్పారు. ఆస్తులు కోల్పోయిన వారికి 2013 భూ నిర్వాసితుల చట్టం ప్రకారం పరిహారం ఇస్తామన్నారు. గుజరాత్ సబర్మతి రివర్ ఫ్రంట్ లో ఇండ్లు కోల్పోయిన వెయ్యి ఫ్యామిలీలకు పునరావాసం కల్పించకుండా బీజేపీ సర్కారు గాలికొదిలేసిందన్నారు.
‘ప్రధాని మోదీ గంగా నది ప్రక్షాళన చేస్తే గొప్పోడు, సబర్మతిని శుభ్రం చేస్తే మంచోడు.. సీఎం రేవంత్ మూసీని ప్రక్షాళన చేస్తే శాడిస్టా? ఈటలా.. నోరు అదుపులో పెట్టుకో’ అని హెచ్చరించారు. రాష్ట్రానికి వరద సాయం రూ. పది వేల కోట్లు అడిగితే కేంద్రం రూ.416 కోట్లు మాత్రమే ఇచ్చిందని, కేంద్రంతో మాట్లాడి రాష్ట్రానికి నిధులు తెచ్చి అప్పుడు మాట్లాడాలని సవాలు విసిరారు.