రాజన్న ఆలయ అభివృద్ధిపై కేసీఆర్‌‌‌‌ మాట తప్పిండు : విప్‌‌ ఆది శ్రీనివాస్‌‌

రాజన్న ఆలయ అభివృద్ధిపై కేసీఆర్‌‌‌‌ మాట తప్పిండు : విప్‌‌ ఆది శ్రీనివాస్‌‌
  • మీ మామ తరఫున ఆ దేవుడినిక్షమించమని అడుగు
  • హరీశ్‌‌రావుకు విప్‌‌ ఆది శ్రీనివాస్‌‌ సూచన

వేములవాడ, వెలుగు : వేములవాడ రాజన్న ఆలయానికి రూ.100 కోట్లు కేటాయించి, డెవలప్ చేస్తానని మోసం చేసింది మీ మామ కేసీఆరే అని మాజీ మంత్రి హరీశ్‌‌రావుపై విప్‌‌ ఆది శ్రీనివాస్‌‌ ఫైర్‌‌‌‌ అయ్యారు. మాట తప్పినం.. క్షమించు రాజన్న అని దేవుడిని అడగాల్సింది.. ఇప్పటికైన మీ మామ తరఫున రాజన్నను వేడుకో అని సూచించారు. మంగళవారం వేములవాడలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. గుడిని డెవలప్ చేస్తానని గత పదేండ్లలో తట్టేడు మట్టయినా తీశారా అని ప్రశ్నించారు. సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇస్తేనే కేసీఆర్ సీఎం అయ్యాడని గుర్తుచేశారు.

తనను ఓడించడానికే 2018లో హరీశ్ రావు కలిగోట సూరమ్మ ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారని, దానిని ఎందుకు పూర్తిచేయలేదో చెప్పాలని డిమాండ్‌‌ చేశారు. మీ హయాంలో కాళేశ్వరం కూలిపోయిందని, ఫోన్ ట్యాపింగ్, గొర్ల, బర్ల స్కామ్‌‌, ఈ ఫార్ములా రేసులో ఆక్రమాలకు పాల్పడి ఇప్పుడు సుద్దపూసలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అధికారం పోయిందన్న ఫ్రస్ట్రేషన్‌‌లో కేసీఆర్ ఉన్నారన్నారు. రైతుల రుణమాఫీ గురించి మాట్లాడే అర్హత మీకు లేదన్నారు. టెక్నికల్ సమస్యలతో కొంత మందికి రుణమాఫీ ఆగిపోయిందని చెప్పారు.

తాము మాట ఇవ్వకున్నా రాజన్న ఆలయ అభివృద్దికి సీఎం రేవంత్ రెడ్డి​ రూ.50 కోట్లు మంజూరు చేశారని తెలిపారు. బతుకమ్మ చీరల బకాయిలనూ చెల్లించామని, వేములవాడ క్లస్టర్ కింద యార్న్‌‌ (నూలు) డిపో మంజూరు చేశామని చెప్పారు. వేములవాడ రాజన్నకి ఇచ్చిన మాట తప్పినందుకే కేసీఆర్‌‌‌‌ పదవి పోయిందన్నారు. సమావేశంలో కాంగ్రెస్ నాయకులు నాగుల సత్యనారాయణ, చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, కనికరపు రాకేశ్, పుల్కం రాజు, కొక్కుల రాజు, జడల శ్రీనివాస్​, తోట రాజు తదితరులు పాల్గొన్నారు.